పిఠాపురంలో పవన్ సంక్రాంతి.. స్పెషల్ ఏంటంటే...
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుపుకోనున్నారు.
By: Tupaki Political Desk | 3 Jan 2026 5:25 PM ISTఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో జరుపుకోనున్నారు. తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఏపీలో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. అందులోనూ గోదావరి జిల్లాల్లో సంక్రాంతికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. ఈ సారి పవన్ కూడా అక్కడకే వెళుతుండటంతో పెద్ద పండుగ మరింత సంబరంగా జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పవన్ హాజరుకానున్న సంక్రాంతి సంబరాలను మరింత జోష్ ఉండేలా ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. దీంతో ఈ సారి పిఠాపురంలో సంక్రాంతి అదిరిపోతుందని అంటున్నారు.
భోగి, సంక్రాంతి, కనుమ పండుగల నాడు ఏపీలో పెద్ద సంబరాలే నిర్వహిస్తారు. భోగి రోజున ఊరూరా భోగి మంటలు వేస్తుంటారు. సంక్రాంతికి పెద్దలకు పితృ తర్పణాలు సమర్పిస్తారు. ఇక కనుమ రోజు సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కోస్తా జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి తీరంలోని ఐదు జిల్లాల్లో కోడి పందాలు చూసేందుకు జనం తండోపతండోలుగా తరలివస్తారు. ఈ మూడు రోజులలో కోడి పందాల రూపంలో కోట్లాది రూపాయలు పందాలు కాస్తుంటారు. సామూహిక భోజనాలతో అంతా సందడి చేస్తారు.
ఇలాంటి చోట ఈ సారి పవన్ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. అయితే పండుగ మూడు రోజులు కాకుండా కాస్త ముందుగానే పిఠాపురంలో పవన్ సంక్రాంతి వేడుకుల నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి పండుగ జరగనుండగా, కాస్త ముందుగా అంటే ఈ నెల 10న పిఠాపురంలో సంక్రాంతి వేడుక నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్. ఈనెల 9 నుంచి 11వ తేదీ వరకు మూడు రోజులు పాటు పిఠాపురంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించాలని పవన్ అధికారులకు సూచించారు. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్, పోలీసు, ఇతర శాఖల అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం హాజరయ్యే సంక్రాంతి కోసం జిల్లా అధికారులు సంస్కాృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం రూ.4.80 లక్షల రూపాయలను కేటాయించారు. ఆటపాటలతో ఆర్టిస్టులు సందడి చేయడం ద్వారా ప్రజల్లో ఉత్తేజం తీసుకురావాలని, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలని అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా గ్రామాల్లో సాంస్కృతిక శోభ పెంచేలా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తూ వచ్చేవారు. ఈ సారి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలోగానే పవన్ తన సొంత నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు చేయించడం చర్చనీయాంశం అవుతోంది.
