ఆదివాసీలతో ఆడి పాడనున్న పవన్
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి గిరిజన ప్రాంతాల మీద గిరిజనుల మీద ఎంతో ప్రేమ అన్న సంగతి తెలిసిందే.
By: Satya P | 3 Sept 2025 9:14 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి గిరిజన ప్రాంతాల మీద గిరిజనుల మీద ఎంతో ప్రేమ అన్న సంగతి తెలిసిందే. ఆయన ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సార్లు గిరిజన ప్రాంతాలకు పర్యటన కోసం వచ్చారు. అంతే కాదు పెద్ద ఎత్తున నిధులను సమకూర్చి మరీ రహదారుల సౌకర్యం కోసం చర్యలు తీసుకున్నారు అభివృద్ధి పనులను అక్కడ చేపట్టడమే కాకుండా గిరిజన సంప్రదాయాలను ఆయన గమనిస్తూ వారితో మమేకం అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ మధ్యన అల్లూరి జిల్లాలోని ఒక గ్రామంలోని గిరిజనులు మొత్తానికి చెప్పులను పవన్ పంపించి వారి అభిమానాన్ని చూరగొన్నారు.
మదగడ గిరిజన గ్రామానికి రాక :
ఇదిలా ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 5వ తేదీన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు వ్యాలీ మండలంలో ఉన్న మదగడ గిరిజన గ్రామానికి రానున్నారు. ఆ రోజున ఒక విశిష్టమైన కార్యక్రమంలో గిరిజనులతో కలసి ఆయన పాల్గొననున్నారు. మదగడ గ్రామస్తులు నిర్వహించుకునే ఆదివాసీ సంప్రదాయ ఉత్సవం బలి పొరోబ్ లో పవన్ వారితో కలసి పాల్గొంటారని చెబుతున్నారు.
ఆహ్వానించిన గిరిజనం :
తమ ఊరిలో జరిగే సంప్రదాయ ఉత్సవాలకు పవన్ స్వయంగా హాజరు కావాలని గిరిజనులు మనసారా కోరుకున్నారు. వారు పవన్ ని స్వయంగా ఆహ్వానించారు. మదగడ గ్రామ పంచాయతీ పరిధిలో పన్నెండు రోజులపాటు నిర్వహించే బలి పొరోబ్ ఉత్సవాలు అయితే ఆగస్టు 25వ తేదీన ప్రారంభమయ్యాయి. అల్లూరి జిల్లాతో పాటు మన్యం జిల్లా ఒడిశా రాష్ట్ర ఆదివాసీలు అంతా కలసి పెద్ద ఎత్తున ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఒక వేడుకగా దీనిని నిర్వహిస్తారు. అలా గిరి పుత్రుల ఆహ్వానం మేరకు చివరి రోజు ఉత్సవాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు.
వరాలు ప్రకటిస్తారా :
గిరిజన ప్రాంతంలో ఒక చిన్న పంచాయతీలో జరిగే కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ హాజరు కావడం విశేషం గానే అంతా చూస్తున్నారు. అయితే అది గిరిజనుల పట్ల ఆయనకు ఉన్న మమకారానికి అంకిత భావానికి నిదర్శనం అని అంటున్నారు. ఇక ఈ ఉత్సవాలలో పవన్ కళ్యాణ్ గిరిజనుల కోసం వరాలు ఏమైనా ప్రకటిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా గిరిజనానికి పవన్ మరింతగా దగ్గర అవుతున్నారు. వారు కూడా తమకు నచ్చిన మెచ్చిన వారిని ఎప్పుడూ గుండెలలో పెట్టుకుంటారు. అలా పవన్ గిరిజన బంధం గట్టిగానే పెనవేసుకుంటోంది.
