Begin typing your search above and press return to search.

నా అనారోగ్యానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్!

ఎన్నికల ప్రచార సమయంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ.. "సైనస్ ప్రాంతాల్లో విపరీతంగా దుమ్ము పేరుకుపోయి వాపు వచ్చింది.

By:  A.N.Kumar   |   16 May 2026 12:20 AM IST
నా అనారోగ్యానికి కారణం ఇదే.. అసలు విషయం బయటపెట్టిన పవన్ కళ్యాణ్!
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు రాజకీయ వర్గాల్లో.. ఇటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గత కొంతకాలంగా సైనస్ శస్త్రచికిత్స కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆయన తాజాగా జనసేన పార్టీ కార్యకర్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొని, తన ఆరోగ్య సమస్యల వెనుక ఉన్న అసలు కారణాలను వివరిస్తూ అత్యంత భావోద్వేగంగా మాట్లాడారు.

కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకం.. తగ్గని ఇన్ఫెక్షన్

పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తూ ప్రధానంగా కరోనా ప్రభావాన్ని వివరించారు. "ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ గతంలో కరోనా సోకినప్పుడు ఏర్పడిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఇంకా పూర్తిగా తగ్గలేదు. అది ఇప్పటికీ నా శరీరంపై ప్రభావం చూపుతూనే ఉంది అని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు ఎన్నికల సమయంలో విపరీతమైన ఎండల్లో దుమ్ము-ధూళిలో గంటల తరబడి ప్రచారం నిర్వహించడం వల్ల పరిస్థితి మరింత క్లిష్టంగా మారిందని తెలిపారు.

సైనస్ సమస్య తీవ్రత.. "కళ్లు కూడా కనిపించలేదు"

ఎన్నికల ప్రచార సమయంలో ఎదుర్కొన్న కష్టాలను వివరిస్తూ.. "సైనస్ ప్రాంతాల్లో విపరీతంగా దుమ్ము పేరుకుపోయి వాపు వచ్చింది. ఒకానొక దశలో నొప్పి భరించలేకపోయానని, కళ్లు కూడా సరిగా కనిపించలేదని" పవన్ వెల్లడించారు. ఈ తీవ్రమైన నొప్పి కారణంగానే గతంలో భీమవరం పర్యటనను సైతం రద్దు చేసుకుని హైదరాబాద్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని ఆయన వివరించారు. ఈ సర్జరీ తర్వాత కోలుకోవడానికి సుమారు నెల రోజులకు పైగా సమయం పట్టినట్లు చెప్పారు.

అభిమానుల ప్రేమ.. భుజాలకు గాయాలు!

తన ఆరోగ్య సమస్యల గురించి చెబుతూనే అభిమానుల ప్రేమ వల్ల కలిగిన ఇబ్బందులను పవన్ సరదాగా పంచుకున్నారు. ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు అభిమానులు ఎంతో ఉత్సాహంతో, ప్రేమతో చేతులు పట్టుకుని లాగడం వల్ల తన రెండు భుజాల మధ్య 'లిగమెంట్ టేర్' (కండరాలు చిరిగిపోవడం) ఏర్పడిందని వైద్యులు నిర్ధారించారని ఆయన నవ్వుతూ చెప్పారు. "మనవాళ్లు షేక్‌హ్యాండ్ ఇస్తే వదలరు కదా.." అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశంలో నవ్వులు పూయించాయి. అయినప్పటికీ ఇది తనపై శారీరక ఒత్తిడిని పెంచిందని ఆయన అంగీకరించారు.

నొప్పిని భరించే శక్తి.. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్

వెన్నునొప్పి సమస్య కూడా తనను వేధిస్తోందని పవన్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉండటం వల్ల ఎంతటి శారీరక నొప్పిని అయినా భరించే మనోధైర్యం, శక్తి తనకు లభించాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అటు రాజకీయ బాధ్యతలను, ఇటు సినిమాలను సమతుల్యం చేసుకుంటూ ప్రజల కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు.

అభిమానుల ఆందోళన.. ఆరాధ్య దైవం కోసం ప్రార్థనలు

పవన్ కళ్యాణ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. "ఇన్ని ఆరోగ్య సమస్యలను దాచుకుని, కేవలం ప్రజల బాధ్యత కోసం ఇంతలా కష్టపడుతున్నారా?" అంటూ అభిమానులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని త్వరగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని వేలాది మంది నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తన సుఖాలను, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా పవన్ కళ్యాణ్ ముందుకు సాగడం నిజంగా గమనార్హం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడిందని తెలియడంతో జనసైనికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆయన మరింత ఉత్సాహంతో ప్రజల మధ్యకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు.