మంచి తనమే పవన్ రాజకీయం
మంచితనంతో రాజకీయం చేయడం అన్నది జనసేనాని పవన్ అలవరచుకున్న విధానం. జనసేన విషయంలో ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు.
By: Satya P | 25 Jun 2026 9:25 AM ISTమంచితనంతో రాజకీయం చేయడం అన్నది జనసేనాని పవన్ అలవరచుకున్న విధానం. జనసేన విషయంలో ఆయన అలాగే వ్యవహరిస్తున్నారు. అందుకే పాతికేళ్ల సుదీర్ఘ ప్రస్తానాన్ని కూడా ఆయన పెట్టుకున్నారు. పదేళ్ళు కష్టపడ్డాక ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి కోసం ఆయన మరింత కాలం వేచి ఉండాలనుకుంటున్నారా ఆ పదవి మీద ఆయనకు ఆశ ఉందా లేదా అన్నది పక్కన పెడితే నైతిక నిష్టతో రాజకీయం చేయాలని పవన్ అనుకుంటున్నారని పదే పదే ఆయన చెబుతున్న మాటలు చేస్తున్న ప్రకటనలు తెలియచేస్తున్నాయి.
వైరల్ అవుతున్న తీరు :
పవన్ ఈ మధ్యనే రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో అనేక విషయాల మీద మాట్లాడుతూ చంద్రబాబు ఆయన అరెస్టూ జైలు గురించి చెప్పారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబుని అరెస్టు చేసి రాజమండ్రి జైలులో నాటి వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అది పెను సంచలనంగా అప్పట్లో ఎగిసిపడింది. ఇక పవన్ అయితే ఈ ఘటన తరువాత చంద్రబాబుని నేరుగా జైలుకు వెళ్ళి పరామర్శించి వచ్చారు. జైలు బయటనే ఆయన టీడీపీ జనసేన పొత్తుల ప్రకటన చేసి ఏపీ రాజకీయ స్వరూపాన్నే టోటల్ గా మార్చేశారు. ఆ సందర్భాన్ని సంగతులను ఆయన రాజమండ్రి సభలో తల్చుకుంటూ రాజమండ్రి జైలుని కట్టించిన వ్యక్తినే జైలులో పెట్టారు అన్నారు. ఆ స్థితిలో బాబుని చూస్తే బాధేసింది అని అన్నారు. పవన్ చెప్పిన మాటలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతో మందిని కనెక్ట్ చేస్తున్నాయి.
దిగజారుడు రాజకీయం :
ఒక వ్యక్తి భౌతికంగా ఉండకూడదనో లేక ఆయన జైలు పాలు కావాలనో తాను రాజకీయాలు చేయను అని ఈ సందర్భంగా పవన్ అన్నారు. అంత దిగజారిపోయి చేయడానికి పార్టీని పెట్టలేదని కూడా చెప్పారు. తాను అలాంటి వాడిని కాదని అంటూ బాబు జైలులో ఉంటే తాను సీఎం అయిపోవచ్చు అనుకుంటే అంతకంటే దౌర్భాగ్య రాజకీయం లేదని అన్నారు. అలా తనకు కొందరు సలహా ఇచ్చిన వారు నాడు ఉన్నారని తనకు అదంతా ఇల్లాజికల్ అనిపించింది అని కూడా చెప్పారు.
అది కుదిరే పనేనా :
అయితే పవన్ చెప్పింది నూరు శాతం కరెక్ట్. దౌర్భాగ్య రాజకీయాలు ఎవరూ చేయకూడదు, కానీ రాజకీయాలే అలా ఉన్నాయని అంటున్నారు అంతా. అది ఈనాటిది కాదు. యుగాల నుంచి అలాగే ఉంది. అన్న దమ్ముల మధ్యనే కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. తన కొడుకుకి సింహాసనం కోసం కన్న తల్లిలా పెంచిన కైకేయి రాముడిని అడవులకు పంపించింది. త్రేతాయుగం అయినా ద్వాపర యుగం అయినా స్టోరీ మాత్రం అదే. కలియుగంలో చెప్పాల్సింది లేదు. నైతిక నిష్టతో రాజ్యాలు అందుకోవడం జరిగే పనేనా అందునా ఈ రోజుల్లో అన్న చర్చ కూడా వస్తోంది.
చాణక్య నీతి అంటేనే :
ఇప్పటికి మూడు వేల ఏళ్ల నాడు చాణక్యుడు చెప్పిన రాజనీతి ఏమిటి అన్నది గుర్తు చేసుకుంటే రాజకీయం అంటే ఏ బంధాలకూ కట్టుబడనిదే అని చెబుతారు. ఏ బంధాలు చూడకుండా లక్ష్యం వైపుగా చూడమన్నదే కౌటిల్యుడి హిత బోధ. అలాంటి కుటిలమైన నీతి బోధ చేసినందుకే చాణక్యుడికి కౌటిల్యుడు అని పేరు వచ్చింది. మరి పవన్ చూస్తే మంచితనంతో తన రాజకీయం అని అంటున్నారు. వర్తమానంలో అది ఏ మేరకు సాధ్యమన్నది చూడాల్సి ఉంది. చాన్స్ రాజకీయం అయినా ఏ రంగం అయినా తీసుకోవాల్సిందే అన్నది ఆధునిక రాజకీయం బోధిస్తోంది. నంబర్ వన్ లో ఒక్కరే ఉంటారు. నంబర్ టూ గా ఉన్న వారు వారే వెనక్కి వస్తారని తగ్గినా ఆలోచించినా అక్కడే ఉండిపోతారు అన్నది కూడా చెబుతోంది. ఏది ఏమైనా పవన్ వి సగటు మనిషి ఆలోచనలు అని ఆయన మాటల ద్వారా తరచూ తెలుస్తున్న విషయం. ఆయన ఎంచుకున్న మార్గంలోనే ఆయన లక్ష్యాలను సాధించి చూపిస్తే అంతా సంతోషిస్తారు. అలాంటి రోజు ఒకటి రావాలనే అభిమాన గణం కోరుకుంటున్నారు మరి.
