పవన్ టార్గెట్...రాజు గారి సర్టిఫికేట్ !
గోదావరి జిల్లాలో కొత్త రాజకీయం మొదలైందా అన్నది చర్చగా ఉంది. భీమవరం అంటేనే రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం.
By: Satya P | 22 Oct 2025 8:00 PM ISTగోదావరి జిల్లాలో కొత్త రాజకీయం మొదలైందా అన్నది చర్చగా ఉంది. భీమవరం అంటేనే రాజకీయ చైతన్యం ఉన్న ప్రాంతం. ఇపుడు ఇది ఏపీలో హాట్ టాపిక్ గా మారింద్. సాధారణంగా గోదావరి జిల్లాలలో పందేలు జూదాలు అన్నవి కామన్ గా జరిగిపోతూంటాయి. అయితే అవి శృతి మించి మరీ సాగడం ఆ మీదట వివాదాలు గొడవలు ఇలా లా అండ్ ఆర్డర్ కే ఇబ్బందిగా మారుతున్నాయి. దీంతో దీని మీద ప్రభుత్వానికి కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. అలా ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి భీమవరం పరిసర ప్రాంతాలలో పేకాట జూదాల గురించి ఫిర్యాదులు రావడంతో నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆయన ఈ విషయం మీద పోలీసు అధికారులనే నివేదికను కోరారు దాంతో ఇపుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద న్యూస్ గా మారింది.
ఆ డీఎస్సీ వల్లనే :
భీమవరం డిఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ చర్చించారు అని జనసేన వర్గాలు తెలిపాయి. జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆఫీసుకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని ఇక భీమవరం పరిధిలో పేకాట శిబిరాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయని కూడా జనసేన వర్గాలు చెబుతున్నాయి. దీంతో పపన్ కళ్యాణ్ డీఎస్పీ వ్యవహార శైలి మీద సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతని వ్యవహార శైలి మీద ఎస్పీ నుంచి నివేదిక కోరినట్లు సమాచారంగా ఉంది. అలాగే డీఎస్పీ జయసూర్య సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్‌కు ఫిర్యాదులు అందాయని జనసేన వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు వివాదాలతో డీఎస్పీ జయసూర్య కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారంటూ కూడా డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చినట్లు తెలిసిందని వారు అంటున్నారు. మొత్తానికి జనసేన కానీ పవన్ కానీ ఇపుడు భీమవరం డీఎస్పీని గట్టిగా టార్గెట్ చేశారని అంటున్నారు.
మంచి ఆఫీసర్ అంటూ :
ఈ నేపథ్యంలో భీమవరం డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అని డిప్యూటీ స్పీకర్ రఘురామ క్రిష్ణం రాజు అంటున్నారు. తనకు తెలిసినంతవరకూ జయసూర్య గురించి మంచిగానే విన్నాను అని ఆయన చెప్పారు. మరి పవన్ కి ఆయన మీద ఎవరు ఏమి చెప్పారో అని కూడా డిప్యూటీ స్పీకర్ విశాఖ పర్యటనలో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. ఇక పేకాట గురించి కూడా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. తమ గోదావరి జిల్లా ప్రాంతాలలో పేకాట అన్నది సరదాగా ఆడుతారు అన్నారు ఊపిరి తీసుకోవడం లాంటిదే పేకాట అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే గత కొంతకాలంగా ప్రభుత్వం పేకాట మీద ఉక్కు పాదం మోపిందని రాజు గారు చెప్పారు.
ఎక్కడా పేకాట లేదు "
ఇక గత కొంతకాలంగా చూస్తే కనుక పోలీస్ విభాగం అలాగే జిల్లా ఎస్పీ ఉక్కుపాదం మోపిన తర్వాత భీమవరంలో ఎక్కడ కూడా పేకాట జరగడం లేదు అని రాజు గారు స్పష్టం చేసారు. ఇక పవన్ కళ్యాణ్ డీఎస్పీ విషయంలో నివేదిక కోరారని ఆయన చెబుతూ ఆయన అన్ని శాఖలను పట్టించుకోవడం సంతోషకరం అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద చూస్తే పవన్ ఒక డీఎస్పీని గట్టిగా టార్గెట్ చేస్తూంటే రాజు గారు మాత్రం ఆయన మంచి ఆఫీసర్ అని సర్టిఫికేట్ ఇవ్వడమే బిగ్ ట్విస్ట్ గా చూస్తున్నారు. చూడాలి మరి ఈ ఇష్యూ ఏవైపు మళ్ళుతుందో.
