పవన్‌కు కౌంటర్‌గా.. వైసీపీ 'ఢిల్లీ సమావేశాలు'
జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీలో సమావేశం పెట్టారు. `దేశ సమగ్రత సేన ప్రస్థానం` పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రతిపాదించారు.
By: Garuda Media | 20 Jun 2026 4:00 AM ISTజనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల ఢిల్లీలో సమావేశం పెట్టారు. `దేశ సమగ్రత సేన ప్రస్థానం` పేరుతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రతిపాదించారు. దీంతో జనసేన పార్టీ జాతీయ స్థాయిలో పుంజుకునేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలు పంపించారు. ముఖ్యంగా ప్రధాని మోడీ సహా.. దేశ ఐక్యత, సమగ్రతల విష యంలో పవన్ తన దృక్ఫథాన్ని ప్రకటించారు. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా వైసీపీ కూడా ఢిల్లీ వేదికగా వరుస ప్రెస్ మీట్లు పెడుతోంది. దీనిలో భాగంగా శుక్రవారం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సుదీర్ఘ మీడియా సమావేశం నిర్వహించారు.
సాధారణంగా వైసీపీ నాయకులు ఏం మాట్లాడినా.. తాడేపల్లికే పరిమితం అవుతున్నారు. పార్టీకేంద్ర కార్యాలయంలోనే మీడియా తో మాట్లాడుతున్నారు. అయితే.. వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మీడియా సమావేశం నిర్వహించడం ఆసక్తిగా మారింది. అయితే..ఆయన గతంలో కూడా ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు కదా అనే డౌటు రావొచ్చు. కానీ, అప్పటికి ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాదు.. ఆయన పోతూ పోతూ.. `మరిన్ని సమావేశాలు ఢిల్లీలోనే జరుగు తాయి` అని పేర్కొనడం వైసీపీ వ్యూహాత్మక రాజకీయాలను ప్రస్తావిస్తోంది.
ఏంటి లాభం?
పవన్ కల్యాణ్‌పై ఇప్పడంటే వైసీపీ జోరు తగ్గించింది కానీ.. ఎన్నికల సమయంలో భారీ ఎత్తున విరుచుకుడిన విషయం తెలిసిం దే. ఇక, రెండేళ్లుగా కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని వైసీపీ వ్యాఖ్యలు చేస్తోంది. రాజకీయంగా విమర్శలు చేస్తోంది. కానీ.. పవన్‌పై ఎక్కడా పన్నెత్తు మాట అనడం లేదు. అయితే.. ఇప్పుడు పవన్‌ను టార్గెట్ చేసుకుని ఢిల్లీ కేంద్రంగా వైసీపీ వ్యూహాత్మక ప్రెస్ మీట్లు పెడుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తద్వారా.. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయిలో గళం వినిపించాలని భావిస్తున్న పవన్ కల్యాణ్‌కు ఒకరకంగా వైసీపీ చెక్ పెట్టే వ్యూహం ఏదో ఉందని అంచనా వేస్తున్నారు. తద్వారా జాతీయ రాజకీయాల్లో పవన్ చరిష్మాను డైల్యూట్ చేస్తున్నారా? ఈ ప్రయత్నం దిశగా వైసీపీ అడుగులు వేస్తోందా? అనేది చర్చనీయాంశంగా మారింది.
తాజాగా.. ఏపీ రాజకీయ నేతలు.. ఢిల్లీలో సమావేశం పెట్టడం అత్యంత అరుదు. గతంలో జగన్ గెలిచిన నేపథ్యంలో ఒకసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆతర్వాత.. ఏపీకి చెందిన నాయకులు ఎవరూ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టలేదు. సమావేశాలు అసలే నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఓ జాతీయ మీడియా చర్చ చేపట్టింది. ఏపీ రాజకీయాలు ఢిల్లీలో జరుగుతుండడం.. ప్రాంతీయ పార్టీలు హస్తినలో చక్రంతిప్పేందుకు ఉత్సాహంగా ఉండడంపైనే ఈ చర్చసాగింది. ఈ క్రమంలోనే పవన్ పార్టీ దూకుడుకు.. జాతీయస్థాయిలో విస్తరించే ప్రతిపాదనకు వైసీపీ పరోక్షంగా చెక్ పెట్టేందుకు.. ఇలా ఢిల్లీలో మీడియా సమావేశాలు పెడుతోందన్న సందేహాలను పలువురు విశ్లేషకులు వ్యక్తం చేయడం గమనార్హం.
