హద్దులు దాటితే యుద్ధమే....పవన్ సంచలన వ్యాఖ్యలు !
పవన్ చేసిన ఈ కామెంట్స్ ని బట్టి చూస్తే ఆయన ఒక కీలకమైన సందేశమే ఇచ్చారని అంటున్నారు.
By: Satya P | 5 Oct 2026 10:38 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడప జిల్లా ప్రొద్దుటూరు బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలా మాట్లాడుతాను అన్నది తెలిసిందే అని సభికులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతానికి రాజకీయాలు వద్దు అని ఇది కేవలం అభివృద్ధి సభ మాత్రమే అని ఆయన అన్నారు. సభకు వచ్చిన జనాల ఆవేశం ఉత్సాహం తనకు అర్థం అవుతున్నాయని ఆయన అంటూ తన నుంచి ఆవేశ ప్రసంగాలు మాత్రం కోరవద్దని ఆయన చెప్పుకొచ్చారు. ఒక విధంగా పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు అయితే చర్చకు తావిస్తున్నాయి.
అభివృద్ధి సభ అంటూ :
ఇది యుద్ధం సమయం కాదు, అందుకే ఇపుడు శాంతిగానే మాట్లాడుతాను అని పొద్దుటూరు సభలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. ఇది అభివృద్ధి సభ అని ఆయన గుర్తు చేశారు. రాజకీయ సభ కానే కాదని ఆయన స్పష్టం చేశారు. పైపెచ్చు రాయలసీమ అభివృద్ధికి సంబంధించిన సభ అని ఆయన చెప్పడం గమనార్హం అందువల్ల తాను సాఫ్ట్ టోన్ తోనే మాట్లాడుతాను అని పవన్ చెబుతూ సభలో అలాగే మాట్లాడారు. ఆయన ఎక్కువగా తన శాఖకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు, అలాగే రాయలసీమకు అమరజీవి జలధార జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుల ద్వారా కలిగే మేలు గురించి వివరించారు.
హద్దులు దాటితేనే యుద్ధం:
ఏవరైనా యుద్ధం వచ్చినప్పుడే మాట్లాడాలని పవన్ అన్నారు. అవతలివారు హద్దులు మీరితే యుద్ధం చేయాల్సిందే అని పవన్ స్పష్టం చేశారు. అంతే కాదు గొడవలు వచ్చినప్పుడు హద్దులు దాటినప్పుడు నేను ఎలా మాట్లాడతానో మీ అందరికీ తెలుసు అని కూడా చెప్పుకొచ్చారు. ఎన్నికల సమయంలో తన ప్రసంగం వేరేగా ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం శాంతి కావాలి, అలాగే అభివృద్ధి జరగడం ముఖ్యం అని ఆయన అన్నరు. పైగా ఇది ప్రభుత్వ అధికారిక అభివృద్ధి కార్యక్రమం కాబట్టి బాధ్యతాయుతంగా శాంతిగా కేవలం అభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడతానని పవన్ స్పష్టం చేశారు. రాయలసీమ పౌరుషం అంటే కేవలం గొడవలు పడటం కాదని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నిజమైన పౌరుషమని పవన్ పిలుపునిచ్చారు.
సందేశం ఇచ్చారా :
పవన్ చేసిన ఈ కామెంట్స్ ని బట్టి చూస్తే ఆయన ఒక కీలకమైన సందేశమే ఇచ్చారని అంటున్నారు. ప్రభుత్వ సభలలో అభివృద్ధి గురించి మాత్రమే ఎవరైనా మాట్లాడాలని రాజకీయ ప్రసక్తి లేకుండా చూసుకోవడం మేలు అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని అంటున్నారు. నిజంగా అది మంచి పరిణామమే. ప్రభుత్వం తరఫున బాధ్యతలు నిర్వహిస్తున్న వారు అభివృద్ధి గురించి మాట్లాడితేనే జనాలకు అన్ని విషయాలు తెలుస్తాయి. అదే సమయంలో ప్రత్యర్థుల మీద విమర్శలు చేయడం ద్వారా అసలు అంశాలు పక్క దారి పడతాయన్నది ఉంది. పవన్ తీరు చూస్తే ఆయన గత కాలం రాజకీయ నాయకులు అనుసరించిన హుందా అయిన రాజకీయాన్నే అనుసరిస్తున్నారు అని అంటున్నారు. ఆయన సభలలో ఎక్కడా విమర్శల జోలికి పోవడం లేదు, తాము ఏమి చేశాం, ఏమి చేయబోతున్నారు మాత్రమే చెబుతున్నారు. దీని వల్ల కేవలం పార్టీ జనాలకే కాదు అన్ని వర్గాల మన్ననలు పొందడమే కాదు స్పీచ్ కూడా అందరికీ చేరుతుందని అంటున్నారు. మొత్తానికి పవన్ మార్క్ స్టేట్మెంట్ అయితే అన్ని రాజకీయ పార్టీలకు దేశంలో కూడా అవలంబించడం అవసరం అని తెలియచేస్తోంది అంటున్నారు.
