పవన్ జిల్లాల పర్యటనకు బ్రేక్.. రీజనేంటి ..!
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల్లో పర్యటించాలని, పార్టీతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలని గత కొన్నాళ్లుగా భావిస్తున్నారు.
By: Garuda Media | 8 Oct 2025 10:00 AM ISTజనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాల్లో పర్యటించాలని, పార్టీతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు వివరించాలని గత కొన్నాళ్లుగా భావిస్తున్నారు. దీనికి సెప్టెంబర్ లోనే ఆయన ముహూర్తం పెట్టుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ రెండవ వారం, లేదా మూడో వారంలో గ్రామాల్లో పర్యటిస్తానని గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను అదేవిధంగా పంచాయతీ శాఖ పరిధిలో తీసుకుంటున్న నిర్ణయాలను కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తానని చెప్పారు.
కానీ, ఈ పర్యటన వాయిదా పడింది. దసరా తర్వాత మళ్లీ రంగంలోకి వస్తారని కూడా జనసేన నాయకుల అప్పట్లో చెప్పారు. కానీ, ప్రస్తుతం మారిన పరిణామాలు, రాజకీయ వ్యవహారాల నేపథ్యంలో ఈ పర్యటనను పవన్ కళ్యాణ్ పూర్తిగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటినుంచే కాకుండా ఇంకో రెండు నెలలు ఆగి డిసెంబర్ నుంచి జిల్లాలు అదేవిధంగా గ్రామాల్లో పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించుకున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు జిల్లాల్లో పర్యటించాలని నియోజకవర్గాల్లో సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయత్నం చేయాలని కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సో దీనిని బట్టి పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటన ఇప్పట్లో లేదన్నది స్పష్టం అవుతుంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నుంచి మొదలుపెట్టి రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడం ద్వారా పార్టీని బలోపేతం చేయనున్నారు.
అదేవిధంగా ప్రభుత్వానికి సానుకూల పరిణామాలు తీసుకురావచ్చు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇప్పటివరకు ఏదైతే అంచనాలు ఉన్నాయో పవన్ కళ్యాణ్ జిల్లాల పర్యటనపై మాత్రం వాయిదా పడినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వపరంగా పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న పనులు యధావిధిగా కొనసాగుతాయని అంటున్నారు. జిల్లాలు, గ్రామాల స్థాయిలో నాయకులు వాటిని పర్యవేక్షించి ప్రజలకు వివరించాలని తాజాగా పవన్ కళ్యాణ్ సూచించారు. దీనిని బట్టి పవన్ కల్యాణ్ పర్యటనలు ఇప్పట్లో లేవని తెలుస్తోంది.
