Begin typing your search above and press return to search.

తెలంగాణలో పవన్ పోటీకి రెడీ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆయన గత రెండేళ్ళుగా ఏపీలోనే పరిపాలనా పరంగా బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నారు.

By:  Satya P   |   3 Jun 2026 1:41 AM IST
తెలంగాణలో పవన్ పోటీకి రెడీ ?
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి. ఆయన గత రెండేళ్ళుగా ఏపీలోనే పరిపాలనా పరంగా బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి పవన్ తాజాగా తెలంగాణాలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఈ సందర్భంగా ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతదాకా అసలు అనుకోలేదు కానీ ఇపుడు చెబుతున్నాను, అవును నేను తెలంగాణాలో పోటీ చేస్తాను, తెలంగాణా అంతటా తిరుగుతాను, ప్రతీ అన్యాయాన్నీ ఎదిరిస్తాను ఇక మీదట తెలంగాణాలోనే జనసేన గట్టిగా నిలబడుతుందని ఒక శపధం చేస్తూ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడారు.

ఏపీలో కీలకం :

అయితే జనసేన రాజకీయ కార్యక్షేత్రం ఇప్పటిదాకా చూస్తే ఏపీలోనే ఉంది. పవన్ కూడా తెలంగాణాలో తన పార్టీ విస్తరణ గురించి పెద్దగా ఆలోచన చేయలేదు. ఆ పార్టీని అభిమానులు అనుచరులు ఉన్నారు. అయితే కమిటీలు కూడా చూస్తే అంతగా లేవని అంటున్నారు. ఈ సమయంలో సాధక్ లతో జనసేన మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు దాని అర్ధం తెలంగాణాలో పార్టీని విస్తరించాలనే అని అంటున్నారు. కానీ ఆ సమావేశానికి తెలంగాణా పోలీసులు అనుమతించలేదు దాంతో ఆగ్రహించిన పవన్ నేనన్నా జనసేన అన్నా ఎందుకు అంత కోపం అని ప్రశ్నించారు. మీరు ఇంతలా నిలువరిస్తున్నారు కాబట్టి ఒక్కటే చెబుతున్నా ఇక మీదట తెలంగాణాలో జనసేన పోటీ చేసి తీరుతుందని పవన్ హెచ్చరించే ధోరణిలోనే స్పష్టం చేశారు విశేషం. అయితే జనసేన మూలమంతా ఏపీలోనే ఉంది అక్కడ పార్టీని ఇంకా విస్తరించాల్సి ఉంది. అలాంటిది అక్కడ వదిలేసి పవన్ తెలంగాణాలో పార్టీ విస్తరణ మీద ఫోకస్ పెడతారా అన్నదే ఇపుడు చర్చకు తావిస్తోంది.

మల్కాజ్ గిరీ నుంచి ఎంపీగా :

గతంలో తనకు మల్కాజ్ గిరీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆహ్వానం వచ్చినా నో చెప్పాను అని అన్నారు అపుడే పోటీ చేసి ఉండాల్సింది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అలా తనకు పదవుల మీద వ్యామోహం లేదని ఒక వైపు చెబుతూనే తాను కచ్చితంగా తెలంగాణాలో ఇక మీదట పోరాడుతా ప్రశ్నిస్తా అంతే కాదు పోటీ కూడా చేస్తా అని పవన్ చేసిన సంచలనమైన కామెంట్స్ తెలంగాణా రాజకీయాలనే కాదు ఏపీ రాజకీయాలను కూడా మలుపు తిప్పేలా ఉన్నాయని అంటున్నారు. పవన్ ఏపీని వదిలేసి ఈ సమయంలో తెలంగాణా మీద ఫోకస్ పెడతారా లేక రెండు రాష్ట్రాలలో ఆయన బాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతారా అన్నది కూడా అంతా చచ్రించే విషయంగా ఉంది.

జీహెచ్ఎంసీతోనేనా :

ఇక తెలంగాణాలో పోటీ చేస్తామంటే సార్వత్రిక ఎన్నికలు ఇంకా 2028 దాకా ఉన్నాయి. అంటే రెండున్నరేళ్ళ దాకా సమయం ఉంది అన్న మాట. మరి ఇపుడు పవన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు అన్నది చర్చ సాగుతోంది. అంతే కాదు బీజేపీ టీడీపీ వాళ్ల సంగతి తనకు తెలియదు అని తమ వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తారు అని పవన్ చెప్పడం బట్టి చూస్తే ఎన్డీయే కూటమిగా కాకుండా జనసేన సొంతంగానే బరిలోకి దిగుతుందా అన్న ఆలోచనలు కూడా సాగుతున్నాయి. మొత్తానికి పవన్ తెలంగాణాలో జనసేన ఎంట్రీ అన్న ఒక్క మాటతో సరికొత్త ఆలోచనలను ఏపీ తెలంగాణా రాజకీయ వర్గాలతో పాటు ప్రజలలోనూ రేకెత్తించారు అని అంటున్నారు.