జనసేనలో మూడు విభాగాలు.. సక్సెస్ అయితేనా.. !
జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పవన్ కల్యాణ్ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పెద్ద పీట వేస్తున్నారు.
By: Garuda Media | 19 May 2026 8:15 AM ISTజనసేన పార్టీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పవన్ కల్యాణ్ దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు పెద్ద పీట వేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన మూడు విభాగాలను ప్రస్తావించారు. లక్ష్యదళ్, నిర్వాహక దళ్, పరిపాలక దళ్ పేరుతో మూడు విభాగాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వాస్తవానికి ఇలాంటి దళాలు.. ఆర్ ఎస్ ఎస్‌లో మాత్రమే ఉన్నాయి. వీటి ద్వారా.. బీజేపీకి వెన్నుదన్నుగా ఆర్ ఎస్ ఎస్ వ్యవహరిస్తోంది.
లక్ష్యదళ్: జనసేన పార్టీ అధినేత చెబుతున్నట్టుగా.. లక్ష్యదళ్ ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తారు. నిస్వార్థకంగా పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తారు. వీరిలో అంతా యువకులు, మహిళలు మాత్రమే ఉంటారు. వీరిలక్ష్యం పార్టీని డెవలప్ చేయడమే. ఎలాంటి పదవినీ ఆశించకుండా.. పనిచేయడమే. ఆర్ ఎస్ ఎస్‌లో ఈ తరహా దళాలు ఉన్నాయి. ఇవి.. బీజేపీ కోసం పనిచేస్తాయి. ఇలానే జనసేన కోసం ఈ లక్ష్య దళ్ పనిచేయనుంది.
నిర్వాహక దళ్: పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు.. పార్టీ మరోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతో వివరించనున్నాయి. ఈ నిర్వాహక దళ్.. కార్యకర్తలకు, నాయకులకు మధ్య సమన్వయం చేస్తుంది. నేరుగా ప్రజలతో.. లక్ష్య దళ్ సంబంధాలు పెట్టుకుంటే.. నిర్వాహక దళ్.. వారిని ముందుకు నడిస్తుంది. తద్వారా పార్టీకి బలమైన వ్యూహాలను అందిస్తుంది. ఇది.. సక్సెస్ అయితే.. జనసేనను ముందుకు నడిపించే బాధ్యత నిర్వాహక దళ్‌పైనే ఉంటుంది.
పరిపాలక దళ్: రేపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. పదవులను ఈ దళంలోని వారికే ఇస్తారు. అయితే.. ఇదేమీ ఆషా మాషీ కాదు. విధాన పరమైన నిర్ణయాలతోపాటు.. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడం.. కార్యాచరణకు వీలుగా విధానాలు తయారు చేయడం.. కూటమిని ఐక్యంగా ఉంచే గురుతర బాధ్యతలను తీసుకోవడం .. వంటివి పరిపాలక దళ్ ప్రధాన కర్తవ్యం. అంతేకాదు.. నిర్వాహక, లక్ష్య దళాలను ముందుకు నడిపించే బాద్యత కూడా వీరిపైనే ఉంటుంది. సో.. ఇలా మూడు విభాగాలను బలోపేతం చేయడం ద్వారా.. క్షేత్రస్థాయిలో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని పవన్ అంచనా వేస్తున్నారు.
