Begin typing your search above and press return to search.

పవన్ నటించొద్దు.. హైకోర్టులో షాకిచ్చిన మాజీ ఐఏఎస్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది.

By:  A.N.Kumar   |   19 Aug 2025 3:11 PM IST
పవన్ నటించొద్దు.. హైకోర్టులో షాకిచ్చిన మాజీ ఐఏఎస్
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు హైకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన నటించిన 'హరిహర వీరమల్లు' సినిమా ప్రమోషన్ కోసం ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ, మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనితో ఈ కేసు రాజకీయ మరియు న్యాయపరమైన వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

- అధికార దుర్వినియోగం ఆరోపణలు

ఈ పిటిషన్‌లో విజయ్‌కుమార్.. ఏకంగా పవన్ కళ్యాణ్ మీద కీలక ఆరోపణలు చేశారు. ఉప ముఖ్యమంత్రిగా తన హోదాను అడ్డుపెట్టుకుని, 'హరిహర వీరమల్లు' సినిమా టికెట్ ధరల పెంపు ఫైల్‌ను స్వయంగా ప్రాసెస్ చేశారని, అంతేకాకుండా సినిమా ప్రచారానికి ప్రభుత్వ నిధులను వినియోగించుకున్నారని ఆయన వాదించారు. ఒక మంత్రి వ్యాపార కార్యకలాపాలలో నేరుగా పాలుపంచుకోవడం ప్రభుత్వ నియమాలకు విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ చర్య పూర్తిగా అధికార దుర్వినియోగం కిందకు వస్తుందని విజయ్‌కుమార్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

-సీబీఐ దర్యాప్తుకు డిమాండ్.. కానీ తిరస్కరణ

ఈ వ్యవహారం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడానికి, సీబీఐ లేదా ఏసీబీ ద్వారా దర్యాప్తు జరిపించాలని విజయ్‌కుమార్ కోర్టును కోరారు. అయితే ఈ దశలోనే పవన్ కళ్యాణ్, సీబీఐ, ఏసీబీలకు నోటీసులు జారీ చేయాలన్న పిటిషనర్ న్యాయవాది అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.

- విచారణ వాయిదా, ఊహించని పరిణామం

ఈ కేసును విచారించిన డాక్టర్ జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపా ఆధ్వర్యంలోని హైకోర్టు బెంచ్, కేసును మరో వారం రోజులకు వాయిదా వేసింది. ఈ పిటిషన్ కొట్టివేయబడుతుందని చాలామంది భావించినప్పటికీ, హైకోర్టు దీనిని విచారణకు స్వీకరించడం పవన్ కళ్యాణ్‌కు పెద్ద షాక్‌గా మారింది. ఇప్పటికే 'హరిహర వీరమల్లు' సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన అందుకుంది. ఇప్పుడు అదే సినిమాపై న్యాయపరమైన వివాదం తలెత్తడం పవన్ కళ్యాణ్‌కు మరో సమస్యగా మారింది. ఈ కేసు తదుపరి విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.