Begin typing your search above and press return to search.

జనసేన అభ్యర్థులు వీరే...పోటీ ఆసక్తికరం

ఏపీ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశకు జనసేన సిద్ధమైంది. శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధారాణి, కాకినాడకు ఆకుల భవానిని పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. అలాగే రాజాం, భీమవరం, తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులనూ ప్రకటించారు. ఈ నెల 26న ఎన్నికలు జరగనున్నాయి.

By:  Satya P   |   16 Nov 2026 2:21 AM IST
జనసేన అభ్యర్థులు వీరే...పోటీ ఆసక్తికరం
X

ఏపీలో కూటమిలో రెండవ బలమైన మిత్రపక్షంగా ఉన్న జనసేనకు పొత్తులో భాగంగా నాలుగు మేయర్ పదవులతో పాటు 21 మునిసిపల్, నగర పంచాయతీ చైర్మన్ పదవులు దక్కాయి. ఏపీలో మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలలో 17 కార్పొరేషన్లు 106 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో జనసేనకు ఈ వాటా లభించంది. అయిదే పట్టణాల ఎన్నికలు తొలి దశలో కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. న్యాయపరమైన ఇబ్బందుల వల్ల కూడా వాటిని ఈ నెల 1వ తేదీన ఎన్నికలు జరగలేదు. అయితే ఇపుడు వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నెల 26న ఈ ఎన్నికలు ఉన్నాయి.

జనసేన తరపున రెడీ :

అయితే నాలుగు మేయర్లలో జనసేన తరఫున పొత్తులలో కేటాయించిన మిగిలిన రెండు కార్పోరేషన్లకు మేయర్ అభ్యర్ధులను తాజాగా ఎంపిక చేస్తూ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను జనసేన ఆదివారం రిలీజ్ చేసింది. దీని ప్రకారం చూస్తే 2 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ఖరారు చేసినట్లుగా జనసేన పేర్కొంది. శ్రీకాకుళం మేయర్ అభ్యర్థిగా డాక్టర్ దానేటి రాధారాణి, కాకినాడ మేయర్ అభ్యర్థిగా ఆకుల భవాని పేర్లు ఖరారు చేశారు. అలాగే రాజాం మున్సిపల్ చైర్మన్‌ అభ్యర్థిగా బనిశెట్టి సౌజన్య లత, భీమవరం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లిగూడెం చైర్మన్ అభ్యర్థిగా పాలూరు వెంకటేశ్వరరావు పేర్లను ఎంపిక చేసారు.

సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ :

ఇక మొదటి దశలో జనసేన పోటీ చేసిన 15 మున్సిపాలిటీలు, 3 నగర పంచాయతీల చైర్మన్ స్థానాలన్నింటిలో ఘన విజయం సాధించింది. అలా పిఠాపురం, గొల్లప్రోలు, తుని, నిడదవోలు, నరసాపురం, పెడన, తిరువూరు, చిలకలూరిపేట, సాలూరు, అమలాపురం, సామర్లకోట తదితర మునిసిపాలిటీలు ఉన్నాయి. అలాగే విజయవాడ, ఏలూరు కార్పోరేషన్ల మేయర్ పదవులు కూడా జనసేనను వరించాయి. దీంతో రెండో విడతలో కూడా సెంట్ పర్సెంట్ విజయాలను దక్కించుకోవాలని జనసేన వ్యూహ రచన చేస్తోంది. ఇక చూస్తే ఈ నెల 26న రెండవ దశలో ఎన్నికలు జరుగుతాయి. వీటి ఫలితాలను ఈ నెల 30న వెల్లడి చేస్తారు. దాంతో జనసేన అన్ని సమీకరణలు చూసుకుని రాజకీయంగా ధీటైన అభ్యర్ధులను ఎంపిక చేసింది అని అంటున్నారు.