Begin typing your search above and press return to search.

పవన్ వ్యాఖ్యల వెనక లోతైన వ్యూహం!

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో నిర్వహించిన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో అనేక విషయాల మీద మాట్లాడారు.

By:  Satya P   |   16 May 2026 9:28 AM IST
పవన్ వ్యాఖ్యల వెనక లోతైన వ్యూహం!
X

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ ఆఫీసులో నిర్వహించిన ఉద్యమి ఆత్మీయ సమావేశంలో అనేక విషయాల మీద మాట్లాడారు. ఒక విధంగా ఆయన మరోసారి తన రాజకీయ జీవితాన్ని మొత్తం సింహావలోకనం చేసుకున్నారు. 2007 నుంచి మొదలుపెట్టి 2026 దాకా రెండు దశాబ్దాల తన రాజకీయం ఒడుదుడుకులు మద్దతు పొత్తులు ఒంటరి పోరు పదవుల విషయంలో తన ఆలోచనలు రాష్ట్రం మీద తన కమిట్ మెంట్ ఇలా అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అదే సమయంలో కూటమిలో ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. రాష్ట్రం కోసం ఆలోచించే తాను కార్యకర్తల కోసం ఆలోచించలేనా అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు అన్నీ తెలుసు అని చెబుతూనే తాను సర్దుబాటు చేస్తాను మీ ఆత్మగౌరవం తగ్గించను అని చెప్పారు.

అవతల వైపు నుంచి :

మన వైపు నుంచి నూరు శాతం మద్దతు ఇచ్చినపుడు అవతల వైపు నుంచి అంతే స్థాయిలో రావాలని ఆయన అనడం విశేషం. ఇది కూటమిలో జనసేన కార్యకర్తలకు ఊరట కలిగించే మాటగా ఉన్నా అధినాయకత్వం కూడా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పరిణామాల మీద స్పందిస్తున్న తీరుగనూ భావించాల్సి ఉంటుందని అంటున్నారు. అంటే తాము రాష్ట్రం కోసం ఆలోచించి మద్దతు ఇచ్చామని కానీ అవతల పక్షం నుంచి తమకు ఆశించిన మద్దతు రాలేదన్నది జనసేనలో ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. 2024లో ఒంటరి పోరుకు బలం ఉందని అయినా రాష్ట్రమే ముఖ్యమని భావించామని పవన్ చెప్పడం కూడా ఇక్కడ మరో కీలకమైన పాయింట్ గా చూడాల్సి ఉంది.

బలాన్ని చాటుకోవాలనే :

ఓవరాల్ గా చూస్తే తమిళనాడులో విజయ్ పార్టీతో పోల్చవద్దు అని పవన్ చెబుతున్నా కూడా తన ప్రసంగం మొత్తంలో ఆ ప్రభావం చాలానే కనిపించింది అని విశ్లేషిస్తున్నారు అందుకే క్షేత్ర స్థాయిలో జనసేన బలపడాలి అన్నది కూడా పవన్ మార్క్ వ్యూహంగా ఉంది అని అంటున్నారు. క్యాడర్ విషయంలో తాను భరోసాగా ఉంటాను అని చెప్పడం పార్టీకే ఇక మీదట పూర్తి ప్రయారిటీ ఇస్తామని హామీ ఇవ్వడం వంటివి చూస్తే స్థానిక ఎన్నికల నుంచే జనసేన తన రాజకీయ వాటా కోసం గట్టిగానే కృషి చేస్తుందా అన్న చర్చ సాగుతోంది.

కింగ్ మేకర్ కావాలన్నదే :

మరో వైపు చూస్తే జనసేన వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కింగ్ మేకర్ గా కావాలన్నది కూడా ఆలోచిస్తోంది అని అంటున్నారు పవన్ తాజాగా పార్టీ వేదిక మీద చేసిన వ్యాఖ్యలు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకుంటున్న తీరు స్థానిక సంస్థల ఎన్నికల మీద గురి పెడుతున్న విధానం, మీరే నాకు ముఖ్యం, ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీయను అంటూ క్యాడర్ లో నింపుతున్న ఉత్తేజం ఇవన్నీ వెరసి 2029 ఎన్నికల నాటికి జనసేన గట్టిగా బలం పుంజుకుని రాష్ట్ర రాజకీయాల్లో మరింతగా తన సత్తాను చాటేందుకు సమాయత్తం అవుతోంది అని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ సాధించిన సక్సెస్ ఏపీలో జనసేన మీద బాగానే ప్రభావం చూపిస్తోంది అని అంటున్నారు. రానున్న రోజులలో జనసేన దూకుడు కూడా పెరగనుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.