Begin typing your search above and press return to search.

ఫేక్ చట్రంలో హై ప్రొఫైల్ లీడర్లు.. సోషల్ మాంత్రికులతో ముప్పుతిప్పలు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ ఆయన కార్యాలయం పేరుతో ఒక నకిలీ వాట్సాప్ చానల్ ద్వారా జరిగిన ప్రచారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.

By:  Tupaki Political Desk   |   23 Oct 2026 6:00 PM IST
ఫేక్ చట్రంలో హై ప్రొఫైల్ లీడర్లు.. సోషల్ మాంత్రికులతో ముప్పుతిప్పలు
X

"నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది.." ఈ ప్రసిద్ధ సామెతను పూర్వం ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ, ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలను చూస్తుంటే మాత్రం ఇది అక్షరాలా వంద శాతం నిజమనిపిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని ఒక గందరగోళ పరిస్థితి నేడు నెలకొంది. అరచేతిలో విజ్ఞానాన్ని పంచాల్సిన సాంకేతికతను, కొందరు తమ స్వార్థ రాజకీయం కోసం విషతుల్యం చేయడమే ఆందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. దీనికి తాజా నిదర్శనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కార్యాలయం పేరిట వెలుగుచూసిన నకిలీ వాట్సాప్ చానల్ వ్యవహారాన్ని చూపుతున్నారు. డిప్యూటీ సీఎం తన పదవికి రాజీనామా చేస్తున్నారని ఒక తప్పుడు సమాచారాన్ని ఆయన కార్యాలయం పేరిట సృష్టించిన నకిలీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రచారం చేయడం ఏపీ రాజకీయాలలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన పదవికి రాజీనామా చేస్తున్నారంటూ ఆయన కార్యాలయం పేరుతో ఒక నకిలీ వాట్సాప్ చానల్ ద్వారా జరిగిన ప్రచారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఈ తప్పుడు వార్త క్షణాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సివచ్చిందని అంటున్నారు. నిజానికి అనధికార వ్యక్తులు అధికారిక పేర్లతో సోషల్ మీడియా అకౌంట్లను సృష్టించడం తీవ్ర నేరంగా చెబుతున్నారు. అయితే ఈ అకౌంటు చాలా రోజులుగా ఉన్నా గుర్తించకపోవడం అధికారుల వైఫల్యంగా విమర్శిస్తున్నారు. వాట్సాప్ ద్వారా అనధికార వ్యక్తులు అధికారిక అకౌంట్లను పోలిన విధంగా ఖాతాలు తెరవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సివుందని అంటున్నారు. నకిలీ అకౌంటు ద్వారా పవన రాజీనామా చేస్తున్నారని చేసిన ప్రచారంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో ప్రభుత్వం ఆఘమేఘాలపై స్పందించింది. అయితే ఇటువంటి అకౌంట్లు ఇంకా కొన్ని వందల సంఖ్యలో ఉన్నాయని, సోషల్ మీడియాలో చాలా మంది అనధికార వ్యక్తులు తప్పుడు గుర్తింపుతో అధికారిక అకౌంట్లు నడుపుతున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు.

వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి 'చీప్ ట్రిక్స్' ఫేక్ ప్రచారాల సంస్కృతి నిన్న మొన్న మొదలైంది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ఏపీ రాజకీయ వేదికపై సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకుని ప్రత్యర్థులను దెబ్బతీసే కుట్రలు యథేచ్ఛగా సాగుతున్నాయని అంటున్నారు. ప్రముఖ నాయకుల స్థానంలో నకిలీ లెటర్ హెడ్‌లను క్రియేట్ చేయడం, రాజీనామా లేఖలు లేదా వివాదాస్పద ప్రకటనలు విడుదల చేయడం పరిపాటిగా మారిందని చెబుతున్నారు. అంతేకాకుండా, డీప్‌ఫేక్ కృత్రిమ మేధ సాంకేతికతను ఉపయోగించి నాయకుల విజువల్స్, వాయిస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదలడం, అసలైన పేజీలను పోలినట్లే ఉండే నకిలీ ఖాతాలను సృష్టించి ప్రజలను తప్పుదోవ పట్టించడం సర్వసాధారణంగా మారిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయాల్లో విమర్శలు, విధానపరమైన విభేదాలు సహజమే అయినప్పటికీ, ఫేక్ ఐడీల వెనుక దాక్కుని చేసే కుట్రలు మాత్రం నైతిక పతనానికి నిదర్శనంగా చెబుతున్నారు. ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో 'సోషల్ మాంత్రికులు' ఆడుతున్న ఈ వికృత క్రీడ వల్ల తీవ్ర పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రజాదరణ పొందిన నాయకులపై అబద్ధాలు ప్రచారం చేయడం వల్ల అనుచరులలో ఆవేశం పెరిగి శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే తొందరపాటే తప్ప, ఇలాంటి చర్యల వల్ల ప్రజాస్వామ్య విలువలు ఎంతగా దిగజారిపోతున్నాయో, తమ నైతికత ఎంతగా పతనమవుతుందో అనే స్పృహ ఈ బ్యాచ్‌కు లేకపోవడం విచారకరమని అంటున్నారు. అసత్య ప్రచారాల హోరులో నిజమైన, అత్యవసరమైన సమాచారం కూడా ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తమవుతోంది.