Begin typing your search above and press return to search.

పవన్ స్థానం పదిలం...జనసేనకు అదే ఊతం !

ఎవరు కాదన్నా పవన్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో బలమైన నాయకుడు. ఆయన వెంట దాదాపుగా ఇరవై శాతం ఓటు షేర్ ఉన్న సామాజిక వర్గం ఉందన్నది కచ్చితమైన అంచనాగా వేస్తున్నారు.

By:  Satya P   |   29 Sept 2026 9:04 AM IST
పవన్ స్థానం పదిలం...జనసేనకు అదే ఊతం !
X

పవన్ కళ్యాణ్ కి సినీ గ్లామర్ ఉంది. దానితో పాటు ఆయన వ్యక్తిగతంగా సంపాదించుకున్న ఇమేజ్ ఉంది. ఆయన సగటు జనంలా ఆలోచించే ధోరణి కొత్త నాయకుడిని చూసే అవకాశాన్ని ఇస్తోంది. ఇక పవన్ చుట్టూ ఒక బలమైన ఆకాంక్ష దుర్భేధ్యమైన కోటగా నిలిచి ఉంది. దాంతో పవన్ ని జనసేనను అంత సులువుగా పక్కన పెట్టడం సాధ్యం కాదు. ఏపీ రాజకీయాల్లో పవన్ స్థానం పదిలంగానే ఉంది, ఉండబోతోంది. కనీసం మరో దశాబ్ద కాలం అయినా పవన్ తోనే రాజకీయం చేసేందుకు ఆయనలోనే తమ బలమైన ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు కాపులు సిద్ధంగా ఉన్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి. జనాభా పరంగా కాపులు ఏపీలో అత్యంత బలమైన సామాజిక వర్గం అని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆయన వద్దన్నా కూడా :

ఇక్కడ ఒక తమాషా ఉంది. పవన్ తనకు కులం మతం లేదని అంటున్నారు. అయితే ఆయన వద్దు అన్నా కూడా కాపులు మాత్రం ఆయనలోనే తమ చిర కాల కోరిక నెరవేర్చుకునే సంకల్పాన్ని చూస్తున్నారు. అరవై డెబ్బై దశకంలో మొగ్గగా మొలిచిన ఒక కోరిక ఎనభై తొంబై దశకంలో మరో రూపం దాల్చి రెండు వేల దశకం తరువాత బాహాటం అయి విభజన ఏపీలో మరింత స్పష్టతను సంతరించుకున్న ఆ కోరిక కాపులకు రాజ్యాధికారం. ఇక ఈ కోరిక అలా పురుడు పోసుకుని ఈ స్థాయికి రావడం వెనక ఎందరో ఉన్నారు. వంగవీటి రంగా నుంచి ముద్రగడ పద్మనాభం, చేగొండి హరిరామజోగయ్య ఇలా వీరే కాదు, ప్రజారాజ్యం పెట్టిన చిరంజీవిని కూడా కాపులకు ఐకాన్ గా చూసుకున్నారు. అయితే ఇపుడు అన్నీ కలిసి పవన్ దగ్గరే ఆగాయి అని విశ్లేషిస్తున్నారు.

విడదీయలేని శక్తిగా :

ఎవరు కాదన్నా పవన్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో బలమైన నాయకుడు. ఆయన వెంట దాదాపుగా ఇరవై శాతం ఓటు షేర్ ఉన్న సామాజిక వర్గం ఉందన్నది కచ్చితమైన అంచనాగా వేస్తున్నారు. టీడీపీ ఈ విషయంలో జాగ్రత్తగానే ఉంటోంది. పవన్ చరిష్మాతో పాటు బలమైన సామాజిక వర్గం ఆకాంక్షలు కూడా టీడీపీ పెద్దలకు తెలుసు. అందుకే కూటమిలో పవన్ కి కీలక భూమిక ఇచ్చారు. అయితే ఇది ఇక్కడితో సరిపోదన్నది కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉన్నా స్నేహ పూర్వక పోటీల రూపంలో కూడా జనసేన కనుక సత్తా చాటితే మాత్రం రాజకీయ ముఖ చిత్రంలో భారీ మార్పు వస్తుందని అంటున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి చాలా జిల్లాలలో బలమైన నేతలు వీడి జనసేనలో చేరిపోయారు. రానున్న కాలంలో ఏపీలో జనసేన దిశగా రాజకీయ పునరేకీకరణ మరింతగా జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

తెలంగాణా లాంటిదే :

తెలంగాణా రాష్ట్రం తమ అస్తిత్వం అని ఆత్మగౌరవం అని అక్కడి జనాలు భావించారు. తాత్కాలికంగా ఉద్యమాలు ఆగినా వారి కోరిక అయితే చల్లారలేదు, అందుకే 1969లో విఫలం అయినా 2000 తరువాత మళ్లీ రాజుకుంది. చివరికి అది సాధ్యపడింది. అది ప్రాంతీయ పరమైన ఆకాంక్షగా దృఢమైన వైఖరిని ప్రదర్శించి రాజకీయ పరిణామాలను సమూలంగా ఉమ్మడి ఏపీలో మార్చేసింది. ఇపుడు ఏపీలో సామాజిక ఆకాంక్షగా కాపుల కోరిక నిలుస్తుంది అని అంటున్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంత పట్టుగా జనసేన సీట్లు కోరుతోంది అని అంటున్నారు. ఇక 2029 ఎన్నికలలో దీని ప్రభావం కూడా బాగానే ఉంటుంది అని అంటున్నారు. ఏపీలో రాజకీయంగా అన్ని రకాల అవకాశాలు జనసేన ఎదిగేందుకు ఉన్నాయన్నది ఇక మీదట జరిగే పరిణామాలు చెబుతాయని అంటున్నారు. మరో వైపు చూస్తే జనసేన పార్టీని కానీ పవన్ రాజకీయాన్ని కానీ తక్కువ అంచనా వేసే పార్టీలు ఉంటే కనుక అవి మళ్ళీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి.