Begin typing your search above and press return to search.

కాలుకి కాలు, కీలుకి కీలు... పవన్ కల్యాణ్ నిప్పులు!

అవును... నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో అమరజీవి జలధార ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. జనసైనికులకు పలు సూచనలు చేశారు.

By:  Raja Ch   |   20 Dec 2025 3:14 PM IST
కాలుకి కాలు, కీలుకి కీలు... పవన్  కల్యాణ్ నిప్పులు!
X

తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో "అమరజీవి జలధార" కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ పథకానికి శంకుస్థాపన చేసిన ఆయనకు.. ప్రాజెక్ట్ వివరాలను అధికారులు వివరించారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం పలు సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. అధికారం ఉనా లేకపోయినా తాను ఇలానే ఉంటానని తెలిపారు.

అవును... నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో అమరజీవి జలధార ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. జనసైనికులకు పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా... ఉత్సాహం మంచిదే కానీ, నియంత్రణ ముఖ్యమని.. ఇలా అరవడాలు, అల్లర్లు చేయడం వల్ల తానున్న సభలకు రావడానికి ప్రధానమంత్రి సైతం ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇలా అదేపనిగా చెప్పింది వినకుండా అరవడం వల్ల గొంతులు పోతాయని అన్నారు!

ఈ సందర్భంగా... మీరు ఎవరిని ఆరాధిస్తారో వారిలానే తయారవుతారని చెప్పిన పవన్ కల్యాణ్.. తాను పొట్టి శ్రీరాములుని ఆరాధించినట్లు తెలిపారు. తాను క్రిమినల్స్ ని, దోపిడీ చేసేవారిని, దగా చేసేవారిని ఆరాధించలేదని.. హక్కుల కోసం పోరాడేవారిని ఆరాధించానని అన్నారు. దానివల్లే తాను పార్టీ పెట్టి, 10ఏళ్లు తగ్గి, సీట్ల విషయంలోనూ తగ్గి, అందరి చేతా తిట్లు తింటా ఉన్నానని తెలిపారు. తాను సీట్లు అమ్మేసుకున్నానని ఒకరంటే.. దిగజారిపోయానని మరొకరన్నారని పేర్కొన్నారు.

ఈ క్రమంలో.. ప్రతిపక్షంలోనూ లేని గత ముఖ్యమంత్రి పార్టీకి ఒకటే చెప్పాలనుకుంటున్నానని చెప్పిన పవన్ కల్యాణ్.. అధికారంలో ఉన్నప్పుడూ వారి బెదిరింపులకు తాము భయపడలేదని అన్నారు. ఈ సమయంలో బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరినీ చంపేస్తాం, మళ్లీ మేము వస్తాం అంటున్నారని, అరెస్టులు చేస్తామని బెదిరిస్తున్నారని.. వాటినికి బెదిరేది లేదని తెలిపారు!

కాంట్రాక్టర్లను జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు అంటే అసలు ఏమనుకుంటున్నారు మీరంతా అని పవన్ ప్రశ్నించారు. ఇలా బెదిరించేవారికి ఒకటే చెబుతున్నా... మిగిలినవారి సంగతి నాకు తెలియదు.. అధికారంలో ఉన్నా లేకపోయినా పవన్ కల్యాణ్ ఇలానే ఉంటాడు, ఎవరికీ భయపడడు అని డిప్యూటీ సీఎం నొక్కి చెప్పారు. యోగీ అధిత్యనాథ్ లాంటి ట్రీట్ మెంట్ గనుక మీ అందరికీ ఇస్తే సెట్ అవుతారని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే... రౌండీయిజం అని ఎవరైనా అంటే వాళ్లను కాలుకు కాలు, కీలుకు కీలు తీసి మడపతెట్టి కింద కూర్చోబెడితే తెలుస్తుందని అన్నారు. సోషల్ మీడియాలో కానీ, విదేశాల్లో కూర్చి వాగేవాళ్లు, ఇక్కడ కూర్చుని మాట్లాడేవాళ్లు.. మళ్లీ మేము వస్తామని చెప్పేవాళ్లు.. ఇంతకు ముందు వచ్చినప్పుడే ఏమీ చేయలేదు.. మీ బెదిరింపులకు ఎవరూ భయపడరు అని పవన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.