పవన్ తో అరుదైన భేటీ!
అయినా సరే పని గట్టుకుని పవన్ ని జాతీయ స్థాయిలో కీలకమైన వీహెచ్ పీ నేతలు కలవడం ఆసక్తిని కలిగిస్తోంది అని అంటున్నారు.
By: Satya P | 2 Sept 2025 12:31 AM ISTఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలకమైన హోదాలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన తాజాగా విశాఖలో మూడు రోజుల పాటు సేనతో సేనాని అన్న పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ రోజుకీ చర్చనీయాంశంగానే ఉన్నాయి. హిందుత్వం మీద కూడా పవన్ సాఫ్ట్ కార్నర్ తో ఉండటం కూడా డిస్కషన్ గానే ఉంది. ఈ నేపథ్యంలో ఒక అరుదైన భేటీ పవన్ తో జరిగింది.
వీహెచ్ పీ నేతలతో మీట్ :
పవన్ కళ్యాణ్ ని మంగళగిరిలోని ఆయన ఆఫీసులో విశ్వ హిందూ పరిషత్ నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం విశేషం. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత ఆర్గనైజింగ్ సెక్రెటరీ జనరల్ మిలింద్ పరాందే పవన్ తో భేటీ అయి అనేక విషయాలను చర్చించారు. ఈ సందర్భంగా వీ హెచ్ పీ ప్రతినిధులు రాష్ట్రంలో దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి, ధార్మిక ప్రచారం, సేవా కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రితో చర్చించారు. అంతే కాకుండా ఇదే ఏడాది జనవరిలో విజయవాడ వేదికగా నిర్వహించిన హైందవ శంఖారావం డిక్లరేషన్ గురించి కూడా విహెచ్ పీ నేతలు పవన్ కి వివరించారు.
కాషాయం పార్టీ ఉండగానే :
ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఆ పార్టీకి చెందిన మంత్రి కూడా ఉన్నారు. అయినా సరే పని గట్టుకుని పవన్ ని జాతీయ స్థాయిలో కీలకమైన వీహెచ్ పీ నేతలు కలవడం ఆసక్తిని కలిగిస్తోంది అని అంటున్నారు. హిందూత్వం మీద పవన్ ఎలుగెత్తి మాట్లాడుతున్న తీరుతోనే ఆయనతో ఈ అరుదైన భేటీ సాగిందా అన్నది కూడా చర్చగా ఉంది. అంతే కాదు ఏపీలో హైందవ ధర్మాన్ని దేవాలయాలను ధార్మిక ప్రచారాన్ని ముందుకు తీసుకుని పోవాలని వీహెచ్ పీ చూస్తోంది. దాంతో భావ సారూప్యతతోనే పవన్ ని కలిశారు అని అంటున్నారు.
విశేష పరిణామమేనా :
దేశంలో జాతీయ స్థాయిలో బీజేపీ జనసేన పట్ల సంపూర్ణ విశ్వాసంతో పాటు ఆయనను నమ్మకమైన మిత్రుడిగా చూస్తోంది. ఇపుడు విశ్వ హిందూ పరిషత్ నేతలు కూడా పవన్ తో భేటీ అంటే ఇది విశేషమే అని అంటున్నారు. దక్షిణాదిన బీజేపీ బలోపేతానికి హిందూత్వ అనుబంధ సంస్థలు ఎంతగానో కృషి చేస్తున్న నేపథ్యం ఉంది. ఇపుడు అత్యంత ప్రజాకర్షణ కలిగిన నేతగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన సౌత్ ఇండియా స్థాయిలోనే అందరినీ ఆకట్టుకునే నాయకుడిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనతో కీలక భేటీ జరిగింది అని అంటున్నారు.
