Begin typing your search above and press return to search.

జనసేన ఆవిర్భావం---వారికి అంకితం

జనసేన ఆశయాలు లక్ష్యాలు బడుగు బలహీన వర్గాల కోసం అన్నది పదే పదే ఆ పార్టీ నేతలు చెబుతూంటారు. ఈసారి దానిని కార్యాచరణలో చూపించే ప్రయత్నమే ఈ మాటా మంతీ అని అంటున్నారు.

By:  Satya P   |   14 March 2026 7:00 AM IST
జనసేన ఆవిర్భావం---వారికి అంకితం
X

జనసేన ఆవిర్భావ దినోత్సవాలు ఎపుడూ పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భారీ సభ పెడతారు. వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ఈ సభకు తరలి వస్తారు. అంతా ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో సాగుతుంది కానీ ఈసారి సభ్యత్వ నమోదు మీద ప్రత్యేక దృష్టిని పెట్టిన జనసేన నిర్వాహకులు ఆవిర్భావ సభను నిర్వహించడం లేదు. అయితే ఇదే సందర్భంలో అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్తగా ఆవిర్భావ దినోత్సవాలకు రూపకల్పన చేశారు. జనసేన అంకితభావం నిబద్ధత ఎవరి కోసమో చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఆ రోజున ఒక కీలక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.

గిరిజనుల సమక్షంలో :

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 14న అల్లూరి జిల్లా నందిగరువులో గిరిజనులతో మాట-మంతీ పేరుతో ఒక వినూత్న కార్యక్రమంలో పాల్గొననున్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం వేళ ఆయన అలా ఆదివాసీలతో మమేకం అవుతారు అన్న మాట. వారి కష్ట సుఖాల గురించి తెలుసుకోవడమే కాదు, తమ పార్టీ ఆశయాలు విధానాలు ఎవరి కోసమో చాటి చెప్పే విధంగా ఆచరణాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు అని అంటున్నారు. మొదటి నుంచి అణగారిన వర్గాలు గిరిజనం మీద ప్రత్యేక అభిమానం శ్రద్ధ చూపించే పవన్ కళ్యాణ్ ఈసారి ఏకంగా జనసేన ఆవిర్భావం వంటి అత్యంత ముఖ్య ఘట్టాన్నే గిరిజనం ముంగిటకు తెచ్చారు అని అంటున్నారు.

వారితోనే ఉండాలని :

జనసేన ఆశయాలు లక్ష్యాలు బడుగు బలహీన వర్గాల కోసం అన్నది పదే పదే ఆ పార్టీ నేతలు చెబుతూంటారు. ఈసారి దానిని కార్యాచరణలో చూపించే ప్రయత్నమే ఈ మాటా మంతీ అని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన కోసం ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఇక పవన్ కళ్యాణ్ అధికారిక పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గిరిజన ప్రాంత ప్రజలతో ప్రత్యక్షంగా కలిసి వారి సమస్యలను తెలుసుకునేందుకు మాట-మంతీ పేరిట నిర్వహించే కార్యక్రమంలో పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న ఉదయం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ ద్వారా పాడేరు మండలం లగిసిపల్లి హెలిప్యాడ్‌కు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఓనూరు జంక్షన్ వరకు రోడ్డు మార్గంలో ఆయన ప్రయాణిస్తారు. తరువాత నందిగరువు గ్రామానికి నడకగా వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన మాట–మంతీ’ కార్యక్రమంలో పాల్గొని గిరిజన ప్రజలతో సమావేశమై వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం లగిసిపల్లి హెలిప్యాడ్‌కు తిరిగి వెళ్లి హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం చేరుకుని, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి జూబ్లీ హిల్స్ నివాసానికి చేరుకుంటారని అధికారులు చెబుతున్నారు.

గుర్తుండిపోయేలా :

పవన్ కళ్యాణ్ ఈసారి నిర్వహించే జనసేన ఆవిర్భావ కార్యక్రమాన్ని గుర్తుండిపోయేలా చేస్తున్నారు అని అంటున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి హోదాలో అనేక సార్లు పవన్ అల్లూరి జిల్లాలో పర్యటించారు. అక్కడ రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ నుంచి నిధులను కేటాయించారు. వారితో కలిసి ఆయన స్థానికంగా సభలను నిర్వహించారు ఈసారి ఏకంగా గిరిజనులతో మాటా మంతీ చేపడుతున్నారు. దీంతో గతంలో ఎపుడూ కూడా చేయని విధంగా ఆవిర్భావాన్ని ఇలా గిరిజనానికి అంకితం ఇవ్వడం ద్వారా పవన్ తన నిబద్ధతను చాటుకుంటున్నారు అని జనసేన వర్గాలు చెబుతున్నాయి.