Begin typing your search above and press return to search.

పంచాయ‌తీ రాజ్‌ను గిన్నీస్ బుక్‌లోకి ఎక్కించాం: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ‌లో ప‌నితీరును మెరుగు ప‌రిచి గిన్నీస్ బుక్‌లో స్థానం ద‌క్కేలా చేశామ‌ని ఉప ముఖ్య మంత్రి, రాష్ట్ర అటవీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.

By:  Garuda Media   |   2 July 2026 8:05 PM IST
పంచాయ‌తీ రాజ్‌ను గిన్నీస్ బుక్‌లోకి ఎక్కించాం:  ప‌వ‌న్ క‌ల్యాణ్‌
X

రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ‌లో ప‌నితీరును మెరుగు ప‌రిచి గిన్నీస్ బుక్‌లో స్థానం ద‌క్కేలా చేశామ‌ని ఉప ముఖ్య మంత్రి, రాష్ట్ర అటవీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుప‌తి జిల్లా ముక్కావారి ప‌ల్లెలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వీబీజీరాంజీ ప‌థ‌కాన్ని బుధ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. 2047 వికసిత భారత్ లక్ష్యంగా కేంద్రంతో క‌లిసి రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అత్యధికంగా నిధులు కేటాయిస్తోంద‌న్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో వీబీజీరాంజీ పథకం ఎంతో లబ్ధి చేకూరుస్తోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌ తెలిపారు.. వందరోజుల నుండి 125 రోజులకు ఉపాధి హామీ పెరిగిందన్నారు. గ‌తంలో ఉపాధి నిధులతో 7 వేల కిలోమీటర్ల మేర‌కు సీసీ రోడ్లు వేశామ ని, గ్రామీణ ప్రాంతాల్లోని కార్మికుల‌కు 58 కోట్ల 48 లక్షల పనిదినాలు కల్పించామ‌ని తెలిపారు. వంద‌ల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు చెప్పారు. గ‌తంలో 24వ స్థానంలో ఉన్న గ్రామీణ పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్ర‌స్తుతం తొలిస్థానానికి చేరుకుంద‌ని.. దీనికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, సీఎం చంద్ర‌బాబు ఇచ్చిన ప్రోత్సాహ‌మే కార‌ణ‌మ‌ని తెలిపారు.

భవిష్యత్తులో అందరికీ ఉపాధి కల్పించే లక్ష్యంతో వీబీజీరాంజీ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చార‌ని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు పారదర్శకమైన చెల్లింపులు కోసం నేరుగా వారి ఖాతాలకే నగదు జమ చేస్తామ‌న్నారు. ఎక్క‌డ ఏ ప‌నులు చేప‌ట్టాల‌న్న‌ది.. ఆయా గ్రామాల్లో నిర్వ‌హించే గ్రామ స‌భ‌ల్లోనే నిర్ణ‌యిస్తార‌ని చెప్పారు. గ్రామ స్వరాజ్యమే వీబీజి రామ్ జీ లక్ష్యమ‌ని త‌లెఇపారు. అభివృద్ధిలో వెనుకబడి ఉన్న పంచాయతీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామ న్నారు.

గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, సామాజిక భద్రత పెరుగుతుందన్నారు. జ‌లధార ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పారు. వికసిత భారత్ దిశగా దేశం అడుగులు వేస్తోందన్నారు. 13 వేలకు పైగా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు సాధించామని అన్నారు. రాష్ట్రం మునుపెన్న‌డూ లేని విధంగా అభివృద్ధి చెందుతోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు.