సుగాలి ప్రీతి కేసేంటి? పవన్ కల్యాణ్ మాట తప్పారా?
మహిళా భద్రత.. ఆడబిడ్డలపై జరిగే అన్యాయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించటం తెలిసిందే.
By: Garuda Media | 7 July 2026 10:45 AM ISTకొన్నిసందర్భాల్లో మాటలు చెప్పటం ఎంత తేలికో.. వాటిని ఆచరించటం చాలా కష్టంగా మారుతుంది. విలువలతో కూడిన రాజకీయం. నిజం కోసం పోరాడటం. వాస్తవానికి కట్టుబడి ఉండటం. ఆడబిడ్డలకు రక్షణ కవచంలా మారతానని చెప్పటం లాంటివి ఎంత సులువో.. అలా మాట్లాడిన తర్వాత ఆ మాటలకు కట్టుబడి ఉండకపోతే జరిగే నష్టం మామూలుగా ఉండదు.
ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పవన్ ను ప్రశ్నించే ఏ అంశంలో అయినా.. ఆయనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలన్న ఉద్దేశమే తప్పించి.. మరెలాంటి కారణం లేదన్న మాట వినిపిస్తూ ఉంటుంది. అందుకు భిన్నంగా సుగాలి పార్వతి కుమార్తె కేసు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అసలేం జరిగింది?
ఏపీలో సంచలనాన్ని సృష్టించిన కేసుగా సుగాలి పార్వతి కుమార్తె కేసును చెప్పాలి. 2017 ఆగస్టు 19న కర్నూలు నగర శివారులోని ఒక ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాల (కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్)లో పదో తరగతి చదువుతున్న బాలిక హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మరణించింది.
ఈ ఘటనను పాఠశాల యాజమాన్యం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందన్నది ప్రధాన ఆరోపణ. అయితే.. అది ఆత్మహత్య కాదని.. తన కుమార్తెపై లైంగిక దాడి చేసి హత్య చేశారన్నది బాధితురాలి తల్లి సుగాలి పార్వతీదేవి ఆరోపణ.
స్కూల్ అధినేత కుమారులు ఈ దారుణానికి పాల్పడ్డారంటూ బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కర్నూలు తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు వివరాల ప్రకారం.. ఏ1గా కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ కరస్పాండెంట్ కె. జనార్ధన్ రెడ్డి, ఏ2గా జనార్ధన్ రెడ్డి పెద్ద కుమారుడు కె. హర్షవర్ధన్ రెడ్డి, ఏ3గా కె. దివాకర్ రెడ్డిలను నిందితులుగా నమోదు చేశారు.
కేసు నమోదు చేసిన తర్వాత అరెస్టు చేశారా?
ఈ ఘటన జరిగిన దాదాపు నెల తర్వాత సెప్టెంబరు 18న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటి అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు బలమైన ఆధారాలు కోర్టుకు సమర్పించలేకపోయారన్నది ఒక ఆరోపణ. ఈ కారణంగానే కేవలం 23 రోజుల్లోనే ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్ లభించినట్లుగా రికార్డులు చెబుతున్నాయి.
పోస్టుమార్టం రిపోర్టు ఏం చెప్పింది?
ఆత్మహత్య నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి.. బాధిత బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన రిపోర్టులో బాలికపై లైంగిక దాడి జరిగిన ఆనవాళ్లు ఉన్నట్లుగా పేర్కొనటంతో.. మృతురాలి తల్లి చేసిన ఆరోపణలకు బలం చేకూరినట్లైంది.
ఈ కేసు సంచలనంగా మారటంతో పాటు.. నాటి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో నాటి జిల్లా కలెక్టర్ ప్రత్యేక త్రిసభ్య విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.
సదరు కమిటీ సైతం విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరిగి.. హత్యకు గురై ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా చెబుతారు.
ఈ దారుణ ఘటన జరిగినప్పుడు అధికారంలో ఉన్నదెవరు?
ఈ సంఘటన జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది.
టీడీపీతో సంబంధం ఉందన్న విమర్శలకు కారణం.. ఏ1గా ఉన్న కె. జనార్ధన్ రెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ లో కీలక నేత కావటంతో పాటు.. స్థానిక టీడీపీలో బలమైన రాజకీయ అండదండలు ఉన్న వ్యక్తిగా చెబుతారు.
