నాయకుడు వెళ్ళిపోతే పార్టీ ఖాళీ కాదు...పవన్ హాట్ కామెంట్స్
రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నిబంధనలు కఠినంగా ఉంటాయని అంతా పాటించి తీరాలని అన్నారు.
By: Satya P | 26 May 2026 12:58 PM ISTపార్టీని వీడి ఒక నాయకుడు వెళ్ళినంత మాత్రాన పార్టీ ఖాళీ కాదని జనసేన కొనసాగుతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీయే ముఖ్యం తప్ప నాయకులు కాదని ఆయన అన్నారు పార్టీలో అందరూ కలసి బలోపేతం చేసుకుంటే బాగుంటుందని అన్నారు. అలా కాకుండా తామే అంతా అని హడావుడి చేసే వెళ్ళిపోయే వారి వల్ల ఏమీ కాదని గుర్తుంచుకోవాలని పవన్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నిబంధనలు కఠినంగా ఉంటాయని అంతా పాటించి తీరాలని అన్నారు.
సొంత పార్టీ వారి మీదనే :
కొంత మంది నేతలు సొంత పార్టీ వారి మీదనే మీడియాలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సామాజిక మాధ్యమాలలో ట్రోలింగ్ చేయిస్తున్నారు అన్నారు అలా ఎవరు చేస్తున్నారో తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని ఆయన అన్నారు. కొంత మంది నాయకులు అలా చేయడం వల్ల పార్టీ మొత్తానికి ఇబ్బంది అవుతుందని పవన్ అన్నారు. ఎంతటి నాయకులు అయినా క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు. పరిస్థితి అక్కడి దాకా రానీయవద్దని ఆయన హెచ్చరించడం విశేషం.
పార్టీ లైన్ లోనే అంతా :
పార్టీలో తనను అర్థం చేసుకున్న వారు ఎవరూ విభేదించరని పవన్ అన్నారు. అంతే కాకుండా పార్టీకి సంబంధించి ఎవరు ఏది మాట్లాడాలన్నా చెప్పేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. ఎవరైనా దానికి లోబడే మాట్లాడాలని ఆయన సూచించారు. అంతే కానీ సోషల్ మీడియా ఉంది కదా అని ఎవరి ఇష్టానికి వారు ప్రచారం చేయకూడదని స్పష్టం చేశారు. పార్టీ ఎవరి వల్ల పెరుగుతుందో ఆలోచించాలని, ఓట్ల కోసం ప్రజల్ని ఎవర్ని ఒప్పించగలరో తెలుసుకోవాలని ఆయన పార్టీ నేతలను కోరారు. పార్టీకి సంబంధించి కఠినమైన నియమావళి ఉంటుందని దాన్ని అంతా పాటించాలని పవన్ దిశ నిర్దేశం చేశారు. జనసేనలో నేతల మధ్య విభేదాలు ఉన్నా పరిష్కారానికి సామరస్య పూర్వక విధానం ఉంటుందని పవన్ చెప్పారు. తాను క్రమశిక్షణతో కూడిన కార్యకర్తలను కోరుకుంటున్నానని పవన్ తేల్చి చెప్పారు.
సేనానిగా వ్యూహం నాది :
జనసేన అధినేతగా వ్యూహం తాను వేస్తాను అని దాన్ని ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత అయితే మీది అని పవన్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు పూర్తిగా ప్రజాస్వామ్యబద్దంగా ముందుకు వెళ్లడానికే ప్రయత్నం చేశానని పవన్ అంటూ అలా చేసినా తనను ఏదీ చూడనీయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులుగా ఎవరిని పెట్టినా అందరికీ నచ్చాలని లేదని అందరూ మనకి నచ్చే వారు ఉండరని పవన్ చెప్పారు. పార్టీని నమ్మి పనిచేయడమే నేతలు కార్యకర్తల పని అని ఆయన అన్నారు.
గ్రామ స్థాయి నుంచి :
జనసేన కమిటీలను గ్రామ స్థాయి నుంచి నియమిస్తామని ఆగస్ట్ 14 నాటికి అన్నీ పూర్తి చేస్తామని పవన్ తెలిపారు. ప్రతీ గ్రామంలో ఆగస్ట్ 15 న జెండా పండుగ నాడు ప్రతీ వారూ జెండా ఎగరవేయాలని ఆయన కోరారు. జనసేన పార్టీని బలోపేతం చేసుకుందామని రాబోయే స్థానిక ఎన్నికల్లో మన బలాన్ని నిరూపించుకుందామని ఆయన తెలిపారు.
