జనసేనాని మాస్టర్ ప్లాన్.....ముహూర్తం ఫిక్స్ !
అధికారంలో ఉన్న పార్టీలు సాధారణంగా పార్టీ నేతలతో మీటింగ్స్ పెట్టవు. ప్రభుత్వ కార్యక్రమాలకే సమయం సరిపోతుంది. జనసేన విషయంలో కూడా గడచిన రెండేళ్ళలో అదే జరిగింది.
By: Satya P | 1 May 2026 8:30 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలను బాగానే అలవరచుకున్నారని ఆయన పార్టీ పరంగా అనుసరిస్తున్న వైఖరిని చూసిన వారు చెబుతారు. పొత్తులతో 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడం వెనక ఆయన రాజనీతి దాగుందని అంటారు. ఒంటరిగా ఉంటే గెలుపు పిలుపు వినిపించదు. అదే జత కూడితే అందరికీ మేలు అన్నది గ్రహించిన పవన్ నాడు పొత్తులతో వేసిన ఎత్తులతో ఈ రోజు జనసేన అధికారంలో ఉండగలుగుతోంది. ఇక 2029 లోనూ ఇదే కూటమితో కలసి ప్రయాణించాలని పవన్ భావిస్తున్నారు. పదే పదే ఇదే విషయాన్ని కూడా ఆయన చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీల మధ్య ఐక్యత కో ఆర్డినేషన్ మరింతగా ఉండాలని ఆయన భావిస్తున్నారు. దాంతో పాటు జనసేన నేతలలో ఉన్న అసంతృప్తిని కూడా గ్రహించి దానిని పోగొట్టాలని అంతా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని అనివార్యతను కూడా తెలియచేయాలని నిర్ణయించుకున్నారు.
జిల్లా టూర్లతో శ్రీకారం :
అధికారంలో ఉన్న పార్టీలు సాధారణంగా పార్టీ నేతలతో మీటింగ్స్ పెట్టవు. ప్రభుత్వ కార్యక్రమాలకే సమయం సరిపోతుంది. జనసేన విషయంలో కూడా గడచిన రెండేళ్ళలో అదే జరిగింది. పవన్ అధికారిక బాధ్యతలతో తలమునకలుగా ఉంటూ పార్టీని కొంచెం పక్కన పెట్టారు అన్న విమర్శలు వచ్చాయి. అందుకే రెండేళ్ళ కూటమి పాలన పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన జిల్లా టూర్లకు వెళ్లబోతున్నారు. ఈ టూర్ల లక్ష్యం అంతా పార్టీ కోసమే అని చెబుతున్నారు. ప్రతీ జిల్లాలో పర్యటించడం ఆయా జిల్లాలోని నియోజకవర్గాల నేతలతో సమావేశం కావడం గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ని పరిశీలించి ఆకళింపు చేసుకుని తగిన విధంగా రియాక్ట్ కావడం అన్నది లక్ష్యంగా చేసుకుని పవన్ జిల్లాలకు రానున్నారు అని అంటున్నారు.
స్థానిక అజెండాతోనే :
ఇక ఆగస్టులో స్థానిక ఎన్నికల నగరా మోగనుంది. దాని కంటే ముందే జిల్లాల పర్యటన చేపట్టాలని పవన్ నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో జనసేన నేతలకు ఎక్కువ సీట్లు ఇప్ప్పించుకోవడం ద్వారా క్షేత్ర స్థాయిలో పార్టీ బలపడేందుకు బాటలు వేయాలని పవన్ చూస్తున్నారు కష్టించి పనిచేసే వారిని గుర్తించడంతో పాటు కూటమిలో సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న వారిని కూడా పిలిచి విషయం కనుక్కుని అంతా చక్కదిద్దాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. అదే విధంగా సమస్యలు పెద్దవిగా ఉంటే రాష్ట్ర స్థాయిలో కూటమి నేతల కో ఆర్డినేషన్ సమావేశంలో వాటిని ప్రస్థావించి పరిష్కరించాలని కూడా ఆయన నిర్ణయించుకున్నారని చెబుతున్నారు
కార్యకర్తే ముఖ్యం :
జనసేన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. వారితో నేరుగా పవన్ సమావేశం అవుతారు అని అంటున్నారు. పార్టీలో వారికి ప్రాధాన్యత పెంచడం పదవులలో అవకాశం కల్పించడం ప్రభుత్వంలో వారికి తగిన గుర్తింపు ఇవ్వడం అన్నది ఆధినేత హోదాలో పవన్ ఒక భరోసా ఇస్తారని అంటున్నారు. జనసేన క్యాడర్ అయితే ఒకింత నిరాశలో ఉంది అని వార్తలు అయితే ఉన్నాయి. దాంతో వారిలో నైరాశ్యం పోగొట్టు సరికొత్త జోష్ ని తెచ్చేందుకు పవన్ జిల్లా పర్యటనలు దోహోదపడతాయని అంటున్నారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ మే నెల ఎండలు తగ్గిన తరువాత జూన్ నుంచి తన జిల్లా యాత్రలకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు.
