పవన్ వర్క్ ఫ్రం మంగళగిరి.. భజానికి కట్టుతోనే సమీక్షలు, సమావేశాలు
శస్త్రచికిత్స అనంతరం గాయం మానడానికి ఆయన మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరోవైపు పవన్ ఎడం భుజం రొటేటర్ కఫ్ కూడా దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్నారు.
By: Tupaki Political Desk | 23 July 2026 6:15 PM ISTఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారిక విధుల్లో బిజీ అయిపోయారు. శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాల్సిన ఆయన పరిపాలన కుంటు పడకూడదనే ఉద్దేశంతో భుజానికి కట్టుతోనే అధికారిక సమావేశాలకు హాజరవుతున్నారు. వర్క్ ఫ్రమ్ మంగళగిరి అంటూ తాను చూస్తున్న మంత్రిత్వ శాఖలపై క్యాంపు కార్యాలయం నుంచే పాలన సాగిస్తున్నారు. వరుస సమీక్షలు, సమావేశాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. భుజం నొప్పితో బాధపడుతున్న పవన్ కు ముంబైలోని కొకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే.
శస్త్రచికిత్స అనంతరం గాయం మానడానికి ఆయన మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. మరోవైపు పవన్ ఎడం భుజం రొటేటర్ కఫ్ కూడా దెబ్బతినడంతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ ఆయన అధికారిక విధులను పక్కన పెట్టకపోవడమే హాట్ టాపిక్ అవుతోంది. శస్త్రచికిత్స అనంతరం పవన్ హైదరాబాద్‌లోని తన నివాసంలో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. అయితే రాష్ట్రానికి చెందిన నేతలు, అధికారులు పరామర్శ పేరిట హైదరాబాద్ కు పోటెత్తుతుండటం, పవన్ కు విశ్రాంతి లేకుండా చేయడంతో ఆయన అక్కడి నుంచి మంగళగిరి వచ్చేశారని చెబుతున్నారు. తాను రెస్ట్ తీసుకుంటే కార్యకర్తలు, నాయకులు పరామర్శ పేరుతో తనను కలిసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని, దీనివల్ల వారికి వ్యయప్రయాసలతోపాటు తనకు విశ్రాంతి లభించడం లేదని పవన్ భావిస్తున్నారని అంటున్నారు.
దీంతో హైదరాబాద్ నుంచి మంగళగిరి వచ్చి అధికారిక విధుల్లో పాలుపంచుకుంటే పరామర్శల రద్దీ నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనకు వచ్చారని చెబుతున్నారు. దీనివల్ల తాను ఫిట్ గానే ఉన్నానని, పరామర్శలు వద్దంటూ ఆయన పరోక్షంగా సందేశమిచ్చినట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక వైద్యుల సూచనలు పాటించే అవకాశం లేకపోవడంతో మంగళగిరి వచ్చేసిన పవన్ ఇక్కడ ఖాళీగా ఉండటం ఇష్టంలేక అధికారిక పనులు ప్రారంభించారని చెబుతున్నారు.
రెండు రోజులుగా శాఖాపరమైన సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ పవన్ బిజీబిజీగా గడుపుతున్నారు. భుజానికి బ్యాంచేజ్ తగిలించుకునే పవన్ ఈ సమావేశాలకు హాజరుకావడం హాట్ టాపిక్ అవుతోంది. ప్రభుత్వ పనులను ఎక్కువ రోజులు పెండింగ్‌లో పెట్టడం ఇష్టం లేక పవన్ రోజువారీ కార్యాలయ పనులను పర్యవేక్షణకు సిద్ధమయ్యారని అంటున్నారు. ఒకవైపు తీవ్రమైన నొప్పితో పోరాడుతూనే, మరోవైపు సమావేశాలతో జోరు చూపిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ పనితీరుపై కూటమి శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
