Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ స్థానిక ఎన్నిక‌ల స్ట్రాట‌జీ.. పంచాయ‌తీల్లో భారీ మార్పు

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

By:  Garuda Media   |   23 Oct 2025 8:47 PM IST
ప‌వ‌న్ స్థానిక ఎన్నిక‌ల స్ట్రాట‌జీ.. పంచాయ‌తీల్లో భారీ మార్పు
X

ఏపీ డిప్యూటీ సీఎం, పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న‌ పంచాయ‌తీల‌ను సంస్క‌రించేందుకు న‌డుంబిగించారు. దీనిలో భాగంగా న‌వంబ‌రు 1 నుంచి ప్రాంతీయ అభివృద్ధి కార్యాల‌యాల‌ను ప్రారంభించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. పంచాయ తీల పాలన సంస్కరణల ఫలితాలు ప్రజలకు అందించాలని అన్నారు. గురువారం సుదీర్ఘంగా అధికారు ల‌తో భేటీ అయిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అనేక అంశాల‌పై చ‌ర్చించారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు (డి.డి.ఓ.) కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. ముఖ్యంగా క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించాల‌న్నారు.

పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని ప‌వ‌న్‌ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. నిధులు సమకూర్చడంలోను, పాలనాపరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందన్నారు.

అయితే.. ఆ ఫలితాలు ప్రజలకు చేర్చి పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలని ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించారు. నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు. కాగా.. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌ట్టు సాధించే దిశ‌గా ప‌వ‌న్ కార్యాచ‌ర‌ణ ప్రారంభించార‌న్న వాద‌న వినిపిస్తోంది.