సొంత వ్యూహాలతో జనసేన సిద్ధమేనా ?
రాజకీయాలు అంటే నిరంతరం పారే నది లాంటివి. ఆ నదిలో కూడా పైకి కనిపించే స్వచ్చత లోపల ఉండదు, పైగా గండాలు సుడి గుండాలు ఎన్నో ఉంటాయి.
By: Satya P | 3 Aug 2026 6:00 PM ISTరాజకీయాలు అంటే నిరంతరం పారే నది లాంటివి. ఆ నదిలో కూడా పైకి కనిపించే స్వచ్చత లోపల ఉండదు, పైగా గండాలు సుడి గుండాలు ఎన్నో ఉంటాయి. అలాంటి పాలిటిక్స్ అంటేనే టఫెస్ట్ జాబ్ అని అంటారు. ఇక్కడ ఎవరూ ఒకరిని కోరి ముద్దాడరు, అలాగే నెత్తికి ఎక్కించుకుని అందలాలు అందించరు, శోధించి సాధించిన వారికే పగ్గాలూ పట్టాభిషేకాలు దక్కుతాయి. జనసేన ఈ విషయంలో గట్టిగానే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. జనసేన అధినేత ఎప్పుడూ ఏ వేదిక మీద అయినా ఒక్కటే మాట అంటున్నారు, పొత్తులు కూటములు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. పొత్తులు అన్నవి రాజకీయాల్లో వ్యూహం మాత్రమే. వ్యూహాలు కూడా పది వేస్తే అన్నీ హిట్ అవాల్సిన అవసరం లేదు, పైగా ఒకసారి హిట్ అయింది మళ్ళీ అవాలని అసలు లేదు అని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
మోడీ మీద ఆరాధన :
ప్రధాని మోడీ మీద ఆరాధన జనసేన అధినేతకు ఉండొచ్చు తప్పు లేదు, ఆయన తనకంటూ ఒక కుటుంబం లేకుండా దేశం కోసం అంకితం అయి పనిచేస్తున్న వారు అని కూడా పవన్ కి ఉండొచ్చు. అయితే దానిని మరీ బాహాటంగా చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. పైగా బీజేపీ ఒక పార్టీ జనసేన ఒక పార్టీ అన్నది గుర్తెరగాలి అంటున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు ఓపెనింగ్ లో మోడీ మీద పవన్ ఆరాధనాభావం అయితే పీక్స్ కి వెళ్ళిందని అంటున్నారు. మోడీని అంటే కన్నీళ్ళు వచ్చాయని ఆయన చెబుతున్నారు. అయితే దానికి ముందూ వెనకా ఎన్నో జరిగాయని కూడా విశ్లేషించుకోవాలి కదా అంటున్నారు. విద్యార్ధుల ఉద్యమం ఏకంగా పాతిక రోజులకు పైగా నడిచింది. వారి మీద పోలీసులు దాడి చేశారు. దానికి ప్రతిస్పందనగా అలా మోడీని టార్గెట్ చేయడం జరిగింది అని ఆ వైపు నుంచి వస్తోంది. ఇక జెన్ జీ యూత్ అయితే పవన్ వ్యాఖ్యల మీద సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
శాశ్వత ప్రధానిగా మోడీ :
మోడీయే ఎల్లకాలం ప్రధాని అన్నది పవన్ భావన కావచ్చు, ధీమా కావచ్చు, కానీ రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు అంటారు. అందువల్ల 2029 లో మోడీ బీజేపీ పరిస్థితి ఏంటి అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. మోడీ శాశ్వత ప్రధానిగా ఉంటే దేశానికి మేలు అన్నది పవన్ అభిప్రాయం కావచ్చు, కానీ రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో మార్పు సహజం. అందుకే పవన్ మాటలకు కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి రియాక్షన్ వస్తోంది అని అంటున్నారు.
జనసేనకు అండగా :
జనసేనకు బీజేపీ అండగా ఉంది అన్నది నిజం. ముఖ్యంగా మోడీ పవన్ ని బాగా ఆదరించి అభిమానిస్తున్నారు. కానీ ఎల్ల కాలం ఈ రకమైన పరిస్థితి ఉండకపోవచ్చు అని అంటున్నారు. రేపటి రోజున దేశ రాజకీయ ముఖ చిత్రం మారినపుడు దానికి అనుగుణంగా ఏ పార్టీ అయినా తమ సొంత వ్యూహాలను అజెండాను యాక్షన్ ప్లాన్ ని తయారు చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. దాంతో పాటుగా జనసేనను సొంత లక్ష్యాలతో అధికారానికి దగ్గర చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్న హితైషులు కూడా ఉన్నారు. మొత్తానికి సందర్భం కాకపోయినా పవన్ తన అభిమానాన్ని మోడీ పట్ల చాటుకున్నారు. ఇపుడు మోడీ ప్రత్యర్ధులకు అవి ఏ మాత్రం నచ్చడం లేదని అంటున్నారు. అందుకే రాజకీయాల్లో ఆచీ తూచీ మాట్లాడాలని కూడా సూచనలు వస్తున్నాయి.
