పవన్ ఫొటోతో అకౌంట్, లోకేష్ పై దూషణలు.. చివరికి ట్విస్ట్
కూటమిలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాల సృష్టికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయా పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
By: Tupaki Political Desk | 8 Oct 2026 7:00 PM ISTఏపీలో సోషల్ మీడియా దుర్వినియోగం పరాకాష్టకు చేరిపోయింది. రాజకీయాల కోసం సోషల్ మీడియాను ఇష్టానుసారం వాడుతున్న కొన్ని పార్టీల కార్యకర్తలు నైతికతను అసలు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. సోషల్ మీడియా పోస్టుల ద్వారా అనుచిత, అసత్య ప్రచారాలు చేస్తూ బరి తెగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు తేవడానికి కఠినంగా వ్యవహరించినా పరిస్థితిలో మార్పు రావడం లేదని తాజా ఘటన ఒకటి నిరూపించింది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు, కల్పిత వీడియోలు పోస్టు చేయడమే కాకుండా, అందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరుతో అకౌంట్ సృష్టించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కూటమి కార్యకర్తల అప్రమత్తతతో ఈ ఫేక్ అకౌంటు వెనుక అసలు కుట్ర బయటపడింది.
కూటమిలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాల సృష్టికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయా పార్టీల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కూటమి ముఖ్య నేతల పేర్లు, ఫొటోలు వాడుకోవడం గమనార్హం. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ఎక్స్ లో ఒక ఖాతా తెరవడమే కాకుండా, దాని నుంచి మంత్రి లోకేశ్, టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రత్తిపాడు నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు గింజుపల్లి నవీన్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ నెల 1న నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టి పవన్ పేరుతో ఫేక్ అకౌంటు సృష్టించారని గుర్తించారు. సోషల్ మీడియా ద్వారా టీడీపీ, జనసేన మధ్య అపోహలు, విభేదాలు పెంచే విధంగా పోస్టులు పెడుతున్నారని టీడీపీ నేత నవీన్ ఇచ్చిన ఫిర్యాదుతో అకౌంటు సృష్టించిన నిందితుడు ను అరెస్టు చేశారు. నిందితుడిది మంగళగిరి మండలం ఎర్రబాలెం కాగా, హైదరాబాద్ లో ఉంటూ ఫేక్ అకౌంటుతో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు.
టీడీపీ, జనసేనలో పనిచేసిన నిందితుడు
పవన్ ఫొటోతో ఫేక్ అకౌంటు సృష్టించిన నిందితుడు గతంలో జనసేన, టీడీపీ సోషల్ మీడియాల్లో పనిచేసినట్లు చెబుతున్నారు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో బయటకు పంపివేశారని అంటున్నారు. దీంతో రెండు పార్టీల మీద కోపం పెంచుకుని రెండు పార్టీల మధ్య అపార్థాలు, అనుమానాలు, విభేదాలు పెంచేలా కంటెంట్ రూపొందించి ప్రచారం చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా పవన్, లోకేశ్ మధ్య విభేదాలు ఉన్నట్లు కనిపించేలా పోస్టులు పెట్టడంతో నిందితుడు అసలు ఉద్దేశం ఏంటి? అతడికి ఇంకెవరైనా సహకరించారా? అన్న కోణంలో విచారిస్తున్నారని అంటున్నారు.
కూటమిలో చిచ్చు రాజేసే ప్రయత్నాలు?
కాగా, పవన్ ఫొటోతో ఫేక్ అకౌంట్ సృష్టించిన వ్యక్తి అరెస్టుతో సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు ఎక్కువైపోయాయని అంటున్నారు. ఏది నిజయో? ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకుందని అంటున్నారు. ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి నకిలీలతో మాయ చేస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో నైతికత అసలు పాటించడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుత్వాలు ఎంత కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఈ తరహా ఫేక్ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడకపోవడమే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