2017లో ఈ ఘటన జరిగిన సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. తనకున్న పలుకుబడితో కేసును తొలుత ఆత్మహత్యగా మార్చే ప్రయత్నం చేశారన్నది బాధిత కుటుంబం ప్రధాన ఆరోపణ.
దీనికి తోడు కేవలం 23 రోజుల్లోనే నిందితులకు రెగ్యులర్ బెయిల్ రావటంతో విమర్శల తీవ్రత మరింత పెరిగింది.
జగన్ ప్రభుత్వం ఏం చేసింది?
ఈ దారుణ ఉదంతం టీడీపీ ప్రభుత్వంలో జరగటం.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ సంచలన కేసును చేపట్టింది.
ఈ కేసులోని సున్నిత అంశాల నేపథ్యంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసును సీబీఐకు బదిలీ చేశారు.
రాష్ట్ర స్థాయిలో విచారణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. కేంద్ర దర్యాప్తు సంస్థ ద్వారా నిజాలు బయటకు వస్తాయని ప్రభుత్వం భావించింది.
మరి.. సీబీఐ ఏం చేసింది?
నిందితుల రాజకీయ ప్రభావంతో విచారణ సరిగా సాగలేదన్న ఆరోపణలు వినిపించాయి. కీలకమైన ఫోరెన్సిక్ డీఎన్ఏ శాంపిల్స్ తో పాటు.. సీసీటీవీ ఫుటేజీలు మాయం అయినట్లుగా కొందరు.. ధ్వంసమైనట్లుగా మరికొందరు ఆరోపించారు.
కారణం ఏమైనా కానీ.. నిందితులకు వ్యతిరేకంగా చట్టపరంగా నిరూపించగల పక్కా సాక్ష్యాలను కోర్టులో సీబీఐ సైతం సమర్పించలేకపోయింది.
రాజకీయ పలుకుబడి కారణంగానే కీలక ఆధారాలు తారుమారు అయ్యాయన్న విమర్శలు కూడా బలంగా వినిపించాయి.
జగన్ ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఏం చేసింది?
కుమార్తెను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న సుగాలి పార్వతీదేవి కుటుంబానికి ప్రభుత్వం మద్దతు ఇచ్చింది.
కేసును సీబీఐకు బదిలీ చేయటంతో పాటు.. మానవీయ కోణంలో 5 ఎకరాల వ్యవసాయ భూమి, 5 సెంట్ల ఇళ్ల స్థలం, ప్రైవేటు ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా.. బాధితురాలి తండ్రికి రెవెన్యూ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించారు.
ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగిస్తూ జీవో కూడా జారీ చేశారు. దీంతో కేసు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థ చేతుల్లోకి వెళ్లటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జోక్యం చేసుకునే అవకాశాలు తగ్గాయి.
చేతులెత్తేసిన సీబీఐ?
ఈ ఘటన జరిగిన సమయంలో కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలు, డీఎన్ఏ రిపోర్టులు తారుమారు అయ్యాయని.. అందువల్ల కేసును నిరూపించటం కష్టంగా మారిందన్న అభిప్రాయం సీబీఐ నుంచి వచ్చినట్లుగా చెబుతారు.
దీంతో నిందితులపై చట్టపరమైన చర్యలు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.
ఈ కేసుతో పవన్ కల్యాణ్ కు సంబంధం ఏంటి?
ఈ ఘటనపై అప్పట్లో జనసేన అధినేత హోదాలో పవన్ కల్యాణ్ పెద్ద ఎత్తున స్పందించారు.
నిందితులను అప్పటి ప్రభుత్వం కాపాడుతోందని ఆరోపణలు చేశారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి పార్వతి కుమార్తె కేసుపైనే మొదటి సంతకం చేస్తానని పవన్ కల్యాణ్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతానని కూడా పలు సందర్భాల్లో చెప్పారు.
అయితే పవన్ కల్యాణ్ స్వయంగా ఇచ్చిన హామీకి భిన్నంగా.. కూటమి ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచినా.. కేసు విచారణలో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించకపోవటంతో బాధిత కుటుంబం పవన్ పై విమర్శలు చేస్తోంది.
పవన్ ఇమేజ్ కు భారీ డ్యామేజ్?
మహిళా భద్రత.. ఆడబిడ్డలపై జరిగే అన్యాయాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించటం తెలిసిందే.
రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై జరిగే దాడులు, అన్యాయాలపై తన వైఖరిని స్పష్టంగా చెబుతూ వచ్చారు.
