పవన్ మురిపెం...వాటి సంబరం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న శాఖల పట్ల ఎంత బాధ్యతగా నిబద్ధతగా ఉంటారో అందరికీ తెలిసిందే.
By: Satya P | 9 Nov 2025 6:56 PM ISTఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను తీసుకున్న శాఖల పట్ల ఎంత బాధ్యతగా నిబద్ధతగా ఉంటారో అందరికీ తెలిసిందే. గడచిన ఏణ్ణర్ధం పాలనలో ఆయన అన్నీ అవగాహన చేసుకుంటున్నారు. ఎంతో నేర్చుకుంటున్నారు. తనకు తెలిసిన విషయాలు ప్రజా కోణంలో అధికారులకు చెబుతున్నారు. తెలియని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇక పవన్ తీసుకున్న శాఖలలో ఇంత విషయం ఉందా ఇంత లోతుగా గతంలో అధ్యయనం జరిగిందా అన్న చర్చ అయితే అందరికీ వస్తుంది. ఎందుకంటే ఆయా శాఖలను నిర్వహించే వారు గతంలో ఇంత గ్రౌండ్ లెవెల్ దాకా వెళ్ళిన దాఖలాలు లేవని అంటున్నారు.
పవన్ ఆసక్తి :
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పవన్ పర్యటన అంతా అటవీ శాఖ సమీక్షగా సాగుతోంది. ఆయన ఫీల్డ్ లోకి దిగి అన్నీ గమనిస్తున్నారు. నిన్నటికి నిన్న ఎర్ర చందనం గురించి పూర్తి సమాచారం అందుకుని పవన్ వాటి విషయంలో చేయాల్సింది ఏమిటో అధికారులు చెప్పేశారు. ఈ రోజున చూస్తే కుంకీ ఏంగుల ప్రదర్శనను పవన్ స్వయంగా తిలకించి పులకించిపోయారు. జిల్లాలోని ముసలమడుగు కుంకీ ఏనుగుల శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ అక్కడ కుంకీ ఏనుగుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించి ఎంతగానో హ్యాపీ ఫీల్ అయ్యారు.
విన్యాసం అదుర్స్ :
ఇక ఈ సందర్భంగా మదపుటేనుగులను కట్టడి చేసే విన్యానం చూసి పవన్ చాలా ఆసక్తిని ప్రదర్శించారు. కుంకీలకు స్వయంగా ఆహారం అందించి ఆయన ఆనందించారు. ఈ విన్యాసంలో భాగంగా క్రమబద్ధంగా ముందుకు సాగుతూ కుంకీ ఏనుగులు వరుసగా వస్తూ ఘీంకారం చేస్తూ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కి సెల్యూట్ చేశాయి. కుంకీఏనుగులకు పవన్ స్వయంగా బెల్లం ఆహారం అందించారు. ఇక గజరాజుల ఆశీర్వచనం కూడా పవన్ ఎంతో ప్రేమగా తీసుకున్నారు.
ఆకట్టుకున్న తీరు :
కుంకీ ఏనుగులు అడవిలో లభ్యమయ్యే వివిధ రకాల కలపను ఎలా బయటకు తీసుకువచ్చేది పవన్ ఎదుట అటవీ శాఖ అధికారులు ప్రదర్శింపజేశారు. ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు కానీ మదపుటేనుగుల గుంపు ఏకంగా నివాసాల అలాగే పంట పొలాల వైపు వస్తున్నప్పుడు వాటిని ఎలా నియంత్రించాలో ప్రత్యక్షంగా కుంకీ ఏనుగుల చేత చేయించిన ప్రదర్శన సైతం అందరినీ ఆకట్టుకుంది. మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ఓ ప్రత్యేకంగా మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణిచి వేస్తారు అన్నది మావటీలు అటవీ మంత్రి పవన్ కళ్యాణ్ కి కళ్ళకు కట్టినట్లుగా చూపించారు.ఇక పవన్ సైతం మత్తు ఇచ్చే ఇంజెక్షన్ గన్ ను ఆసక్తిగా తిలకించారు.
పవన్ ఔదార్యం :
అదే విధంగా ముసలమడుగు వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఏనుగుల శిక్షణ, సంరక్షణ తదితర అంశాలను స్వయంగా అధికారులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. కర్ణాటక నుంచి తెచ్చిన నాలుగు కుంకీ ఏనుగులతోపాటు గతంలో ఇదే శిక్షణ కేంద్రంలో ఉన్న మూడు కుంకీలు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయి. శిక్షణలో కుంకీ ఏనుగులు చూపుతున్న మెలకువలు, ఇటీవల జరిగిన ఆపరేషన్ల తీరును అధికారులు వివరించారు ఇక కుంకీల బాధ్యత చూసే మావటీలకి పవన్ తన సొంత డబ్బులుగా 50 వేలు బహుమానం ఇచ్చి ఆప్యాయంగా వారి భుజం తట్టారు. అంతే కాదు వారితో కలసి ఫోటోలు దిగడం ద్వారా వారికి ఎంతో ప్రేమను పంచారు.
