సైన్యానికి పదవుల పండుగ...సీరియస్ గానే పవన్ ఫోకస్ !
ఇదిలా ఉంటే జనసేన గత నెలలో ప్రతీ జిల్లాలో పార్టీ పరిశీలకులను నియమించి మరీ అర్హులైన పార్టీ నేతల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను కోరింది.
By: Satya P | 26 July 2026 9:06 AM ISTజన సైన్యాన్ని బలోపేతం చేయడం దిశా నిర్దేశం చేసి రంగంలోకి దింపడం లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగా పనిచేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారందరికీ పదవులు పంపిణీ చేయాలని పవన్ దృఢ సంకల్పంతో ఉన్నారు. ఎవరైతే పార్టీ జెండా పట్టి జనంలో నిలిచి పోరాడుతున్నారో ఎవరైంతే గాజు గ్లాస్ చేత బట్టి పార్టీ పట్ల అపరిమితమైన అభిమానాన్ని చాటుకుంటూ అంకితభావంతో పనిచేస్తున్నారో వారికి పార్టీ పరంగా తగిన హోదా గౌరవం ఇచ్చి ప్రోత్సహించాలని పవన్ చూస్తున్నారు. దాంతోనే ఆయన కుడి భుజానికి ఆపరేషన్ జరిగి గాయం ఇంకా మానకుండా ఇబ్బందిపెడుతున్నా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కూర్చుని మరీ అర్హులైన వారి జాబితాను తానే స్వయంగా ఎంపిక చేస్తున్నారు.
వేలాదిగానే దరఖాస్తులు :
ఇదిలా ఉంటే జనసేన గత నెలలో ప్రతీ జిల్లాలో పార్టీ పరిశీలకులను నియమించి మరీ అర్హులైన పార్టీ నేతల నుంచి పార్టీ పదవుల కోసం దరఖాస్తులను కోరింది. దాంతో వెల్లువలా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. పెద్ద ఎత్తున సైన్యమంతా తమ అర్హతలను పొందుపరుస్తూ కేంద్ర కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో మొత్తంగా ఉన్న 28 జిల్లాల నుంచి 36 వేల పై చిలుకు దరఖాస్తులు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీటి నుంచి కమిటీల ఎంపిక ప్రక్రియను స్వయంగా పవన్ కళ్యాణ్ చేపట్టడం విశేషం. పార్టీ కోసం గట్టిగా పనిచేసే వారిని కమిటీలలో నియమించడం ద్వారా సంస్థాగతంగా జనసేనను పూర్తి స్థాయిలో బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ నిర్ణయించారని అంటున్నారు.
ఆగస్టు 15న జెండా ఎగరేసేలా :
రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అసెంబ్లీ మండల, గ్రామ కమిటీలను జనసేన పూర్తి చేస్తుందని అంటున్నారు. దీనిని ఆగస్టు 14 డెడ్ లైన్ గా పెట్టుకుంది అని అంటున్నారు. ఆగస్టు 15న జనసేన కొత్త కమిటీలతోనే జెండా పండుగను ఎక్కడికక్కడ చేయించాలని కూడా జనసేన అధినాయకత్వం గట్టిగా నిర్ణయించింది అని అంటున్నారు. అందుకే పవన్ తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పార్టీ ఆఫీసులో ఈ పని మీద పూర్తిగా ఫోకస్ పెట్టారని అంటున్నారు. దేశానికి జెండా పండుగ ఎంతో గొప్పదని ఆ రోజున పార్టీకి కూడా పండుగను తీసుకుని రావాలని పదవుల పంపిణీతో సైన్యంలో ఆనందం కనిపించాలని జనసేన చూస్తోంది అని అంటున్నారు.
గ్రౌండ్ లెవెల్ లో గట్టిగా :
ఇదిలా ఉంటే గ్రౌండ్ లెవెల్ లో జనసేన గట్టిగా నిలబడాలని చూస్తోంది. దానికి పార్టీ పదవులు పంపిణీ చేసి కమిటీలను పంచాయతీ వార్డు నుంచి పార్లమెంట్ దాకా ఏర్పాటు చేస్తే బాధ్యులైన నాయకత్వంతో జనసేన ఎక్కడికక్కడ జెండా ఎగరవేస్తుందని కూడా పార్టీ ఆలోచిస్తోంది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తరువాత మూడేళ్ళలో వచ్చే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనసేనను పటిష్టం చేసుకుంటే పార్టీ పదికాలాలు నిలుస్తుందని అధికారానికి మరింత చేరువ అవుతుందని భావిస్తున్నారు. అందుకే ఈ భారీ కసరత్తు అని అంటున్నారు. మొత్తానికి జనసేనలో పదవుల పండుగ వాతావరణం కనిపిస్తోంది.
