మహిళా వ్లాగర్ సమస్యను తీర్చి మనసు గెలుచుకున్న పవన్ కళ్యాణ్
సాధారణంగా ఇలాంటి చిన్న విషయాలను రాజకీయ నాయకులు పట్టించుకోరనే భావన ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ భిన్నంగా స్పందించారు.
By: A.N.Kumar | 22 Dec 2025 12:02 PM ISTఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన పరిపాలనా దక్షతతోనే కాకుండా.. సామాన్యుల సమస్యల పట్ల చూపే తక్షణ స్పందనతో మరోసారి వార్తల్లో నిలిచారు. పవిత్ర క్షేత్రం శ్రీశైలంలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఉత్తరాది ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజ్హా సమస్యను పరిష్కరించి ఆమె ప్రశంసలు అందుకున్నారు.
అసలేం జరిగింది?
దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునే యాత్రలో భాగంగా స్వాతి రోజ్హా గతంలో శ్రీశైలానికి వచ్చారు. అయితే ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ కావడంతో ఆమెకు వసతి విషయంలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. భద్రతా కారణాల దృష్ట్యా డార్మిటరీలో ఉండాలని పోలీసుల సూచించడం ఆమెకు కొంత అసౌకర్యాన్ని కలిగించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదిక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు.
*పవన్ కళ్యాణ్ తక్షణ ఆదేశాలు
సాధారణంగా ఇలాంటి చిన్న విషయాలను రాజకీయ నాయకులు పట్టించుకోరనే భావన ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ భిన్నంగా స్పందించారు. ఒంటరిగా వచ్చే మహిళా భక్తులు, మహిళా ట్రావెల్ వ్లాగర్లకు వసతి కల్పనలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే ఆమెను మరోసారి శ్రీశైలానికి రావాలని స్వయంగా ఆహ్వానించారు.
సాదర స్వాగతం.. సంతృప్తికర దర్శనం
పవన్ కళ్యాన్ పిలుపు మేరకు తాజాగా స్వాతి రోజ్హా తన కుటుంబ సభ్యుడితో కలిసి మళ్లీ శ్రీశైలాన్ని సందర్శించారు. ఈసారి దేవస్థానం అధికారులు ఆమెకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించారు. మల్లికార్జున స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఒక చిన్న విన్నపానికి ఇంతవేగంగా స్పందించి.. మహిళల భద్రతకు పెద్దపీట వేసిన పవన్ కల్యాణ్ గారికి కృతజ్ఞతలు’ అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సనాతన ధర్మం.. ఆచరణలో పవన్
పవన్ కళ్యాణ్ తరుచుగా చెప్పే ‘సనాతన ధర్మం’ అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు.. మహిళలను గౌరవించడం , వారికి రక్షణ కల్పించడం అని ఈ ఘటన ద్వారా నిరూపితమైందని నెటిజన్లు కొనియాడుతున్నారు. కేవలం శ్రీశైలం ఘటన మాత్రమే కాకుండా.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పర్యాటక ప్రాంతాల్లో భక్తుల సౌకర్యాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. పవన్ ఇప్పటికే ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. దీని ద్వారా ఆలయాల నిర్వహణలో పారదర్శకత , భక్తుల సేవలలో మెరుగుదల మరియు ధార్మిక విలువల రక్షణ వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.
ఒక ట్రావెల్ వ్లాగర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం, ఇక్కడి పాలకుల స్పందన జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం విశేషంగా చెప్పొచ్చు.
