Begin typing your search above and press return to search.

జనసేన వ్యూహాలు మామూలుగా లేవు.. తెలంగాణపై పకడ్బందీ ప్రణాళిక సిద్ధం!

ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన త్వరలో జరగబోయే ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సై అంటూ ప్రకటన చేసింది.

By:  Tupaki Political Desk   |   31 Aug 2026 4:00 PM IST
జనసేన వ్యూహాలు మామూలుగా లేవు.. తెలంగాణపై పకడ్బందీ ప్రణాళిక సిద్ధం!
X

తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణకు అడుగులు శరవేగంగా పడుతున్నాయి. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించిన జనసేన త్వరలో జరగబోయే ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సై అంటూ ప్రకటన చేసింది. ఇక మరో మూడు నెలల్లో జరగబోయే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లలోనూ సత్తా చాటాలని తెలంగాణ జనసైనికులు నిర్ణయించడం హాట్ టాపిక్ అవుతోంది. తెలంగాణలో పట్టుకోసం ప్రయత్నిస్తున్న జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఒకేసారి రాష్ట్రం అంతా హడావుడి చేయకుండా నెమ్మదిగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని జనసేన అధిష్టానం ఆలోచనగా ఉందని అంటున్నారు

జనసేన అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తెలంగాణలో కూడా అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. అయితే పవన్ ఆంధ్రా నాయకుడు అంటూ తెలంగాణకు చెందిన కొందరు నాయకులు విమర్శించడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. అదే సమయంలో తెలంగాణపై తాను మాట్లాడకుండా ఎవరూ ఆపలేరని పవన్ కూడా భావిస్తున్నారు. ప్రత్యర్థులు ఎంతలా అడ్డుకోవాలని చూసినా పవన్ వ్యూహాత్మకంగా జనసేన పార్టీని విస్తరిస్తూ వస్తున్నారు. ఏపీలో ఎదురైన రాజకీయ అనుభవాలతో తెలంగాణలో పార్టీ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని చెబుతున్నారు.

జనసేనాని వ్యూహం ప్రకారం తెలంగాణలో ఇప్పటికిప్పుడు అధికారం కోసం పోరాడేలా ఉండకూడదని జనసేన సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీని రాష్ర్టవ్యాప్తంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ముందుకు కదులుతున్నారని చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే ఖమ్మం పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయిందని అంటున్నారు. అదేసమయంలో హైదరాబాద్ నగరంతోపాటు మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలోనూ పోటీ చేయడం ద్వారా పార్టీ వాస్తవ బలంపై ఒక అంచనా వస్తుందని జనసేన నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లోని కొన్ని నియోజకవర్గాలలో బీజేపీతో పొత్తుతో జనసేన పోటీ చేసింది. ఆ అనుభవంతో కార్పొరేషన్ ఎన్నికల్లోనూ పోటీకి దిగి ఓటు బ్యాంకు పెంచుకోవాలని తెలంగాణ నేతలకు అధినేత పవన్ దిశానిర్దేశం చేశారని అంటున్నారు. పవన్ సూచనలతో తాజాగా హైదరాబాద్ లో భేటీ అయిన తెలంగాణ జనసేన నేతలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామం జనసేన మిత్రపక్షం బీజేపీకి మింగుడు పడటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆంధ్రా సెంటిమెంటుతో జనసేనతో జట్టు కట్టడానికి తెలంగాణ బీజేపీ భయపడుతోందని అంటున్నారు. అదే సమయంలో ఆ పార్టీ సొంతంగా పోటీ చేస్తే తమ విజయావకాశాలపై ప్రభావం చూపొచ్చని బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. మొత్తానికి తెలంగాణపై పక్కా వ్యూహంతో అడుగులు వేయాలని జనసేన పార్టీ నిర్ణయించడం తీవ్ర సంచలనం అవుతోందని చెబుతున్నారు.