పవన్ ఇంటి వద్ద హైడ్రామా.. అప్పులు తీర్చాలని అభిమాని ఆత్మహత్యాయత్నం!
ఆర్థిక ఇబ్బందులతో సాయం కోరేందుకు పవన్ కల్యాణ్‌ను కలవాలని వచ్చిన ఖమ్మం జిల్లాకు చెందిన అభిమాని సుచేతన్ ఠాకూర్ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. 16 రోజులుగా ప్రయత్నించినా అపాయింట్మెంట్ దక్కకపోవడంతో సెక్యూరిటీతో గొడవపడి కత్తితో దాడికి యత్నించాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది.
By: Tupaki Political Desk | 20 Nov 2026 10:48 PM ISTతన ఆర్థిక కష్టాలు తీర్చమని కోరుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసేందుకు వచ్చిన ఆయన అభిమాని ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని పవన్ నివాసం వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, సోషల్ మీడియాలో తెగ చర్చకు దారితీసింది. ఖమ్మం జిల్లాకు చెందిన పవన్ అభిమాని బట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ వృత్తిరీత్యా బిల్డర్ గా చెబుతున్నారు. వ్యాపారంలో నష్టపోయిన అతడు సాయం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలవాలని నిర్ణయించుకున్నాడు.
తన స్వస్థలం నుంచి మంగళగిరి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన సుచేతన్ ఠాకూర్ కు నిరాశే ఎదురైందని అంటున్నారు. 16 రోజులుగా పవన్ ఇళ్లు, కార్యాలయాల చుట్టూ తిరిగినా, ఆయనను కలుసుకునే అవకాశం దక్కకపోవడంతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఉన్న పవన్ నివాసం వద్దకు చేరుకున్నాడు. తాను పవన్ ను ఎందుకు కలవాలని ప్రయత్నిస్తున్నదీ వివరిస్తూ ఒక ప్లెక్సీ ముద్రించాడు. అందులో పవన్ పట్ల తన అభిమానం, తన కష్టాలు వివరించడమే కాకుండా 16 రోజులుగా ఎక్కడెక్కడకు వెళ్లింది వివరిస్తూ అందుకు సంబంధించిన ఫొటోలు ప్రదర్శించాడు.
అయితే అపాయింట్మెంటు లేని కారణంగా పవన్ నివాసం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతడికి అనుమతించలేదు. దీంతో పవన్ ను కలిసేందుకు అడ్డుపడుతున్నారని వారితో గొడవపడిన సుచేతన్ ఠాకూర్ తన వద్ద ఉన్న కత్తితో సెక్యూరిటీపై దాడి చేయడమే కాకుండా, తాను గాయపరచుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు. దీనిపై సెక్యూరిటీ సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు సుచేతన్ ఠాకూర్ ను అదుపులోకి తీసుకుని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు చెబుతున్నారు. అనంతరం పోలీసులు అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారని తెలుస్తోంది.
అంతులేని నిరాశ.. అనాలోచిత చర్యలు
ఆర్థిక సంక్షోభం, అప్పుల ఒత్తిడి మనిషి ఆలోచనా శక్తిని దెబ్బతీస్తాయనేందుకు ఈ ఘటన నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. 16 రోజుల పాటు తన కష్టాలను వివరిస్తూ ఫ్లెక్సీ పట్టుకుని తిరగడం వెనుక అంతులేని నిరాశ, నిస్పృహలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ‘‘పవన్ కల్యాణ్ ని ఒక్కసారి కలిస్తే చాలు, నా కష్టాలన్నీ తీరిపోతాయి’’ అనే అతి ఆశతో అతడు వాస్తవానికి దూరంగా ఆలోచించాడని చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ నివాసం వద్ద అత్యంత కట్టుదిట్టమైన భద్రతా నిబంధనలు ఉంటాయన్న కనీస అవగాహన లేకుండా వ్యవహరించడం, అనుమతి నిరాకరించగానే కత్తితో దాడికి యత్నించి, ఆత్మహత్యాయత్నం చేయడం అత్యంత ప్రమాదకరమైన పోకడగా చెబుతున్నారు. నిరాశలో ఉన్నప్పుడు తీసుకునే ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు సమస్యను పరిష్కరించకపోగా, మరింత జటిలం చేస్తాయని హెచ్చరిస్తున్నారు.
సెలబ్రిటీ కష్టాలు
తెలుగు రాష్ట్రాల్లో సినీ, రాజకీయ అభిమాన సంస్కృతి ఒకోసారి హద్దులు దాటుతోందని తాజా ఘటనను ఉదహరిస్తున్నారు. తమ కష్టాలకు ఏదో ఒక అద్భుతం జరుగుతుందని, అభిమాన హీరో వచ్చి ఆదుకుంటాడని భ్రమపడే ధోరణి యువతలో పెరుగుతుండటం ఆందోళనకరమని అంటున్నారు. కొందరు ప్రముఖులు తమ దాతృత్వంతో ఆపదలో ఉన్నవారికి సాయం చేసిన సందర్భాలు ఉండవచ్చు కానీ, దానినే ఒక హక్కుగా భావించి బ్లాక్మెయిల్ ధోరణిలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడటం సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతుందని అంటున్నారు. ఇలాంటి ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఇతరులను కూడా ఇదే తరహా విపరీత చర్యలకు ప్రేరేపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
