పవన్ 'పరిమితం'.. రీజనేంటి ..!
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, వివాదాలు, ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇదే పవన్ కళ్యాణ్ మనస్థాపానికి గురికావడానికి కారణమని తెలుస్తోంది.
By: Garuda Media | 18 Sept 2025 8:00 AM ISTఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పరిమితంగా వ్యవహరిస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ విషయంపై జనసేన వర్గాల్లో చర్చ ఎక్కువగా జరుగుతోంది. సాధారణంగా గత ఆరు నెలల వరకు కూడా పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో జోక్యం చేసుకున్నారు. అనేక విషయాలను ఆయన ప్రస్తావించారు. ప్రశ్నించారు కూడా. కానీ, ఇటీవల కాలంలో ఈ తరహా పరిస్థితి కనిపించడం లేదు. మరీ ముఖ్యంగా రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ చాలా పరిమితంగా వ్యవహరించారు.
అసలు తొలిరోజు సభకు ఆయన హాజరే కాలేదు. దీనికి సంబంధించి ఏదో వ్యక్తిగత కారణాలు చెప్పినప్పటికీ పార్టీలో మాత్రం అంతర్గతంగా దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు వినిపించాయి. ఈ విషయం ఇప్పటికీ సస్పెన్షన్ గానే మారింది. వాస్తవానికి కలెక్టర్ల సదస్సుకు పవన్ కళ్యాణ్ కు నాలుగు రోజులు ముందుగానే సమాచారం ఉంది. సీఎం నుంచి కూడా ఆహ్వానం అందింది. కానీ తొలి రోజు ఆయన వెళ్ళలేదు. సరే రెండో రోజు వెళ్లినప్పటికీ పవన్ కళ్యాణ్ కేవలం ముక్తసరిగా ఒక 10 నిమిషాలు మాత్రమే మాట్లాడి సరిపెట్టారు. దీంతో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు ఇటు జనసేనలోనూ అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చగా మారింది.
ఎందుకు ఇలా పరిమితమయ్యారు? ఎందుకు ఆయన ఇంత ముక్తసరిగా మాట్లాడారు? అనే విషయంపై చర్చ నడుస్తోంది. ప్రధానంగా సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి, ఇటు సోషల్ మీడియాలోనూ అటు ప్రధాన మీడియాలో కూడా సుగాలి ప్రీతి ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ ఎన్నో హామీలు ఇచ్చారని కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏమి పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తాయి. సుగాలి ప్రతి తల్లి కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పారు.
దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు, వివాదాలు, ట్రోల్స్ కూడా వచ్చాయి. ఇదే పవన్ కళ్యాణ్ మనస్థాపానికి గురికావడానికి కారణమని తెలుస్తోంది. ఇలా ట్రోల్స్ చేయడం వెనుక, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టించటం వెనుక కొందరు నాయకులు ఉన్నారన్నది జనసేన వర్గాలు భావిస్తున్నాయి. వారి ప్రభావం లేకపోతే ఈ స్థాయిలో సోషల్ మీడియాలో పవన్ పై విమర్శలు వచ్చేవి కాదని కూడా చెప్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయొద్దని గతంలోనే జగన్ ఆదేశించడంతో వైసిపి నాయకులు వెనక్కి తగ్గారు.
కేవలం టిడిపి, చంద్రబాబును మాత్రమే వైసిపి నాయకులు టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఒక్క మాట కూడా అనడం లేదు. ఇటీవల జగన్ మీడియాతో మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావన కేవలం ఒక సందర్భంలో మాత్రమే తీసుకొచ్చారు. ఇతర విషయాలపై మాత్రం ఆయన స్పందించలేదు. కానీ, సుగాలి ప్రీతి విషయంలో పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం అనేది వైసిపి పై నెట్టేస్తున్నప్పటికీ దీని వెనుక అసలు వేరే పార్టీ నాయకులు ఉన్నారన్నది జనసేన వర్గాలు అంచనాకు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మనస్థాపంతో ఉన్నారని అంటున్నారు. అందుకే కీలకమైన కలెక్టర్ల సదస్సులో కూడా ఆయన ముభావంగా కనిపించారని, ముక్తసరిగా మాట్లాడారని ఒక చర్చ నడుస్తోంది. మరి ఇదే నిజమైతే చంద్రబాబు జోక్యం చేసుకొని ఇలాంటి వాటికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
