Begin typing your search above and press return to search.

పులి మరణం పెద్ద కష్టం : పవన్ కల్యాణ్ నుంచి కీలక ఆదేశాలు

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టి.ఆర్.) పరిధిలో పులి మరణంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చలించిపోయారు.

By:  Tupaki Political Desk   |   1 Aug 2026 10:22 AM IST
పులి మరణం పెద్ద కష్టం : పవన్ కల్యాణ్ నుంచి కీలక ఆదేశాలు
X

నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్.ఎస్.టి.ఆర్.) పరిధిలో పులి మరణంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చలించిపోయారు. పులి మరణంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు తెలుసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పులి మరణం అంటే సాధారణ అంశం కాదని, అడవులను వన్య ప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు డివిజన్, రాచర్ల బీట్‌లో బుధవారం పులి కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ప్రకృతిలో సమతుల్యత ఎప్పుడూ దెబ్బతినకూడదని, పులుల సంరక్షణ అత్యంత కీలకమని డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. రాచర్ల బీట్‌లో ఆడపులి మరణం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. పులి ప్రాణం కోల్పోవడం పర్యావరణ వ్యవస్థకు కూడా తీరని లోటని స్పష్టం చేశారు.

ఈ ఘటన సహజంగా జరిగిందా? లేక వేటగాళ్ల దుశ్చర్యలు, విషప్రయోగం వంటి అసాంఘిక కార్యకలాపాల వల్ల మానవ ప్రమేయంతో జరిగిందా? అనే కోణంలో సమగ్రమైన విచారణ జరపాలని ఎన్.ఎస్.టి.ఆర్. ఫీల్డ్ డైరెక్టర్‌ను పవన్ ఆదేశించారు. వన్యప్రాణి సంరక్షణ చట్ట నిబంధనలకు అనుగుణంగా పోస్ట్‌మార్టం, శాస్త్రీయ ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాలను నిగ్గుతేల్చాలని స్పష్టం చేశారు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదనే ఆయన హెచ్చరిక.. అటవీ అక్రమాలకు, వేటగాళ్లకు కూటమి ప్రభుత్వంలో తావులేదనే స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది.

పెట్రోలింగ్ పెంపు, క్షేత్రస్థాయి నిఘా బలోపేతం

భవిష్యత్తులో ఇలాంటి హృదయవిదారక ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ శాఖ యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేశారు. అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను వెంటనే పెంచాలని, క్షేత్రస్థాయి నిఘాను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ సంపదను, ఇక్కడి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన పునరుద్ఘాటించారు. అటవీ, వన్యప్రాణి సంరక్షణ పట్ల పవన్ కళ్యాణ్ చూపుతున్న ఈ ప్రత్యేక శ్రద్ధ, తీసుకుంటున్న కఠిన చర్యలు రాష్ట్రంలోని పర్యావరణ రక్షకులకు, ప్రకృతి ప్రేమికులకు ఎంతో భరోసానిస్తున్నాయి. వన్యప్రాణుల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం ఎంతటి కఠినమైన విధానంతో ముందుకు వెళ్తుందో ఈ ఘటన స్పష్టం చేస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.