Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ మీద పవన్...అదే ఆగ్రహం !

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఎక్కడా లేదు, తెలంగాణ లో చూస్తే రెండేళ్ల క్రితమే అధికారం చేపట్టింది. ఇక దేశంలో కూడా మూడు రాష్ట్రాలలోనే సొంతంగా అధికారంలో ఉంది.

By:  Satya P   |   30 March 2026 7:00 AM IST
కాంగ్రెస్ మీద పవన్...అదే ఆగ్రహం !
X

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ఎక్కడా లేదు, తెలంగాణ లో చూస్తే రెండేళ్ల క్రితమే అధికారం చేపట్టింది. ఇక దేశంలో కూడా మూడు రాష్ట్రాలలోనే సొంతంగా అధికారంలో ఉంది. వరసగా మూడు ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాకుండా విపక్షంలో ఉండిపోయింది. అయితే కాంగ్రెస్ వల్ల ఎవరు ఎంతగా ఇబ్బంది పడ్డారు అన్నది పక్కన పెడితే ఏపీ జనాలు మాత్రం భవిష్యత్తు తరాలకు సరిపడా అవస్థలు సమస్యలు అన్నీ మూటకట్టుకున్నారు అని చరిత్ర చెబుతుంది. 2014లో కాంగ్రెస్ ఉమ్మడి ఏపీని విభజించిన తీరు మీద అందరికీ అభ్యంతరాలు ఉన్నాయి. అదే ఇప్పటికీ మేధావులు రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు.

కాంగ్రెస్ చేసిందే అంటూ :

అయితే ఏపీలో ప్రధాన పార్టీలు కాంగ్రెస్ ఊసు మరచిపోయాయి. కానీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం కాంగ్రెస్ ఏపీకి చేసిన అన్యాయం గురించి మరచిపోలేదు. 2014 మార్చి 14న ఆయన జనసేన ఆవ్రిభావం ప్రకటన చేస్తూ నిర్వహించిన సభలో ఏమి చెప్పారో ఎంత ఆగ్రహం ప్రదర్శించారో ఇప్పటికీ ఆయనలో అదే ఆగ్రహం ఆవేదన ఉన్నాయని అంటున్నారు. అమరావతి ఏపీకి శాశ్వత రాజధాని అంటూ ఆమోదించిన తీర్మానం మీద పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ మీద విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వాకం వల్లనే ఇదంతా జరిగింది అన్నారు.

సరిగ్గా జరగలేదు :

విభజన అన్నది సాఫీగా సరిగ్గా కాంగ్రెస్ ఆనాడు చేయకపోవడం వల్లనే అంతా ఇబ్బందులు పడ్డారని ఏపీ ఈ రోజుకీ పడుతోందని పవన్ విమర్శించారు. విభజన విషయంలో కాంగ్రెస్ సక్రమంగా వ్యవహరించలేకపోయింది అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని పవన్ విమర్శించారు. సరైన ప్రణాళిక లేకుండా విభజించారని పవన్ మండిపడ్డారు.

రాజధాని లేకుండా :

కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర విభజన సమయంలో సరుగ్గా వ్యవహరించలేదని పవన్ నిందించారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించలేదని ఆయన అన్నారు. అలా కాంగ్రెస్ వాళ్లు చేసిన పొరపాటు వల్లే మనం ఇంకా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయామని పవన్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన నాటి పరిస్థితులు మళ్లీ ఉత్పన్నం కాకూడదని పవన్ గట్టిగా కోరుకున్నారు.

లోతుగా వెళ్ళి మరీ :

రాజధానిగా అమరావతిని శాశ్వతం చేస్తూ తీర్మానం ఆమోదించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో అంతా వైసీపీ మీదనే విమర్శలు చేశారు. లోతుగా ఎవరూ వెళ్లలేకపోయారు. అయితే పవన్ మాత్రం 2014 ముందు నాటి పరిస్థితులను కూడా సవివరంగా సభకు తెలిపారు. అసలు విభజన ఎలా జరిగింది కాంగ్రెస్ ఆనాడు చేసిన నిర్వాకం ఏమిటి రాజధాని ఏపీకి లేకపోవడం ఏమిటి అంటూ ఆయన ఆవేదనతో ఆగ్రహంతో చరిత్రలో ఉన్న విషయాలను ఒక్కసారి సభ ముందుకు తెచ్చారు. ఆంధ్రులకు ఇన్నేళ్ళు అయినా రాజధాని లేకపోవడం అత్యంత బాధాకరమని పవన్ అంటూ కాంగ్రెస్ మీద మండిపడ్డారు. దాంతో పవన్ కాంగ్రెస్ విషయంలో అదే ఆగ్రహంతో ఉన్నారని అంతా అంటున్నారు.