Begin typing your search above and press return to search.

రియల్ పుష్పలు ఈ నలుగురేనా..! గబ్బర్ సింగ్ లిస్టు వైసీపీ నేతలదేనా?

ఎర్రచందనం స్మగ్లింగును ఉక్కుపాదంతో అణిచివేస్తానని పవన్ వార్నింగు ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహం కూడా ఉందని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   9 Nov 2025 3:00 PM IST
రియల్ పుష్పలు ఈ నలుగురేనా..! గబ్బర్ సింగ్ లిస్టు వైసీపీ నేతలదేనా?
X

ఎర్ర చందనం స్మగ్లర్లకు వార్నింగు ఇస్తూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తిరుపతి ప్రాంతంలో నలుగురు కింగ్ పిన్స్ ఉన్నట్లు తనకు సమాచారం ఉందని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికైనా స్మగ్లింగు ఆపేయాలని లేదంటే తన యాక్షన్ ఎలా ఉంటుందో చూస్తారని పవన్ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వంలో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. ప్రధానంగా పర్యావరణంతోపాటు ఆధ్యాత్మికతను మేలవించి ఎర్రచందనంపై పవన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఈ విషయంలో ఆయన కఠినంగా ఉన్నట్లు స్పష్టమవుతోందని అంటున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగును ఉక్కుపాదంతో అణిచివేస్తానని పవన్ వార్నింగు ఇవ్వడం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహం కూడా ఉందని అంటున్నారు. తన సొంత ప్రాంతమైన తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లింగులో ప్రతిపక్ష వైసీపీ నేతల పాత్రపై ముఖ్యమంత్రికి అవగాహన ఉందని అంటున్నారు. ఆయన ప్రోద్బలంతోనే పవన్ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. తాను ఏం అనుకున్న మొండిపట్టుదలతో సాధించే గుణం ఉన్న పవన్ అయితేనే ఒత్తిళ్లకు తల వంచక పని చేస్తారన్న నమ్మకంతోనే చంద్రబాబు ఈ బిగ్ టాస్క్ ఇచ్చి పవన్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్సును రంగంలోకి దించారని అంటున్నారు.

ఇక ముఖ్యమంత్రి మార్గనిర్దేశంలో రంగంలోకి దిగిన పవన్.. ఎర్రచందనం చెట్లకు బార్ కోడింగ్ తీసుకురావడంతోపాటు టాస్క్ ఫోర్సుకు పూర్తి అధికారాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ‘ఆపరేషన్ కగార్’ను ప్రస్తావించిన పవన్.. అవసరం అనుకుంటే స్మగ్లర్ల ఎన్ కౌంటర్లకు వెనుకాడబోమని సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగిన తర్వాత రెడ్ సాండిల్ స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఎర్రచందనం స్మగ్లింగు ఎక్కువగా జరిగిందని పవన్ ఆరోపిస్తుండగా, నలుగురు వైసీపీ నేతలపై ఉన్న అనుమానాలకు ఏమైనా ఆధారాలు లభించాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ పర్యటన తర్వాత రీల్ పుష్పలో ఉన్నట్లే పుష్ప, కొండారెడ్డి, మంగళం శ్రీను, మురుగన్ పాత్రధారులు రియల్ స్టోరీలోనూ ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. ఈ నలుగురు కింగ్ పిన్స్ ఎవరన్న అనుమానంతో పలువురు నేతల పేర్లతో అంతా ఆరా తీస్తున్నారు.