Begin typing your search above and press return to search.

'సేనాని' భ‌రోసా.. నేత‌ల‌కు అర్ధం కాదా ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా చాలా మౌనంగా ఉంటున్నారు. అవసరం ఉంటే తప్ప కనీసం ప్రకటన కూడా విడుదల చేయడం లేదు.

By:  Garuda Media   |   15 Aug 2025 9:00 PM IST
సేనాని భ‌రోసా.. నేత‌ల‌కు అర్ధం కాదా ..!
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్నాళ్లుగా చాలా మౌనంగా ఉంటున్నారు. అవసరం ఉంటే తప్ప కనీసం ప్రకటన కూడా విడుదల చేయడం లేదు. ఇక పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలు అసలు నిర్వ హించడమే లేదు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇప్పటివరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. మరోవైపు ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఆయన ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. వాస్తవానికి ఏ పార్టీలో అయినా ఏడాది దాటిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరు నాయకుల పనితీరును అంచనా వేసుకుంటారు.

దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు దిశగా అడుగులు వేస్తారు. ఈ రెండు జనసేనలో కనిపించడం లేదు. దీంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా చంద్రబాబుకు అనుకూల నాయకుడిగా మారిపోయారని, చంద్ర బాబును మరో 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చూడాలన్న ల‌క్ష్యంతో ఉండిపోయారన్న వ్యతిరేక ప్రచారం అయితే నడుస్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున దీనిపై విస్తృత ప్రచారం జరుగుతోంది. దీని వెనక వైసీపీ నాయకులు ఉన్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నప్పటికీ జనసేన నేతలే ఉన్నారు అన్నది వైసిపి చెబుతున్న మాట.

ఈ వ్యవహారం ఎలా ఉన్నా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు బయటకు రావడం లేదు. అదే విధంగా పార్టీ నేతల గ్రాఫ్‌ను గాని ఎమ్మెల్యేల గ్రాఫ్‌ను గాని ఆయన ఎందుకు అంచనా వేయడం లేదు. అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తిలో కోట వినుత ఘటన తర్వాత పార్టీని సంస్కరించాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించి జనసేన అధినేత చేతులు దులుపుకున్నారు అన్న వాదన వినిపించింది. ఇది కూడా వాస్తవం. రాష్ట్రస్థాయిలో చూసుకుంటే చాలా చోట్ల శృతిమించుతున్న నేతలు కనిపిస్తున్నారు. వీరిని అదుపు చేయాల్సిన అవసరం పార్టీకి అనుగుణంగా నడిపించాల్సిన బాధ్యత జనసేనపై ఉంటాయి.

ఇక ఈ విషయాలను పవన్ పట్టించుకోవడంలేదని అంతర్గతంగా చర్చ నడుస్తున్నప్పటికీ వాస్తవానికి తన ఇమేజ్‌తోనే పార్టీ ఉందని, తన ఇమేజ్‌ను పక్కన పెడితే ఇక జనసేన అనేది ఉండదని పవన్ కళ్యాణ్ భావనగా మరికొందరు చెబుతున్నారు. వాస్తవానికి ఏ పార్టీలో అయినా ఇదే తరహా వాదన వినిపిస్తుంది. వైసిపిని తీసుకున్నా.. టిడిపిని తీసుకున్నా.. ఆ పార్టీల‌లో అధినేతలు కూడా ఇదే విషయం చెబుతారు. కాబట్టి ఇదేం తప్పు కాదు. ఇది జనసేనలో మరింత ఎక్కువగా ఉంద‌న్నది వాస్తవం.

పవన్ కళ్యాణ్ చేత, పవన్ కళ్యాణ్ వలన, పవన్ కళ్యాణ్ కోసం అన్నట్టుగా ఏర్పడిన జనసేన పార్టీ ఇప్పటికీ గ్రామస్థాయిలో పుంజుకో లేదన్నది వాస్తవం. అయినా జనసేన అధినేత మాత్రం తన ఇమేజ్ తన వాక్ ధాటి, తన ప్రచారం వంటివి ఎప్పటికీ కలిసి వస్తాయని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని స్పష్టంగా చెబుతున్నారు. కాబట్టి ఇతర విషయాలను నాయకులు పక్కనపెట్టి, అధినేత కు మద్దతుగా నిలబడ‌డ‌మే మంచిది అన్నది రాజకీయ పరిశీలకులు చెబుతున్న మాట.