Begin typing your search above and press return to search.

పవన్ ఫ్యూచర్ ప్లాన్ : జాతీయపార్టీగా జనసేన!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీని జాతీయస్థాయికి విస్తరించాలని వ్యూహం రచిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Tupaki Political Desk   |   16 Feb 2026 7:00 PM IST
పవన్ ఫ్యూచర్ ప్లాన్ : జాతీయపార్టీగా జనసేన!
X

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పార్టీని జాతీయస్థాయికి విస్తరించాలని వ్యూహం రచిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ అనుమానాలను మరింత చేకూరుస్తున్నాయని అంటున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో రెండు చోట్ల జనసేన గెలవడాన్ని ప్రస్తావిస్తూ ‘‘జనసేన పార్టీ ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో పరిమితం కాదు’’ అంటూ పవన్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా తనకు ఆహ్వానాలు ఉన్నాయని చెప్పారు. దీంతో పవన్ తన పార్టీని జాతీయస్థాయికి విస్తరించాలని అనుకుంటున్నారా? అనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అదే ఏడాది రాష్ట్ర విభజన జరగడంతో ఆయన రాజకీయ కార్యాకలాపాలకు ఏపీని కేంద్రంగా చేసుకున్నారు. తెలంగాణలో సైతం పార్టీకి చెప్పుకోదగ్గ స్థాయిలో అభిమానులు, కార్యకర్తలు ఉన్నప్పటికీ ఆ రాష్ట్రంలో బలం పెంచుకునే దిశగా ఇప్పటివరకు పవన్ గట్టి చర్యలు తీసుకోలేదనే అభిప్రాయమే ఎక్కువగా ఉందని అంటున్నారు. అయితే తెలంగాణకు చెందిన జనసేన కార్యకర్తలు, నాయకులు మాత్రం ఆ రాష్ట్రంలో రాజకీయంగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

2014లో పార్టీని పెట్టిన ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనసేన పోటీకి దూరంగా ఉండిపోయింది. ఇక 2018లో తెలంగాణ ఎన్నికల్లో కూడా అదే వ్యూహం అనుసరించింది. కానీ, 2019 ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగా పోటీ చేసి దాదాపు 6 శాతం ఓట్లతో ఉనికి చాటుకుంది. ఇక ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దీటుగా పోటీ పడింది. ఈ క్రమంలో 2024 ఎన్నికల్లో బలమైన శక్తిగా జనసేన ఎదిగింది. ఆ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించిన జనసేనాని పవన్ జాతీయస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించారని అంటున్నారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన చెప్పుకోదగ్గ ఓట్లు తెచ్చుకుంది.

అయితే జనసేనాని పవన్ ఎక్కువగా ఏపీపైనే ఫోకస్ చేయడం వల్ల తెలంగాణలో ఆ పార్టీ పెద్దగా పుంజుకోలేకపోతుందని అంటున్నారు. అయినప్పటికీ కేడర్ సొంతంగా పోరాడేందుకు ముందుకు వస్తోందని చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలవడం, మరికొన్ని స్థానాల్లో బలమైన పోటీ ఇవ్వడంతో తెలంగాణలో పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తలు ఆశలు పెంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో జనసేనాని పవన్ వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా విస్తృత చర్చకు దారితీస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.

సినిమా హీరోగా పవన్ కు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే బీజేపీ తన పార్టీ కార్యక్రమాలకు, ఎన్నికల ప్రచారానికి పవన్ ను ఎక్కువగా వాడుకుంటోందని అంటున్నారు. గతంలో మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేసిన పవన్.. ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో పలు బహిరంగ సభల్లో పాల్గొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే జనసేన ఏ ఒక్క ప్రాంతానికో రాష్ట్రానికో పరిమితం కాదంటూ పవన్ ప్రకటన చేశారని అభిప్రాయపడుతున్నారు.

పవన్ తాజా ప్రకటన తర్వాత జనసేనతోపాటు ఇతర పార్టీల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏ ఆలోచన లేకుండా పవన్ ఇలాంటి ప్రకటన చేయరని అంటున్నారు. ప్రస్తుతం పవన్ పార్టీకి ఉన్న ఎన్నికల గుర్తు గ్లాసును శాశ్వతంగా పొందాలంటే ఏపీతోపాటు తెలంగాణలోనూ ఓట్లు తెచ్చుకోవాలనేది పవన్ వ్యూహంగా ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ వరకు జనసేన పార్టీకి గ్లాసు గుర్తు అధికారికంగా కేటాయించినట్లు చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ గుర్తు విషయంలో తీవ్ర గందరగోళం ఏర్పడిందని గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితులు పునరావృతం కాకూడదంటే జనసేనకు తెలంగాణలోనూ గుర్తింపు ఉండాలని పవన్ ఆకాంక్షిస్తున్నారు. ఈ దిశగానే జాతీయ పార్టీగా విస్తరించే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.