Begin typing your search above and press return to search.

ఇంటి అడ్రస్ తెలియాలనే ప్రెస్ మీట్ పెట్టా.. పవన్ ఫుల్ క్లారిటీ

తెగించినోడికి అడ్డేముంది? అన్నట్లుగా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరు ఉందని చెప్పాలి.

By:  Garuda Media   |   3 Jun 2026 10:35 AM IST
ఇంటి అడ్రస్ తెలియాలనే ప్రెస్ మీట్ పెట్టా.. పవన్ ఫుల్ క్లారిటీ
X

తెగించినోడికి అడ్డేముంది? అన్నట్లుగా జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీరు ఉందని చెప్పాలి. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ కు ఆంధ్రోడన్న ట్యాగ్ వేయటం.. ఆయన పార్టీ హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో 2 వేల మందితో సభను నిర్వహించుకుంటానంటే నో చెప్పటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొద్దిరోజుల క్రితం ప్రొఫెసర్ నాగేశ్వర్ తన రాజకీయ విశ్లేషణలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ అయిన సందర్భంగా వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా కొన్ని అంశాల్ని పేర్కొనటం.. ఇవన్నీ పవన్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉండటం.. ప్రజల్లో కొత్త సందేహాలకు కారణమయ్యేలా ఉండటం తెలిసిందే.

ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల్ని పవన్ కల్యాణ్ ఖండించటమే కాదు.. ఆయన మాటల్లో నిజం లేదని తేల్చటం తెలిసిందే. ఇదిలా ఉండగా పలువురు జనసేన కార్యకర్తలు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కేసులు పెట్టటంతో విషయం మరో డైరెక్షన్ లోకి వెళ్లింది. ఈ తీరును తెలంగాణకు చెందిన అనే కన్నా.. వామపక్ష భావజాలంతో ఉన్న కొందరు ప్రొఫెసర్ నాగేశ్వర్ తో కలిసి ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయటం.. ఆ సందర్భంగా పవన్ ను ఉద్దేశించి నానా మాటలు అనటం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మరికొందరు సైతం నోటికి పని చెబుతూ.. పవన్ పై విరుచుకుపడ్డారు.

ఇదిలా ఉండగా.. జూన్2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ.. గచ్చిబౌలిలో ఒక సభను నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో అనుమతులు కోరటం.. దీనిపై పోలీసులు నో చెప్పటం తెలిసిందే. ఈ నిర్ణయం జనసేన వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారింది. ఇదే సమయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ లాంటివాళ్లు తెర మీదకు వచ్చి.. పలు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. మొత్తంగా పవన్ కల్యాణ్ ను విమర్శించేవారు.. ఆయనపై మాటలతో విరుచుకుపడేవారు.. పలు సందర్భాల్లో పలు వ్యాఖ్యలు చేశారు.

పవన్ ను తెలంగాణలో తిరగనివ్వమని ఒకరంటే.. నాలుక కోస్తామని మరొకరు.. పవన్ ఇంటికి వెళతామని మరొకరు.. ఎవరికి వారు తమకు తోచిన రీతిలో వ్యాఖ్యానించటం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇంటి గురించి పలువురు మాట్లాడుతున్నారని.. తనను ఏదో చేస్తామని కూడా అంటున్నారని.. అందుకే.. వారందరికి తన ఇల్లు తెలీయటం కోసం తాను ఇంటి వద్ద మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొనటం ద్వారా కొత్త సంచలనానికి తెర తీశారన్న మాట వినిపిస్తోంది. తనను విమర్శించే వారికి.. హెచ్చరికలు జారీ చేసే వారిని తాను అస్సలు పట్టించుకోనన్న విషయాన్ని తేల్చి చెప్పే క్రమంలోనే పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారన్న మాట వినిపిస్తోంది.