పవన్ సర్.. మీ నుంచి 'ఆశిస్తోంది' ఇది కాదు!
''తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నట్టు.. నేను పాటించేది అదే!'' అంటూ.. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ రాజమండ్రిలో చేసిన ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
By: Garuda Media | 14 Sept 2025 3:00 AM IST''తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నట్టు.. నేను పాటించేది అదే!'' అంటూ.. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ అధినేతగా పవన్ కల్యాణ్ రాజమండ్రిలో చేసిన ప్రకటన ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం.. పవన్ కల్యాణ్ నుంచి ప్రజలు ఆశించింది.. ఆశిస్తున్నది కూడా భిన్నం. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటి. అందుకే.. ఇప్పుడు పాత వీడియోలు బయటకు వచ్చాయి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానని.. వైసీపీ అరాచకాలను వెలుగులోకి తీసుకువచ్చి.. చట్ట ప్రకారం శిక్షిస్తానని పవన్ పదే పదే చెప్పారు. చెబుతున్నారు.
కానీ, ఆయన అనుమతి లేకుండా.. ఆయనను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో జనసేన నాయకులు కొందరు.. హద్దులు దాడి తప్పులు చేస్తున్నారు. తాజాగా మచిలీపట్నంలో ఇదే జరిగింది. అయితే.. జరిగిన తప్పును నేరుగా ఒప్పుకొని .. తన పార్టీపై చర్యలు తీసుకునే ప్రయత్నం చేసి ఉంటే.. పవన్‌కు గతాన్ని గుర్తు చేయాల్సిన అవసరం వచ్చేది కాదని నెటిజన్లు వ్యాఖ్యాని స్తున్నారు. కానీ, తీవ్రస్థాయిలో తప్పు చేసిన జనసేన నాయకులపై సుతిమెత్తగా స్పందించిన పవన్ కల్యాణ్.. తన సహజ శైలిలో వైసీపీపై విరుచుకుపడ్డారు. దీనిని మెజారిటీ నెటిజన్లు తప్పుబడుతున్నారు. పవన్ మీ నుంచి ఇలా ఆశించలేదు.. అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏం జరిగింది?
వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న వలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాకినాడ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 30 వేల మంది పైచిలుకు మహిళలు అదృశ్యమయ్యారని.. వీరి వెనుక వలంటీర్లు ఉన్నారని ఆరోపిం చారు. ఒంటరి, వితంతు మహిళలను ట్రాప్ చేసిన వలంటీర్లు.. వీరి వివరాలను మహిళల ముఠాకు అప్పగించారని.. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలే తనకు చెప్పాయని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం పెను దుమారం రేపింది. కట్ చేస్తే.. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌లో దీనిపై చర్చజరిగింది. ఈ సందర్భంగా మచిలీ పట్నానికి చెందిన వైసీపీ మద్దతు దారుడు, ఆర్ ఎంపీ వైద్యుడు గిరిధర్.. పవన్‌పై విమర్శలు చేసిన మాట వాస్తవం.
అప్పట్లో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని.. మరి డిప్యూటీ సీఎంగా ఎంత మందిని వెనక్కి తీసుకువచ్చారో చెప్పా లని గిరిధర్ నిలదీశారు. ఇది జోరుగా వైరల్ అయింది. ఆ మర్నాడే.. అంటే శుక్రవారం.. మచిలీపట్నంలోని గిరిధర్ ఇంటిపై జనసేన నాయకులు భారీ సంఖ్యలో వెళ్లి దాడి చేశారు. ఆయనకు ఉన్న చిన్న దుకాణాన్ని ధ్వంసం చేశౄరు. అంతేకాదు.. తీవ్రంగా కొట్టి మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించారు. దీనికి సంబంధించిన వ్యవహారం కూడా.. తీవ్ర వివాదానికి దారి తీసింది. అక్కడితో కూడా ఆగని జనసేన నేతలు.. గిరిధర్‌పై కేసు పెట్టారు. ఇదీ.. జరిగింది.
రాజకీయాల్లో విమర్శలు, తిట్లు కామన్ అయిపోయాయి. ఈ క్రమంలో పవన్ వాస్తవాలు గ్రహించి.. ఎవరు తప్పుచేస్తే వారిని చట్టం ముందు నిలబెట్టాలి. కానీ, దీనికి భిన్నంగా.. ''వైసీపీ అరాచక ముఠా మనల్ని రెచ్చగొడుతోంది'' అంటూ ఆయన దాడులు చేసిన వారిని సమర్థించే ప్రయత్నం చేశారు. కానీ.. వాస్తవాలు కళ్లముందు కనిపిస్తుంటే.. గిరిధర్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి బూతులు తిడుతుంటే.. ఇలా వైసీపీపై ఎదురు దాడి చేయడం.. జనసేన నాయకులను వెనుకేసుకు వస్తున్నట్టుగా పవన్ వ్యవహరించడం.. సరికాదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
