Begin typing your search above and press return to search.

'ఒమన్' ఉచ్చు నుంచి బయటపడిన మహిళ.. పవన్ కళ్యాణ్ జోక్యంతో సాధ్యం..

షానవాజ్ పంపిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడంతో అది కాస్తా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడింది. సోషల్ మీడియాలో ఆ వీడియోను చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు.

By:  Tupaki Political Desk   |   9 May 2026 12:21 PM IST
ఒమన్ ఉచ్చు నుంచి బయటపడిన మహిళ.. పవన్ కళ్యాణ్ జోక్యంతో సాధ్యం..
X

దేశం కాని దేశంలో ఉంటూ.. కష్టాలు అనుభవిస్తూ.. ‘అన్నా’ అన్నంతలోనే వేగంగా స్పందించి మహిళను కీచకుల చెర నుంచి కాపాడిన పవన్ కళ్యాణ్ పై ఏపీతో పాటు దేశం యావత్తు ప్రశంసలు కురిపిస్తోంది. ఆపదలో ఉన్నానని, కష్టం తాళలేకున్నానని ఒక మహిళ పంపిన వీడియో సందేశానికి స్పందించి తక్షణం విదేశాల్లో చిక్కుకున్న ఆమెను క్షేమంగా ఇంటికి తీసుకురావడం పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తి, బాధ్యతాయుతమైన నాయకత్వానికి నిదర్శనం. తన సొంత మనుషులు కూడా లేని పరాయి దేశంలో, ఒక గదిలో బందీగా ఉండి బాత్ రూమ్ నుంచి రహస్యంగా వీడియో పంపిన ఆ మహిళ ధైర్యం, ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్పందించిన ప్రభుత్వ తీరు అభినందనీయం. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందుల్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లాకు చెందిన షానవాజ్ అనే మహిళను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షేమంగా రాష్ట్రానికి తీసుకువచ్చారు. అరబ్ షేక్ వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ ఆమె చేసిన ఆర్తనాదానికి స్పందించిన పవన్, కేంద్రం సాయంతో ఆమెను ఇంటికి చేర్చారు.

షానవాజ్ ఆవేదన

ఈ ఘటన వెనుక బాధాకరమైన నేపథ్యం దాగి ఉంది. అన్నమయ్య జిల్లా వేంపాడుకు చెందిన షానవాజ్ ఉపాధి కోసం ఒమన్ దేశానికి వెళ్లి అక్కడ ఒక అరబ్ షేక్ ఇంట్లో పనిమనిషిగా చేరింది. కొంతకాలంగా సదరు యజమాని ఆమెను శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. రోజువారీ పనుల విషయంలో క్రూరంగా ప్రవర్తిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేసేవాడు. నరకం నుంచి కాపాడాలని షానవాజ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. యజమాని కంటబడకుండా బాత్ రూమ్‌లోకి వెళ్లి, తన పరిస్థితిని వివరిస్తూ పవన్ కళ్యాణ్ కు సెల్ఫీ వీడియో సందేశాన్ని పంపింది.

పవన్ కల్యాణ్ వేగవంతమైన స్పందన

షానవాజ్ పంపిన వీడియో రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ కావడంతో అది కాస్తా పవన్ కళ్యాణ్ దృష్టిలో పడింది. సోషల్ మీడియాలో ఆ వీడియోను చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. వీడియో చూసిన భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితిని వివరించారు. పవన్ సూచనతో విదేశాంగ శాఖ, అక్కడ ఉన్న ఎంబసీ అధికారులు ఆమె ఉన్న లొకేషన్ ను ట్రేస్ చేసి, అరబ్ షేక్ చెర నుంచి ఆమెను విడిపించారు. ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించిన అనంతరం, సురక్షితంగా భారతదేశానికి పంపేలా ఏర్పాట్లు చేశారు.

అండగా ఉంటాం..

ఒమన్ నుంచి తిరిగొచ్చిన షానవాజ్ నేరుగా పవన్ కళ్యాణ్ ను కలిసి తన కృతజ్ఞతలు తెలిపింది. తన ప్రాణాలను కాపాడి, తనను మళ్లీ కుటుంబం వద్దకు చేర్చినందుకు ఆమె భావోద్వేగానికి లోనవుతూ ధన్యవాదాలు తెలిపింది. ప్రపంచంలో ఎక్కడ ఏ తెలుగు వ్యక్తి కష్టాల్లో ఉన్నా అండగా ఉంటానని, తమ బాధ్యతను నెరవేరుస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

సాధారణంగా ఇలాంటి ఘటనల్లో రాజకీయ నాయకులు స్పందించడానికి సమయం పడుతుంటుంది. కానీ కేవలం ఒకే ఒక్క వీడియో ఆధారంగా అంతర్జాతీయ స్థాయిలో అధికారులను కదిలించి ఒక ప్రాణాన్ని కాపాడడం విశేషం. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ గారు విదేశాల్లో ఉన్న తెలుగు వారి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టడం సత్ఫలితాలను ఇస్తోంది.