Begin typing your search above and press return to search.

టీడీపీపైనా పోటీ!? ఫ్రెండ్లీ కంటెస్ట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్

సాధారణ ఎన్నికలు ప్రజల కోసం, స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతం కోసం అంటూ పవన్ సరికొత్త భాష్యం చెప్పారు.

By:  Tupaki Political Desk   |   23 Sept 2026 10:22 AM IST
టీడీపీపైనా పోటీ!? ఫ్రెండ్లీ కంటెస్ట్ కు పవన్ గ్రీన్ సిగ్నల్
X

స్థానిక ఎన్నికల్లో పొత్తులు ఉన్నప్పటికీ బలం ఉన్నచోట పోటీ చేస్తామంటే అభ్యంతరం లేదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. పొత్తులు ఉన్నా, స్నేహపూర్వక పోటీకి కార్యకర్తలు సిద్ధమైతే అడ్డుచెప్పొద్దని పార్టీ నేతలకు పవన్ సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన జనసేన సన్నాహక సమావేశంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. పార్టీ అంతర్గత సమావేశంలో మీడియాను అనుమతించినప్పటికీ పార్టీ నేతల సమాచారం మేరకు పోటీపై పవన్ ఊహించని ప్రసంగంతో కార్యకర్తలనే ఆశ్చర్యానికి గురిచేశారని చెబుతున్నారు.

పార్టీ కోసమే స్థానిక ఎన్నికలు

సాధారణ ఎన్నికలు ప్రజల కోసం, స్థానిక ఎన్నికలు పార్టీ బలోపేతం కోసం అంటూ పవన్ సరికొత్త భాష్యం చెప్పారు. పార్టీని బలోపేతం చేసుకోడానికి ఈ ఎన్నికలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. అందుకే కూటమి పొత్తులపై ప్రభావం చూపని విధంగా బలం ఉందని భావిస్తే స్నేహపూర్వక పోటీకి సిద్ధమవ్వాలని ఆయన సూచించినట్లు చెబుతున్నారు. బలం ఉన్న ప్రతి చోట జనసేన పోటీలో ఉంటుందని పవన్ స్పష్టం చేశారు.

గెలిచే స్థానాలు గుర్తించాలి

లోక్ సభ స్థానాల వారీగా గెలిచే అవకాశాలు ఉన్న స్థానాలను పార్టీ నేతలు గుర్తించాలని పవన్ సూచించారు. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రాభివృద్ధి కోసం త్యాగాలు చేశామని, కానీ స్థానిక ఎన్నికల్లో అటువంటి పరిస్థితి అవసరం లేదని పవన్ వ్యాఖ్యానించారని అంటున్నారు. జనసేన పార్టీని బలోపేతం చేసుకునేందుకు ఇదే సరైన సందర్భమని ఆయన భావించినట్లు చెబుతున్నారు. ఎక్కడ గెలుస్తామో అక్కడే పోటీ చేద్దాం, వందశాతం ఫలితాలు సాధిద్దాం అంటూ పవన్ కేడర్ కు దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.

లోకేశ్ పేరు ప్రస్తావించకుండానే..

ఇక కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 15 శాతం సీట్లు ఇస్తామని గతంలో మంత్రి లోకేశ్ చేసిన ప్రకటనపైనా పవన్ స్పందించారు. మంత్రి లోకేశ్ పేరు ప్రస్తావించకపోయినా జనసేన పోటీపై పర్సెంటేజీల లెక్కలు ప్రచారంలో ఉన్నాయని, నిజంగా వాళ్లు అలా మాట్లాడోరో లేదో తనకు తెలియదు కానీ, జనసేన మాత్రం బలం ఉన్న ప్రతిచోటా పోటీ చేస్తుందని మరోసారి పునరుద్ఘాటించారని చెబుతున్నారు. ఇక సీట్ల సర్దుబాటు జిల్లాస్థాయిలోనే జరిగిపోవాలని, తప్పనిసరి పరిస్థితులు ఉంటేనే తాను, ముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటామని పవన్ స్పష్టం చేశారని అంటున్నారు.

చేరికలపై కీలక సూచనలు

సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించాలని పవన్ సూచించారు. స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలకు పెద్దపీట వేయాలని సూచించారు. ఇదే సమయంలో చాలా మంది కార్యకర్తలు అధికారం వచ్చిన తర్వాత చల్లబడిపోయారని పవన్ వ్యాఖ్యానించారు. అధికారం ఉన్నా, లేకపోయినా కార్యకర్తల్లో వేడి తగ్గకూడదని, కసితో పనిచేయాలని పవన్ సూచించారు. మరోవైపు స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని చాలా చోట్ల నేతలు పార్టీలో చేరుతామని ముందుకొస్తున్నారని, మంచి ట్రాక్ రికార్డు ఉన్నవారిని మాత్రమే పార్టీలో చేర్చుకోవాలని పవన్ పార్టీ నేతలకు సూచనలు చేశారని చెబుతున్నారు.