Begin typing your search above and press return to search.

జనసేన స్థానిక దూకుడు !

కేరళలో ప్రకృతి వైద్యానికి వెళ్ళే ముందే ఈ కమిటీని పవన్ ప్రకటించడం ద్వారా స్థానిక ఎన్నికల మీద పార్టీ ఎంత పట్టుదలగా ఉందో చెప్పకనే చెప్పేశారు.

By:  Satya P   |   23 Aug 2026 9:30 AM IST
జనసేన స్థానిక దూకుడు !
X

జనసేన స్థానిక ఎన్నికల మీద దూకుడుగానే ఉంది. అధినేత పవన్ కళ్యాణ్ అయితే తన ఒంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల చివరి రోజు అసెంబ్లీకి వచ్చి అక్కడ జనసేన పార్టీ ఆఫీసులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ఎన్నికల గురించే ఆయన సీరియస్ గా చర్చించారు. ఎక్కువ సీట్లకే పోటీ చేస్తామని చెప్పారు. ఇక జనసేనకు బలమైన ప్రాంతాలు ఏవి ఉన్నాయో గుర్తించాలని పార్టీ నేతలకు చెప్పారు. అందుకోసం ఒక కమిటీని నియమిస్తామని కూడా పవన్ చెప్పారు. అన్నట్లుగానే ఆయన వెంటనే కమిటీని నియమించారు. కేరళలో ప్రకృతి వైద్యానికి వెళ్ళే ముందే ఈ కమిటీని పవన్ ప్రకటించడం ద్వారా స్థానిక ఎన్నికల మీద పార్టీ ఎంత పట్టుదలగా ఉందో చెప్పకనే చెప్పేశారు.

విధి విధానాల కమిటీ :

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన విధి విధానాల రూపకల్పన కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా పవన్ చెప్పారు. ఈ కమిటీలో 14 మంది సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు వీర మహిళలు ఉన్నారు. ఈ కమిటీ పార్టీ విధి విధానాలను రూపకల్పన చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణుల ఆలోచనలను కూడా తెలుసుకుంటుంది. ఈ కమిటీ సభ్యుల వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, వంశీ క్రిష్ణ శ్రీనివాస్, లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు ఉదయ భాను, టి శివశంకర్, దేవీ వర ప్రసాద్, పత్స మట్ల ధర్మరాజు, చిలకం మధుసూదన్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, యనమల భాస్కర్, కె రవికుమార్ ఉన్నారు. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు కమిటీ నియామకం జరిగింది అని జనసేన వర్గాలు తెలిపాయి.

పార్టీ కోసమే అంతా :

స్థానిక సంస్థల గురించి జనసేన ఎక్కువగానే ఫోకస్ పెడుతోంది. ఒక విధంగా ఇది గోల్డెన్ చాన్స్ గా భావిస్తోంది. పార్టీకి సంస్థాగత బలం లేదని విమర్శలు ఉన్నాయి. అధికారంలో ఉండగానే దానిని సాధించాలని జనసేన చూస్తోంది. దానికి అసలైన వేదికగా స్థానిక ఎన్నికలనే భావిస్తోంది. పార్టీ నేతలకు అన్ని చోట్ల పదవులు దక్కితే ఆటోమేటిక్ గా గ్రౌండ్ లెవెల్ లో పార్టీ బలపడుతుందని అధికారంతో పనులు చేసి చూపించవచ్చు అని కూడా అంటున్నారు. దాంతో 2029 ఎన్నికల నాటికి ఇప్పటికి రెట్టింపు బలంతో రాష్ట్రంలో జనసేన దూసుకుని పోయేందుకు బాటలు పడతాయని లెక్క వేస్తున్నారు. అందుకే పాత వ్యూహం కాదు కొత్త వ్యూహంతోనే ముందుకు అని పదే పదే జనసేన నేతలు చెబుతున్నారు.

పవన్ వచ్చీ రాగానే :

ఇక ఈ ఎన్నికల విధి విధానాల రూపకల్పనకు కమిటీ రానున్న కలామంతా పార్టీ క్యాడర్ తో మమేకం అవుతూ గ్రౌండ్ లెవెల్ లో పర్యటిస్తూ పార్టీ బలాన్ని బలగాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చేసి కేరళం నుంచి అధినేత పవన్ ఏపీకి రాగానే ఆయనని నివేదిక రూపంలో సమగ్రమైన సమాచారాన్ని అందిస్తుంది అని చెబుతున్నారు. దానిని ఆధారంగా చేసుకుని కూటమి పెద్దన్న అయిన టీడీపీతో సీట్ల సర్దుబాటు సందర్భంగా జనసేన తమ బలాన్ని చూపించి మరీ సీట్లను కోరుకుంటుందని చెబుతున్నారు. మొత్తానికి పవన్ ఆలోచన బాగుంది. ఆచరణలో కూడా వేగం పెరిగింది అని గుర్తు చేస్తున్నారు.