పవన్ వ్యూహం కరెక్టేనా ?
పవన్ కళ్యాణ్ జనసేన అధినేత. పైగా ఇపుడు ఉప ముఖ్యమంత్రి. ఆయనను ఈ స్థితిలో చూసుకుంటున్న అభిమానులు అయితే ఎంతో పొంగిపోతున్నారు.
By: Satya P | 4 Aug 2025 9:43 AM ISTపవన్ కళ్యాణ్ జనసేన అధినేత. పైగా ఇపుడు ఉప ముఖ్యమంత్రి. ఆయనను ఈ స్థితిలో చూసుకుంటున్న అభిమానులు అయితే ఎంతో పొంగిపోతున్నారు. పవన్ పోస్టులో ముఖ్యమంత్రి ఉంది. అందుకే వారు పవన్ కి స్వాగతం పలికే ఫ్లెక్సీలలో ఉప అన్న దాన్ని చిన్నగా ముఖ్యమంత్రి అన్న దాన్ని పెద్దగా రాసి తన ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటారు. మరి దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఎంతో ఉంది.
దూరం రెండు అక్షరాలలోనే :
తమ అధినాయకుడు ముఖ్యమంత్రి కావడానికి దూరం కేవలం రెండు అక్షరాలు మాత్రమే అని అభిమానులు తలచుకుంటూ తెగ మురిసిపోతున్నారు. ఇక పవన్ ముఖ్యమంత్రి ఈ రెండింటినీ వారు గత పదకొండేళ్ళుగా వల్లె వేస్తున్నారు. 2014లో పవన్ పార్టీ పెట్టినది లగాయితూ సీఎం పవన్ అన్న నినాదాలే జోరెత్తుతూ వస్తున్నాయి. వాటికి ఎక్కడా అలుపూ సొలుపూ లేదు. అయితే తమ లక్ష్యం ఎంత దూరం ఏమిటి అన్నది వారికి అనవసరం. వారి ఆలోచనలు అన్నీ తమ అభిమాన నాయకుడు సీఎం సీట్లో కూర్చోవాలన్నదే.
అనేసుకుని సంబరపడ్డారు :
ఇక 2019 ఎన్నికల్లో అయితే పవన్ వామపక్షాలతో పాటు బీఎస్పీతో కలసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అయితే ముఖ్యమంత్రి పవన్ అనే అభిమానులు అనేసుకుని సంబరపడ్డారు. వారికి రాజకీయ లెక్కలు కానీ పొలిటికల్ స్ట్రాటజీలు కానీ అనవసరం. పవన్ ఎందుకు సీఎం కాలేరు అన్నదే వారి ఆలోచన. అదే వారి ఆశ. ఆ ఆశే వారిని ఏమీ ఫలాపేక్ష లేకుండా జనసేన జెండాను ఎత్తేలా చేస్తోంది అదే వారికి ఇంధనంగా మారి ముందుకు నడిపిస్తోంది.
బలమైన సామాజిక వర్గం చూపు :
ఇక పవన్ వెనక బలమైన సామాజిక వర్గం ఉంది. ఆ సామాజిక వర్గానిది దశాబ్దాల నాటి కోరిక. అది ఎప్పటికైనా నెరవేరుతుందా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని చూస్తున్నారు. వారికి తొలి ఆశాకిరణంగా వంగవీటి రంగా కనిపించారు. అయితే మధ్యలోనే ఆయన హత్యకు గురి అయ్యారు. ముద్రగడ పద్మనాభం ఒక దశలో అనిపించినా ఆయన రాజకీయ వ్యూహాల లేమి వల్ల కుదరలేదు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టినపుడు అయితే ఇక డ్యాం ష్యూర్ గా మన వారే సీఎం అని జబ్బలు చరిచారు. కానీ అది కూడా నిండా నిరాశనే మిగిల్చింది. దాంతోనే వారి ఆశలు అన్నీ జనసేన మీదనే పెట్టేసుకున్నారు.
ఆలంబనగా ఉంటూనే :
జనసేనకు బలమైన కాపు సామాజిక వర్గం అంతా ఆలంబనగా నిలుస్తూ వస్తోంది. కోస్తా జిల్లాల్తో పాటు రాయలసీమలో వారికి బలం చాలనే ఉంది. దాదాపుగా 80 అసెంబ్లీ నియోజకవర్గలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో వారు ఉన్నారు. పాతిక శాతం పైగా జనాభా ఉంది అంటే ప్రతీ నలుగురిలో వారి ఓటు ఒకటి ఉంటుంది అన్న మాట. ఇంత బలంగా సామాజిక పునాదులు ఉన్న చోట సీఎం పదవి అయితే అందని పండుగా మారింది. అందుకే జనసేన వెనకాల ఉంటూ తమ ఆశలు తీర్చుకోవాలని చూస్తున్నారు.
నిరాశపరిస్తే జరిగేది :
అటు అభిమానులు ఇటు సామాజిక వర్గం కోటి ఆశలను పెట్టుకున్న వేళ పవన్ నిరాశపరచే విధంగా వ్యవహరిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. ఆయన పదే పదే కూటమి పదిహేనేళ్ళ పాటు అధికారంలో ఉండాలని అంటున్నారు. అయితే ఇందులో జనసేన పాత్ర ఏమిటి అని కూడా చెప్పి ఉంటే బాగుంటుందని అంటున్నారు. పదిహేనేళ్ళు చంద్రబాబు సీఎం గా ఉండాలని అంటున్నారు. దాని వల్ల జనసేనకు వెన్నెముక లాంటి అభిమానులు అనబడే సైనికులు కానీ అలాగే స్ట్రాంగ్ ఫోర్స్ గా నిలిచిన సామాజిక వర్గం కానీ నిరాశకు గురి అయితే ఇబ్బందులే వస్తాయని అంటున్నారు.
ట్రయాంగిల్ లోనే బెస్ట్ ఆప్షన్:
నిజానికి త్రిముఖ పోరులోనే జనసేనకు రాజకీయ అవకాశాలు ఉంటాయని పొరుగు రాష్ట్రాల ఫలితాలు ఎన్నో నిరూపించాయి. వైసీపీ టీడీపీ బలంగా మోహరించి ఉన్నాయి. అయితే జనసేన తన బలాన్ని పెంచుకుని తగిన సీట్లు సాధించినట్లు అయితే తప్పకుండా సీఎం సీటు బంగారు పళ్ళెంలో పెట్టినట్లుగా వస్తుందని అంటున్నారు. కానీ జనసేన అధినాయకత్వం ఆ దిశగా ఆలోచనలు చేస్తోందా అన్నదే చర్చగా ఉంది. రాజకీయాల్లో అంతిమ లక్ష్యం అధికారమే. ఈ సహజ సూత్రాన్ని దాటి ముందుకు సాగితే నేల విడిచి సాము చేసినట్లే అని విశ్లేషిస్తున్నారు.