అలాంటిది ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బాలికకు సంబంధించిన హత్యాచారం ఆరోపణల కేసును స్వయంగా టేకప్ చేసిన పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో స్పందించాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాను మాట ఇస్తే ఎంతకైనా నిలబడతాడన్న ఇమేజ్ పవన్ కల్యాణ్ సొంతం.
అలాంటి సమయంలో తాను గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా చర్యలు కనిపించకపోవటం ఆయన రాజకీయ ఇమేజ్ పై ప్రభావం చూపుతుందన్న చర్చ జరుగుతోంది.
## ఇప్పటికే వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టేశారు
ఈ కేసుకు సంబంధించి గతంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల వీడియోలను వైసీపీ సోషల్ మీడియా విస్తృతంగా షేర్ చేస్తోంది.
ఇచ్చిన మాటకు భిన్నంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారన్న వాదనను బలంగా వినిపించే ప్రయత్నం జరుగుతోంది.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసుపై తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం భిన్నంగా మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
ఇదే సమయంలో బాధితురాలి తల్లి సుగాలి పార్వతీదేవి గన్నవరం పోలీస్ స్టేషన్ లో పవన్ కల్యాణ్ పై ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన వ్యాఖ్యలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆమె ఆరోపిస్తున్నారు.
## మరి.. పవన్ వాదన ఏంటి?
సాక్ష్యాలు లేవని.. చట్టపరంగా నిరూపించలేని పరిస్థితి ఉందని డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి.
ముఖ్యంగా కాకినాడ పర్యటనలో సుగాలి పార్వతి కుమార్తె కేసుపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. సమాజంలో కొన్ని సందర్భాల్లో నేరం జరిగిందని స్పష్టంగా అనిపించినా.. చట్ట వ్యవస్థ మాత్రం సాక్ష్యాధారాల ఆధారంగానే పనిచేస్తుందని అన్నారు.
పక్కా ఆధారాలు లేకపోతే.. నేరానికి పాల్పడ్డారని అనుమానం ఉన్నప్పటికీ చట్టపరంగా చర్యలు తీసుకోవటం కష్టమవుతుందని పేర్కొన్నారు.
ఈ పరిస్థితికి ఉదాహరణగా సుగాలి పార్వతి కుమార్తె కేసును ప్రస్తావించిన పవన్.. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బాధితురాలి తల్లి తన కార్యాలయానికి వచ్చి కన్నీళ్లు పెట్టుకోవటంతో తాను చలించిపోయానని గుర్తు చేశారు.
ఈ కేసు ముందుకు సాగకపోవటానికి కారణం.. కీలకమైన ఫోరెన్సిక్ డీఎన్ఏ ఆధారాలు, ఇతర సాక్ష్యాలు అందుబాటులో లేకపోవటమేనని ఆయన వ్యాఖ్యానించారు.
## పవన్ పై బాధితురాలి తల్లి ఆగ్రహం ఏంటి?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సుగాలి పార్వతీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికల ముందు తన వద్ద ఆధారాలు ఉన్నాయని.. న్యాయం చేస్తానని.. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఈ కేసుపైనే చేస్తానని పవన్ కల్యాణ్ చెప్పారని ఆమె గుర్తు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఆధారాలు లేవని.. నిందితులను వదిలేయాల్సి వస్తుందని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపిస్తున్నారు.
తమకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. గతంలో ఇచ్చిన మాటను పవన్ నిలబెట్టుకోవాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.
## ఇప్పుడేం చేయటం మంచిది?
సాక్ష్యాలు లేవు.. ఆధారాలు లేవు.. పాత రికార్డులు తారుమారు అయ్యాయని చెప్పి ఈ కేసును వదిలేయటం కంటే..
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్ మరో కోణంలో ముందుకు వెళ్లే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో సాక్ష్యాలను ఎవరు ధ్వంసం చేశారు? ఏ అధికారులు నిందితులకు సహకరించారు? కీలక ఆధారాలు ఎలా మాయమయ్యాయి? అనే అంశాలపై ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించవచ్చన్న సూచనలు ఉన్నాయి.
అలా చేస్తే.. గతంలో ఇచ్చిన మాటల్లో ఉన్న నిబద్ధతను చేతల్లో కూడా చూపించినట్లవుతుంది.
మహిళా భద్రత, బాధితులకు న్యాయం విషయంలో తన వైఖరి ఏమిటో స్పష్టం చేసే అవకాశం పవన్ కల్యాణ్ కు ఉంటుంది.
మరి.. ఈ విషయంలో పవన్ కల్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
