Begin typing your search above and press return to search.

లోకల్ ఫైట్ కి పవన్ రెడీ చేస్తున్నారా ?

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత కీలక సమావేశాన్ని పార్టీ నేతలతో నిర్వహించబోతున్నారు.

By:  Satya P   |   15 May 2026 9:32 AM IST
లోకల్ ఫైట్ కి పవన్ రెడీ చేస్తున్నారా ?
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా కాలం తరువాత కీలక సమావేశాన్ని పార్టీ నేతలతో నిర్వహించబోతున్నారు. ఈ భేటీ ఈ నెల 15న జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే ఈ సమావేశంలో పవన్ చేసే ప్రసంగం మీద ఆసక్తి పెరుగుతోంది. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స చేయించుకుని కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఇపుడు పూర్తి ఆరోగ్యవంతుడై ఆయన పార్టీ సమావేశానికి హాజరవుతున్నారు.

వారికి ప్రాధాన్యత :

గత కొద్ది నెలలుగా ఏపీ వ్యాప్తంగా జనసేన పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టింది. ఈ సభ్యత్వ నమోదుకి ఇబ్బంది కలగరాదని పవన్ ఏకంగా జనసేన ఆవిర్భావ సభను కూడా వాయిదా వేశారు. ఈసారి ఉద్యమి పేరుతో సభ్యత్వ నమోదుని జనసేన చేపట్టింది. దానికి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సభ్యత్వ నమోదులో పాల్గొన్న వారికి సాధక్ అని పేరు పెట్టారు. అలా వారిని సభ్యత్వ నమోదులో కీలకం చేశారు. ఎవరైతే 300కి పైగా సభ్యత్వాలు నమోదు చేశారో అలాంటి సాధక్ లను ఎంచి మరీ ఈ సమావేశానికి ఆహ్వానించారు. వారంతా పవన్ కళ్యాణ్ తో జరిగే ఆత్మీయ సమావేశంలో పాలుపంచుకుంటారు అన్న మాట.

దిశా నిర్దేశంతో సేనాని :

పార్టీకి సభ్యత్వం పెద్ద ఎత్తున చేర్చి గ్రాస్ రూట్ లెవెల్ లో బలాన్ని ఇచ్చిన సాధక్ లకు దిశా నిర్దేశం పవన్ చేయనున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ఆయన సమావేశంలో పార్టీ నేతలకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు. ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో అక్కడ ఈసారి తప్పనిసరిగా పోటీ చేయడానికి జనసేన చూస్తోంది. అంతే కాకుండా ఉత్సాహవంతులకు కొత్త వారికి యువతకు అవకాశాలు ఇవ్వాలని కూడా పవన్ నిర్ణయించారు. పార్టీ పట్ల నిబద్ధత అంకితభావం కలిగి ఉన్న వారికి అవకాశాలు ఇస్తామని పవన్ భరోసా ఇవ్వనున్నారు.

ప్రభుత్వ విజయాల మీద :

అదే విధంగా ఈ సమావేశంలో కూటమి ప్రభుత్వపరంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలని కూడా పవన్ కోరనున్నారు. ప్రజలకు చేసిన మేలు ఏమిటి అన్నది పార్టీ వాదులే తెలియచెప్పాలని ఆయన సూచించనున్నారు. అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలి అన్నది కూడా పవన్ నేతలకు కీలక సూచనలు చేయనున్నారు. ఇక మంత్రులు, ఉద్యమి సభ్యత్వ నమోదుకు పార్లమెంట్ ఇంచార్జులుగా వ్యవహరించిన నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొంటారని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే చాలా కాలానికి పవన్ సమావేశం జరగడంతో జనసేన వ్యూహాలు ఆలోచనలు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆ పార్టీ కార్యాచరణ ఇవన్నీ కూడా తెలియచేసే అవకాశం ఉంటుందని అంటున్నారు.