మోడీ మీద పవన్ వి అంచనాలా ...ఆరాధనా ?
ఇక దేశంలో రాజకీయం మారుతోంది. బీజేపీకి కత్తి మీద సాముగా మారుతోంది. యువత ఇపుడు కేంద్ర ప్రభుత్వం తీరు మీద ఆగ్రహంగా ఉన్నారు.
By: Satya P | 2 Aug 2026 9:05 AM ISTఏ రాజకీయ నాయకుడి ఇమేజ్ కి అయినా గ్రాఫ్ తగ్గడం అన్నది ఉంటుంది. తొలి ప్రధాని పండిట్ నెహ్రూ కూడా తొలిసారి గెలిచినన్ని సీట్లు తరువాత గెలవలేదు. ఇందిరాగాంధీ చరిష్మా బాగా వెలిగిన రోజులలో హవా వేరు. ఆ తరువాత ఆమె స్వయంగా ఓటమి పాలు అయి పార్టీ కూడా ఓడింది. ఈ దేశంలో ఓడని నాయకుడు ఎవరూ లేరు, అత్యంత జనాదరణ కలిగిన అటల్ బిహారీ వాజ్ పేయి కూడా 2004 ఎన్నికల్లో ఓటమి చెందారు. రధయాత్రతో దేశమంతా ఊపేసిన ఎల్ కే అద్వానీ ప్రధాని కల నెరవేర్చుకోలేదు. ఆయన సారథ్యంలో 2009 ఎన్నికల్లో బీజేపీ ఓడింది.
సీట్లు తగ్గాయి :
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక నరేంద్ర మోడీ విషయానికి వస్తే ఈయన మిగిలిన వారి కంటే ప్రత్యేకమే అని చెప్పాలి. ఎందుకంటే మోడీ ఇంతవరకూ ఎక్కడా ఓటమి అన్నది చూడలేదు, గుజరాత్ లో ఆయన 13 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి మూడు ఎన్నికల్లో బీజేపీని గెలిపించారు. ఇక ప్రధానిగా ఆయన 12 ఏళ్ళుగా పనిచేస్తున్నారు, అలాగే మూడు ఎన్నికల్లో రెండు బీజేపీ పూర్తి మెజారిటీతో గెలిచింది. కానీ 2024లో మాత్రం బీజేపీ 240 సీట్ల దగ్గరే ఆగిపోయింది. దాంతో మోడీ మూడవసారి ప్రధానిగా గద్దెనెక్కింది మాత్రం ఎన్డీయే మిత్రుల మద్దతుతోనే అని చెప్పక తప్పదు.
కత్తి మీద సాముగా :
ఇక దేశంలో రాజకీయం మారుతోంది. బీజేపీకి కత్తి మీద సాముగా మారుతోంది. యువత ఇపుడు కేంద్ర ప్రభుత్వం తీరు మీద ఆగ్రహంగా ఉన్నారు. అలాగే రైతులతో పాటు వివిధ వర్గాల వారు కూడా అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీకి 240 నంబర్ వచ్చింది అంటే అది 2029లో 300 సీట్లుగా పెరుగుతుంది అనుకుంటే ఇప్పటికి రెట్టింపు జనాదరణ కనిపించాలి. కానీ గ్రౌండ్ లో చూస్తే బీజేపీకి ఆదరణ తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇంకా తక్కువ సీట్లు వస్తాయని రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ముందే చెప్పుకున్నట్లుగా మోడీ ఇమేజ్ అన్నది నెమ్మదిగా కరుగుతోంది అని అంటున్నారు. ఒకనాడు మోడీకి వ్యతిరేకంగా నిరసనలు చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఉంది. ఇపుడు అలా కాదు మోడీ ప్రభుత్వం మీద విద్యార్ధి లోకం ఎదురు నిలిచి పోరాడి కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించింది. ఇంకా కేంద్ర ప్రభుత్వానికి మూడేళ్ళు అధికారం ఉంది. రెండేళ్ళకే ఈ మాదిరి వ్యతిరేకత ఉంటే రానున్న కాలంలో అది పెరిగి పెద్దది అవుతుందని కూడా అంచనా వేస్తున్న వారు
గాలి మారిందంటే :
ఎంతటి నేత అయినా ప్రజాస్వామ్య ప్రక్రియలో పరాజితులు అయిన సందర్భాలే ఉన్నాయి. ప్రజాస్వామ్యం అంటేనే నిరంతర మార్పు. ఎవరైనా మహా నాయకుడు అయితే నచ్చితే ఆయనను మరిన్ని సార్లు ఎన్నుకుంటారు. కానీ శాశ్వతంగా పట్టం కట్టే పరిస్థితి ఉండదు, కానీ మోడీని ఢీ కొట్టే నాయకుడు లేడని ఆయనకు ఓటమి లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగాపురం సభలో చేసిన వ్యాఖ్యలు అయితే ఇపుడు సంచలనం రేపుతున్నాయి. పవన్ కూడా రాజకీయంగా పుష్కర కాలం పైగా ఉన్నారు. రెండేళ్ళుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఊరకే చేయరు కదా ఆయనకు ఉన్న అంచనాలు ఉంటాయి కదా అన్న మాట కూడా ఉంది.
సాధ్యమయ్యేనా :
మోడీ తాను ఇక ఈ రాజకీయాలు ఈ పదవి వద్దు అని అనుకునేంతవరకూ ఆయనే ప్రధాని అని కూడా పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ ఇంతలా మోడీ గురించి బలమైన అంచనాలు పెట్టుకుని చెప్పడం వెనక ఒక రీజన్ అయితే ఉంది. మోడీ సరిసాటి నాయకుడు అయితే ఈ రోజున కూడా దేశంలో లేరు, ఆయన ఆసేతు హిమాచలానికి తెలిసిన నాయకుడు. సర్వామోదం పొందిన వారు, ఆయనకు ఆపొజిట్ లో ప్రధాని రేసులో ఉన్న వారు ఎవరైనా ఢీ కొట్టడం కష్టమే. కానీ బలమైన నాయకత్వం ఉన్నపుడు విపక్షాలు ఏకం కావడం అంతా చూశారు. ఇపుడు ఇండియా కూటమి అదే చేస్తోంది. ఆ కూటమి గట్టిగానే ఉంది. మరిన్ని పార్టీలు కూడా చేరే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద అసంతృప్తిని కనుక తమ వైపు తిప్పుకుంటే ప్రజా స్వామ్యంలో ఏమైనా జరగవచ్చు. ఎన్ని వ్యూహాలు వేసినా ఎంత చాణక్య రాజకీయం చేసినా కూడా ప్రజల ముందు అవన్నీ తేలిపోతాయి. ఎందుకంటే అంతిమ తీర్పు వారి చేతులలోనే ఉంటుంది కాబట్టి మొత్తం మీద పవన్ చేసిన వ్యాఖ్యలు మోడీ అజేయుడు గా ఉన్న ట్రాక్ రికార్డుని చూసి అని ఉండొచ్చు. అదే విధంగా ఆయన మీద ఆరాధన భావం తో కూడా చేసి ఉండొచ్చు. కానీ ఎన్నికల్లో తీర్పు ఎపుడూ విలక్షణంగానే ఉంటుంది. చూడాలి మరి మోడీ 2029 లో ప్రజా తీర్పుతో గెలిచి పవన్ మాటను నిజం చేస్తారా లేదా అన్నది.
