Begin typing your search above and press return to search.

మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ నేతృత్వంలో 'జ‌న‌సేన క‌మిటీ'.. ఎందుకంటే!

ఏపీలో అధికారం పంచుకుంటున్న జ‌న‌సేన పార్టీ 14 మందితో కూడిన కీల‌క క‌మిటీని నియ‌మించింది.

By:  Garuda Media   |   21 Aug 2026 10:35 PM IST
మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ నేతృత్వంలో జ‌న‌సేన క‌మిటీ.. ఎందుకంటే!
X

ఏపీలో అధికారం పంచుకుంటున్న జ‌న‌సేన పార్టీ 14 మందితో కూడిన కీల‌క క‌మిటీని నియ‌మించింది. దీనికి ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని అవ‌నిగ‌డ్డ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు, వివాద ర‌హితు డుగా పేరొందిన మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ నేతృత్వంలో నియ‌మించ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరుతో పార్టీ కార్యాల‌యం శుక్ర‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఈ క‌మిటీలో పార్టీ సీనియ‌ర్ నేత టి. శివ శంక‌ర్‌, మంత్రి కందుల దుర్గేష్‌, మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరి, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్‌, దేవ వ‌ర‌ప్ర‌సాద్‌, వంశీకృష్ణ యాద‌వ్‌, లోకం మాధ‌వి, ప‌త్స‌మ‌ట్ల ధ‌ర్మ‌రాజు, సీనియ‌ర్ నాయ‌కులు చిలకం మధుసూదన్ రెడ్డి, కొటికలపూడి గోవిందరావు (చినబాబు), సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కొరికాన రవి కుమార్ ఉన్నారు. వీరంతా ఎమ్మెల్యే మండ‌లి నేతృత్వంలో ప‌నిచేయాల‌ని.. సూచ‌న‌లు స‌ల‌హాల‌ను పార్టీ కార్యాల‌యానికి తెలియ‌జేయాల‌ని పేర్కొన్నారు.

ఏం చేయాలి?

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన పార్టీ కార్య‌కర్త‌ల అభిప్రాయాల ను వీరు తెలుసుకుంటారు. ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలను పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌కు వివ‌రిస్తారు. అలానే అధినేత ప‌వ‌న్ ఆలోచ‌నా విధానాన్ని కూట‌మి ధ‌ర్మాన్ని కూడా వివ‌రిస్తారు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలో కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాలు తెలుసుకోవ‌డంతో పాటు వారు పార్టీకి ఎంత కాలం నుంచి సేవ‌లుఅందిస్తున్నారో కూడా తెలుసుకుంటారు.

అలానే.. పార్టీలోని వివిధ విభాగాల‌తో ఈ 14 మంది స‌భ్యుల క‌మిటీ స‌మ‌న్వ‌యం చేసుకుంటుంది. వారి నుంచి కూడా వివ‌రాలు సేక‌రిస్తుంది. అంద‌రి అభిప్రాయాలు తెలుసుకుని.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏవిధంగా ముందుకు వెళ్లాల‌న్న అంశంపై ఈ క‌మిటీ ఒక నివేదిక‌ను సిద్ధం చేస్తుంది. దీనిలో ఏయే వ‌ర్గాల‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వాల‌న్న వివ‌రాలు కూడా ఉంటాయి. ఈ క‌మిటీ చేసే సూచ‌న‌లు, స‌ల‌హాల మేర‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థానిక ఎన్నిక‌ల‌పై ఒక నిర్ణ‌యం తీసుకోనున్నారు.