జనసేన ఇలానే ఉంటే కుదరదుగా...!
ఎందుకంటే వాస్తవ కోణంలో చూసినప్పుడు నగరాలు పట్టణాల్లో ఉన్నంత స్థాయిలో క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా నగరాలకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో లేదనేది వాస్తవం.
By: Garuda Media | 29 March 2026 7:00 AM ISTజనసేన వ్యూహం పలిస్తుందా. క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో విజయం సాధించుకోవాలన్న.. ఆ పార్టీ లక్ష్యం ఏ మేరకు సాకారం అవుతుంది అనేది.. ఆసక్తిగా మారింది. దీనికి ప్రధాన కారణం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్దేశించడం. అయితే క్షేత్రస్థాయిలో అనుకున్న విధంగా జనసేనకు భారీ మద్దతు ఉందా నాయకత్వం ఉందా అనేది ప్రశ్న. ఎందుకంటే వాస్తవ కోణంలో చూసినప్పుడు నగరాలు పట్టణాల్లో ఉన్నంత స్థాయిలో క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాలు అదేవిధంగా నగరాలకు వెలుపల ఉన్న ప్రాంతాల్లో లేదనేది వాస్తవం.
దీనిని పుంజుకోవాలి. అదేవిధంగా ఓటు బ్యాంకు ను పెంచుకోవాలి. అనేది జనసేన గత కొన్నాళ్లుగా చేస్తున్న ప్రయత్నం. కానీ ఆదిశగా అడుగులు పడుతున్నప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని గమనిస్తే క్షేత్రస్థాయిలో నాయకులు సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న `ఉద్యమి` సభ్యత్వాలు నమోదు కూడా ముందుకు సాగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లక్ష్యాల నిర్దేశించడం వరకు బాగానే ఉన్నప్పటికీ వాటిని సాకారం చేసుకునే విషయంలో తడబాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నాయకుల పనితీరు, అదే విధంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేయడంలో పార్టీ అధిష్టానం లోనే కొంత లోపం కనిపిస్తోందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ లోపాలను సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా పార్టీపరంగా మరింత దూకుడు ప్రదర్శించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. స్థానిక సంస్థల్లో ప్రధానంగా క్షేత్రస్థాయి నాయకుల పనితీరు ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. కూటమి ప్రభుత్వం ఇస్తున్న హామీలు లేకపోతే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వంటివి కొద్ది వరకే ప్రభావం చూపుతాయి.
ఈ నేపద్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ క్షేత్రస్థాయిలో జనసేన బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకులు ఆ మేరకు స్వేచ్ఛను తీసుకుంటున్నారా ప్రజలతో మమేకమవుతున్నారా పార్టీ నాయకులను కలుపుకొని పోతున్నారా కూటమిలో సానుకూలంగా వ్యవహరిస్తున్నారా అనేది చూడాలి. ఇప్పటి వరకు అయితే దీనిపై ఆశించిన స్థాయిలో లేదన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. ఇదిలా ఉంటే స్థానిక సంస్థల విజయం సాధించుకునేందుకు కూటమి పార్టీల మధ్య ఐక్యత ముఖ్యమని ఇటీవల పవన్ కళ్యాణ్ సూచించారు.
