Begin typing your search above and press return to search.

పవన్ నోట మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మాట

లడ్డూ కానీ తిరుమల పవిత్రత కానీ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇక తిరుమలకు సగటున ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు వస్తారని పవన్ పేర్కొన్నారు.

By:  Satya P   |   11 Nov 2025 7:19 PM IST
పవన్ నోట  మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు  మాట
X

సనాతన ధర్మం గురించి గత కొంతకాలంగా ఏపీలో ప్రచారంలోకి వచ్చింది అంటే దానికి కారణం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన దాదాపు ఏడాది క్రితం సనాతన ధర్మం గురించి ఎలుగెత్తి మాట్లాడారు. మన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గత ఏడాది తిరుపతిలో ఏర్పాటు చేసిన ఒక అతి పెద్ద సభలో ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటే ఒక చట్టబద్ధమైన బోర్డు అవసరం అని ఆయన పేర్కొన్నారు.

తాజా పరిణామాల నేపధ్యంలో :

ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ కల్తీ అయింది అని గత ఏడాది పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయింది. అదే సమయంలో అందులో కలపరానివి కలిపారు అని కూడా ప్రచారం సాగింది. ఆ సమయంలో పవన్ ఉగ్రరూపం దాల్చారు. ఆయన ఏకంగా లడ్డూ కల్తీ విషయం కోట్లాది మంది విశ్వాసానికి సంబంధించినది అని చాటి చెప్పారు. అంతే కాదు ఆయన సనాతన దీక్ష చేపట్టారు. తిరుమల కొండలను కాలి నడకన ఎక్కి మరీ శ్రీవారిని దర్శించారు. ఆ సమయంలోనే పవన్ నుంచి వచ్చిన మాట సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు.

వెలుగులోకి వాస్తవాలు :

ఇక చూతే దీని మీద దర్యాప్తు చేస్తున్న సిట్ తాజాగా తిరుమల లడ్డూ సమస్యకు సంబంధించి కీలక విషయాలను వెల్లడిస్తోంది. అలా బయటపడుతున్న దిగ్భ్రాంతికరమైన వాస్తవాలతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషితమైన నెయ్యితో లడ్డూ లాంటి అంశాలు మొత్తం హిందూ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. దీనిపై ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో సారి తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో స్పందన వ్యక్తం చేశారు. లేటెస్ట్ గా ఆయన సనాతన పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని మరోసారి పిలుపునిచ్చారు.

ఆస్తిక జనుల విశ్వాసం :

ఇక పవన్ తాజాగా చేసిన ప్రకటనలో ప్రపంచ హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువగా అభివర్ణించారు. అంతే కాదు అది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నివాస కేంద్రంగా పేర్కొన్నారు. ఇక తిరుపతి లడ్డూ కేవలం తీపి పదార్థం కాదని అది ఒక భక్తి భావన అన్నారు. ఈ లడ్డూని ఎవరైనా తమ స్నేహితులు కుటుంబ సభ్యులు ఇతరులకు పంచుతున్నప్పుడు అది ఒక ఆధ్యాత్మిక భావోద్వేగం కలుగచేస్తుంది అని ఆయన అన్నారు ఇది యావత్తు హిందువుల సమిష్టి విశ్వాసమని, అంతే కాదు ఒక లోతైన విశ్వాసాన్ని సైతం ఈ లడ్డూ ప్రసాదం ప్రతిబింబిస్తుందని అన్నారు

దెబ్బ తీసినట్లే :

లడ్డూ కానీ తిరుమల పవిత్రత కానీ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఇక తిరుమలకు సగటున ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు వస్తారని పవన్ పేర్కొన్నారు. అలా సనాతన ధర్మం మీద విశ్వాసం ఉన్న వారు వారి మనో భావాలను, ఆచారాలను ఎగతాళి చేసినప్పుడు లేదా అణగదొక్కినప్పుడు అది కేవలం బాధ కలిగించేది మాత్రమే కాదని పవన్ అన్నారు. అది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వాసాన్ని, భక్తిని దెబ్బతీస్తుందని కళ్యాణ్ హెచ్చరించారు.

లౌకికవాదం అంటే :

ఇక లౌకికవాదం అన్నదే ఒక వైపే మాత్రం కాదని అది రెండు వైపులా ఉండాలని పవన్ స్పష్టం చేశారు. హిందువుల విశ్వాసానికి రక్షణకు గౌరవానికి సంబంధించిన అనేక విషయాలు చర్చించదగినవి ఏ మాత్రం కావు అని ఆయన పేర్కొంటూ అందుకే దేశంలో సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని పవన్ గట్టిగా కోరుకున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

అతి పురాతనమైనది :

భారతదేశంలో సనాతన ధర్మం పురాతనమైనది అని పవన్ అన్నారు. అంతే కాకుండా అందరి వాటాదారుల ఏకాభిప్రాయంతో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఇదే కరెక్ట్ సమయం అని పవన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తిరుమల లడ్డూ సమస్యపై ఇటీవలి దర్యాప్తు సాగుతోంది. అది ముమ్మరమైంది, దాంతో పవన్ తన స్పందనను ఈ విషయంలో వ్యక్తం చేశారు. సనాతన స్ఫూర్తిని నిలబెట్టడం కోసం తగిన చర్యలను తీసుకోవాలని పవన్ పేర్కొంటున్నారు. దేశంలో సనాతన ధర్మం అన్నది సజావుగా సాగేలా ఆ విషయాన్ని పర్యవేక్షించడానికి ఒక బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన తాజాగా పిలుపునిచ్చారు. మొత్తానికి పవన్ ఇచ్చిన ఈ పిలుపుతో దేశంలో మరోసారి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు మీద చర్చకు తెర లేస్తోంది.