Begin typing your search above and press return to search.

పవన్ లోకేష్ ఫస్ట్ టైం ఎపుడు కలుసుకున్నారు ?

వెండి తెర మీద పవర్ స్టార్, జనంలో సేనానిగా ఉంటూ జనసేన అధినేతగా రాజకీయాల్లో తన మార్క్ ని చూపిస్తున్న వారు పవన్ కళ్యాణ్.

By:  Satya P   |   30 Jan 2026 11:47 PM IST
పవన్ లోకేష్ ఫస్ట్ టైం ఎపుడు కలుసుకున్నారు ?
X

వెండి తెర మీద పవర్ స్టార్, జనంలో సేనానిగా ఉంటూ జనసేన అధినేతగా రాజకీయాల్లో తన మార్క్ ని చూపిస్తున్న వారు పవన్ కళ్యాణ్. ఆయన ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు చూస్తున్నారు. ఇక నారా లోకేష్ చంద్రబాబు కుమారుడిగా రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఈ రోజున తనదైన ముద్రను బలంగా వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈసారి ఏపీలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబుకు కుడి ఎడమలుగా ఈ ఇద్దరు నాయకులు నిలిచి స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోయారు.

ఇద్దరి మధ్య బంధం :

నారా లోకేష్ చాలా స్పోర్టివ్ గా ఉంటారు, ఆ విషయం అందరికీ ఇపుడు బాగా అర్ధం అవుతోంది. ఆయన ఎవరితోనూ కోరి విభేదాలు తెచ్చుకోరు. అదే విధంగా ఎవరికైనా గౌరవం ఇచ్చే విషయంలోనూ ఆయన ముందుంటారు. ఇక పవన్ కళ్యాణ్ ని తన సొంత అన్న మాదిరిగా లోకేష్ చూసుకుంటున్న తీరు పవన్ అభిమానులకే కాదు యూత్ ని సైతం ఆకర్షిస్తోంది. అందుకే వారు లోకేష్ నే ఈ ప్రశ్న అడిగారు. మీ ఇద్దరూ సొంత బ్రదర్స్ కంటే ఎక్కువగా అనుబంధంతో మెలుగుతున్నారు. అసలు మీ బంధం ఎపుడు ఎక్కడ ఎలా మొదలైంది అని విద్యార్ధి లోకం నుంచి ఒక ఆసక్తికరమైన ప్రశ్న లోకేష్ కి ఎదురైంది.

సూటి ప్రశ్నలకు ధీటైన బదులు :

ఇదిలా ఉంటే కాకినాడ జేఎన్‌టీయూలో జరిగిన హలో లోకేష్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. వివిధ విభాగాలకు చెందిన 20 మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన చాలా కూల్ గా జవాబు చెప్పిన తీరు ఆకట్టుకుంది. విద్యార్థులు అయితే ఏ మాత్రం మొహమాటం లేకుండా సూటిగా లోకేష్ ని ప్రశ్నించారు. దానికి ధీటుగా లోకేష్ ఎక్కడా తడుముకోకుండా బదులు ఇవ్వడమే విశేషం. ఈ ప్రశ్న జవాబుల పర్వం అయితే లోకేష్ లోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.

పవన్ తో అదే తొలి భేటీ :

తాను ఏపీలో 2014 ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత మొదటిసారి జనసేన అధినేతగా ఉన్న పవన్ కల్యాణ్ ని కలిశాను అని లోకేష్ చెప్పారు. అలా నాటి నుంచి తమ బంధం కొనసాగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబుని 2023 సెప్టెంబర్ నెలలో అరెస్ట్ చేసినపుడు పవన్ వచ్చి తన కుటుంబానికి ఎంతో మద్దతుగా అండగా నిలిచిన సందర్భం అయితే తన జీవితాంతం గుర్తుంచుకుంటాను అని లోకేష్ భావోద్వేగంగా చెప్పారు. ఎవరికైనా కష్టం వచ్చినపుడు అండగా ఎవరు ఉంటారో వారే నిజమైన మిత్రులు అని లోకేష్ చెప్పారు. వారిని ఎవరూ ఎప్పటికీ మరచిపోకూడదని పవన్ తనకు ఉన్న అనుబంధం బలమైనది అని అన్నారు.

బంక్ కొట్టలేదు :

ఇక తన కాలేజీ రోజుల గురించి లోకేష్ మాట్లాడుతూ తాను అమెరికన్ విద్యావిధానంలో చదివాను అని అక్కడ హాజరు అయితే దానికి కూడా మార్కులు ఉంటాయని చెప్పారు. దాంతో మార్కుల కోసమైనా తాను ఎపుడూ పెద్దగా బంక్ కొట్టలేదని లోకేష్ చెప్పారు. ఇక తనకు 90 శాతం అటెండెన్స్ ఉంటే, తన భార్య బ్రాహ్మణికి వంద శాతం ఉండేదని కాలేజీ రోజులను ఆయన తలచుకున్నారు. ఏపీకి మంచి భవిష్యత్తు ఉందని విద్యార్ధులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఏపీకి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయని వాటి ద్వారా ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు. ఏపీని అగ్ర స్థానంలో తీర్చిదిద్దే విషయంలో యువత పాత్ర చాలా కీలకం అని ఆయన అన్నారు.