కాక్రోచ్...ఒక హెచ్చరిక...పవన్ చెప్పింది ఇదేనా ?
కాక్రోచ్ పార్టీ అంట. ఒక్క రోజులో పుట్టిన పార్టీకి వేలు లక్షలలో ఫాలోవర్స్. అదే వింతా విడ్డూరం అనుకుంటే సీజేపీ ఫౌండర్ హోదాలో అభిజిత్ దీప్కే దేశంలో పర్యటిస్తున్నాడు. మీటింగ్స్ పెడుతున్నాడు.
By: Satya P | 16 Jun 2026 12:05 AM ISTకాక్రోచ్ పార్టీ అంట. ఒక్క రోజులో పుట్టిన పార్టీకి వేలు లక్షలలో ఫాలోవర్స్. అదే వింతా విడ్డూరం అనుకుంటే సీజేపీ ఫౌండర్ హోదాలో అభిజిత్ దీప్కే దేశంలో పర్యటిస్తున్నాడు. మీటింగ్స్ పెడుతున్నాడు. దానికి వెల్లువలా జనాలు వెళ్తున్నారు. కొంతమంది మేధావులు కూడా మద్దతుగా నిలిచి మాట్లాడుతున్నారు. ఇంతకీ ఏమిటీ కాక్రోచ్ పార్టీ. దాని ఫిలాసఫీ ఏమిటి, ఆలోచనలు ఏమిటి ఇది ఎవరూ ఆలోచించడం లేదు, ఒక వేడిలో ఒక ఉప్పెనలో పడి అంతా ముందుకు సాగుతున్నారు. తమలోని అసహనం అసంతృప్తికి ఒక వేదిక దొరికిందని భావించే వారే అత్యధిక శాతం సీజేపీ సభలలో కనిపిస్తున్నారు. మరి వారి సమస్య ఏమిటి వారి ఆలోచనలు ఏమిటి అన్నది ఒకింత ఫోకస్ పెట్టి ఆలోచించాల్సిన విషయమే అని అంటున్నారు. అయితే బాధ్యత గలిగిన పార్టీల నుంచి కాక్రోచ్ విషయంలో పెద్దగా స్పందన లేదు, విపక్షాలు అయితే ఇది ప్రభుత్వ వ్యతిరేకత అన్నట్లుగా చూస్తున్నాయి. కానీ జనసేన మాత్రం దీనిని సరికొత్త కోణంలో చూసింది. అదే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నిర్వహించిన సభలో వ్యక్తం చేశారు.
కురచ ఆలోచనలు :
సమస్యలు అందరికీ ఉంటాయి. అలాగే ఇబ్బందులు ఉంటాయి. కానీ అవి దేశాన్ని మించి చూసే వైఖరి ఉండరాదు అన్నదే పవన్ కళ్యాణ్ భావనగా ఉంది. కురచ ఆలోచనలు చేసే వారు విభజన కోణంలో ఆలోచించే వారు బలమైన జాతీయ భావానికి తూట్లు పొడుస్తున్నారు అని పవన్ అభిప్రాయపడ్డారు. ఇలా ఒక్కొక్కరుగా వేలుగా లక్షలుగా కోట్లుగా చేరితే ఈ చిన్న ఆలోచనలే బలమైన జాతీయ భావాన్ని సైతం ప్రమాదంలో నెట్టేస్తాయని పవన్ హెచ్చరించే ధోరణిలోనే వ్యాఖ్యానించారు. అంటే ఆయన చెప్పినది చూస్తే కాక్రోచ్ కదా అని లైట్ తీసుకోకూడదు అన్న సందేశాన్ని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చేసుకుని పంపించారు.
జాతీయ సమైక్యత కోసం :
తాను ఢిల్లీ వేదికగా సభ పెట్టడానికి కారణం జాతీయ సమైక్యత రంగరించుకున్న నేల కాబట్టి అని పవన్ పేర్కొన్నారు. ఎన్నో వందల వేల ఏళ్ళుగా అనేక భిన్నత్వాలను వైవిధ్యాలను చూసిన గడ్డ ఢిల్లీ అని పవన్ కొనియాడారు. ఎంత విభిన్నత ఉన్నా ఈ భూమి అందరికీ ఏకం చేసింది అని కూడా అన్నారు. ఆ స్పూర్తి కోసమే జనసేన సమావేశానికి ఢిల్లీని ఎంచుకున్నట్లుగా పవన్ చెప్పారు. జాతీయ సమైక్యత సమగ్రత అన్నవి జనసేన ప్రాధమిక ఆలోచనలు అసలైన అజెండాగా కూడా ఆయన స్పష్టం చేశారు.
జాతీయ వాదంతోనే :
భిన్న వైఖరులు వాదనలు ఉన్నా జాతీయ భావనలో అంతా ఒదిగిపోవాలన్నది పవన్ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో చిన్న బుద్ధులను కురచ ఆలోచనలను సంకుచిత ధోరణులను కనుక తేలికగా తీసుకుని వదిలేస్తే మాత్రం జాతీయవాదానికే పెను సవాల్ ఎదురవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఆయన ఒక తెలుగు పద్యాన్ని కూడా ఉటంకించారు. చిన్న క్రిమి కీటకాలే కదా అని వదిలేయరాదని అంటూ చలి చీమల చేత చిక్కిన బలవంతమైన సర్పం మరణించింది అని గుర్తు చేసుకున్నారు.
అనేక కోణాల నుంచి :
ఇక పవన్ మాట్లాడినది తీసుకుంటే కనుక అనేక అంశాలు అందులో ఉన్నాయి. ఏ రాష్ట్రం అయినా ప్రాంతం అయినా దేశంలో అంతర్భాగమే అని ఆయన చెప్పదలచారు. తనను ఇటీవల తెలంగాణాలో సభ నిర్వహించకుండా అడ్డుకోవడాన్ని ఆయన ఉదహరిస్తూ ఈ తరహా వైఖరుల మీద కూడా నిశితంగా విమర్శించారు. తాను తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుని స్వాగతించాను అని పవన్ చెబుతూ విభజన తీరునే తప్పుపట్టాను అని మరో మారు వివరించారు. పెడ ధోరణులు, సంకుచిత భావాలు, విభజన వాదాలు వీటి మీద గట్టిగానే దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని పవన్ తన స్పీచ్ ద్వారా తెలియచేశారు. మొత్తానికి ఒక అధికార పక్ష నాయకుడు, కీలక పార్టీ అధినేత దేశంలో వర్తమాన పరిస్థితుల పట్ల తనదైన శైలిలో విశ్లేషిస్తూ జాతీయ భావన సమైక్య భావన సమగ్రత అవసరాన్ని ఢిల్లీ వేదికగా స్పష్టంగా చెప్పడం అన్నది ఒక విశేష పరిణామంగానే అంతా చూస్తున్నారు.
